మామిడి చెట్లు కొట్టే ముందు జాగ్రత్త.. అనుమతి లేకుండా నరికితే రూ.2.66కోట్ల ఫైన్
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఐదుగురు వ్యక్తులు అనుమతి లేకుండా ఏకంగా 17 మామిడి చెట్లను నరికేశారు.
By: Tupaki Desk | 8 May 2025 2:30 AMఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఐదుగురు వ్యక్తులు అనుమతి లేకుండా ఏకంగా 17 మామిడి చెట్లను నరికేశారు. ఈ ఘటన జరిగి 6 ఏళ్లు గడిచింది. ఇప్పుడు దీనిపై చర్యలు తీసుకున్నారు. ఆ ఐదుగురు నిందితులపై రూ.2.66 కోట్ల పర్యావరణ నష్టం కలిగించారంటూ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అనుమతి లేకుండా మామిడి చెట్లు నరికినందుకు ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం ఇదే మొదటిసారి. ఈ కేసు మొదటి విచారణ మే 20, 2025న జరగనుంది.
అసలు విషయం ఏంటంటే.. 2019 నవంబర్ 17న యూసుఫ్‌పూర్ హమీద్ గ్రామంలోని బ్రిజ్‌పాల్ సింగ్ పొలంలో 17 మామిడి చెట్లను చట్టవిరుద్ధంగా నరికివేశారని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. చెకింగ్ సమయంలో చెట్లను ఎటువంటి అనుమతి లేకుండా నరికి, వాటి మొద్దులను ఒక ట్రాక్టర్‌లో లోడ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అధికారులు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురు వ్యక్తులపై ఉత్తరప్రదేశ్ వృక్ష సంరక్షణ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసులో బ్రిజ్‌పాల్ సింగ్, మజహర్, యామిన్, తహజీబ్, షాహిద్‌లను నిందితులుగా పేర్కొన్నారు. 2025 మార్చి 17న నిందితులకు తమ వాదన వినిపించడానికి పోస్ట్ ద్వారా నోటీసులు పంపారు. కానీ వారు కోర్టుకు హాజరు కాలేదు. దీని ఆధారంగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు అటవీ శాఖ భావించింది.
విచారణలో నరికిన చెట్ల వయస్సు దాదాపు 15 సంవత్సరాలు అని తేలింది. సుప్రీంకోర్టు కేంద్ర పర్యావరణ కమిటీ ప్రమాణాల ప్రకారం.. ఒక చెట్టును నరికితే ఏడాదికి రూ.74,500 పర్యావరణ నష్టం జరుగుతుంది. ఈ లెక్కన 17 చెట్లను నరికితే మొత్తం నష్టం రూ.2,65,96,500గా అంచనా వేశారు. దీనితో పాటు అటవీ శాఖ రూ.85,000 అదనపు జరిమానా కూడా విధించింది. అటవీ శాఖ ఐదుగురు నిందితులపై మొత్తం రూ.2,66,81,500 జరిమానా విధించాలని సిఫార్సు చేస్తూ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (CJM) కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసు మొదటి విచారణ మే 20, 2025న జరగనుంది.