Begin typing your search above and press return to search.

మణిపుర్‌ మరో ఘోరం.. అదృశ్యమైన విద్యార్థుల దారుణ హత్య!

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ రెండు వర్గాల మధ్య ఘర్షణలతో నాలుగు నెలలుగా అట్టుడుకుతూనే ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Sep 2023 9:39 AM GMT
మణిపుర్‌ మరో ఘోరం.. అదృశ్యమైన విద్యార్థుల దారుణ హత్య!
X

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ రెండు వర్గాల మధ్య ఘర్షణలతో నాలుగు నెలలుగా అట్టుడుకుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో కుకీ, మైతీ కమ్యూనిటీల మధ్య రాజుకున్న వైరం చినికి చినికి గాలివానగా మారింది. ఇలా పూర్తి హింసాత్మకంగా మారిన ఈ విషయంపై సర్కార్ సరిగ్గా స్పందించలేకపోయిందనే కామెంట్లు వినిపించాయి.

ఈ క్రమంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఈ విషయంపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. ఇక ఈ ఇష్యూపై ప్రధానితో మాట్లాడించేందుకు పార్లమెంటులో విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడిప్పుడే హింసాకాండ నుంచి రాష్ట్రం కోలుకుంటుందనే వార్తలు వస్తున్న తరుణంలో... అల్లర్లు మళ్లీ తలెత్తాయి.

అవును... ఇప్పుడిప్పుడే మణిపూర్ కాస్త కుదురుకుంటుంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరో అఘాయిత్యం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థుల అదృశ్యం, హత్య ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్ అయ్యింది. విద్యార్థుల మరణానికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పుకొచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... మైతీ వర్గానికి చెందిన వారిగా చెబుతున్న ఇద్దరు విద్యార్థులు హిజామ్‌ లిన్‌ తో ఇంగంబి (17), ఫిజాం హేంజిత్‌ (20) జూలై నుంచి కనిపించడం లేదు. అయితే, తాజాగా వారు అడవిలోని గడ్డి మైదానంలో కూర్చుని ఉండగా.. వారి వెనకాల కొంచెం దూరంలో సాయుధ గ్రూప్‌ కు చెందిన ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట్లో ప్రత్యక్షమైంది.

మరో ఫోటోలో ఇద్దరి మృతదేహాలను నేలపై పడేసినట్లు కనిపిస్తుంది. ఈ ఫోటోలు వైరల్‌ గా మారాడంతో మణిపూర్‌ ప్రభుత్వం స్పందించింది. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించినట్లు పేర్కొంది. రాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారంతో విచారిస్తున్నట్లు వెల్లడించింది.

అయితే... ఆ ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన దృశ్యాలు పలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని తెలుస్తుంది. అయినప్పటికీ వారి ఆచూకీని కనిపెట్టకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. కుకీ మిలీషియానే ఈ దారుణానికి తెగబడిందని మైతీ వర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా.. కాగా మణిపూర్‌ లో జాతుల మధ్య నెలకొన్న గొడవల కారణంగా మే 3న జాతి హింస చెలరేగడంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 3,000 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హింసను నియంత్రించడంకోసం... రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను తీసుకురావడం కోసం రాష్ట్ర పోలీసులతో పాటు సుమారు 40,000 మంది కేంద్ర భద్రతా సిబ్బంది మోహరించారని అంటారు!