ఒకే చెట్టుకు 350 రకాల మామిడి పండ్లు: `మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియా` అద్భుత సృష్టి
ఎలాంటి వ్యవసాయ విద్య లేకుండానే అతడు ఈ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు.
By: Sivaji Kontham | 9 Jun 2026 11:00 PM ISTఎలాంటి వ్యవసాయ విద్య లేకుండానే అతడు ఈ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఒకే మామిడి చెట్టుకు 350 రకాల జాతుల కాయలను కాసేలా చేసినన ఘనత ఆయనది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌లోని మలిహాబాద్ ప్రాంతానికి చెందిన కలిముల్లా ఖాన్ ఎలాంటి అధికారిక శాస్త్ర సాంకేతిక శిక్షణ పొందకపోయినా.. భారతదేశంలోనే అత్యంత పాపులర్ హార్టికల్చరిస్ట్ (తోటల పెంపకందారుడు)గా గుర్తింపు పొందారు. `మ్యాంగో మ్యాన్ ఆఫ్ ఇండియా`గా పాపులర్ అయిన ఈ 84 ఏళ్ల పద్మశ్రీ అవార్డు గ్రహీత, గ్రాఫ్టింగ్ (అంటుకట్టడం) ప్రక్రియలో దశాబ్దాల పాటు చేసిన ప్రయోగాల ఫలితంగా ఒకే ఒక్క మామిడి చెట్టుకు ఏకంగా 350కి పైగా విభిన్న రకాల మామిడి పండ్లను పండించి సరికొత్త రికార్డు సృష్టించారు. అల్ఫోన్సో, దసహేరి, కేసర్, లంగ్డా, చౌసా వంటి ఎన్నో రకాల మామిడి పండ్లను ఒకే వేరు ఉన్న చెట్టు నుండి ఉత్పత్తి చేస్తూ... ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను, పండ్ల ప్రేమికులను తన తోట వైపు ఆకర్షిస్తున్నారు.
కలిముల్లా ఖాన్ హార్టికల్చర్ ప్రయాణం పాఠశాలల్లోనో లేదా సైంటిఫిక్ లాబొరేటరీల్లోనో ప్రారంభం కాలేదు. నిజానికి ఆయన ఏడవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో చదువు మానేసి తన తండ్రికి చెందిన మామిడి తోటలో సమయాన్ని గడపడం ప్రారంభించారు. 1950వ దశకం చివరలో ఒకే చెట్టుపై రకరకాల మామిడి పండ్లను పండించాలనే ఆలోచనతో ఆయన గ్రాఫ్టింగ్ ప్రయోగాలు మొదలుపెట్టారు. ప్రారంభంలో వరదల వల్ల ఆయన నాటిన మొదటి చెట్టు చనిపోవడంతో నిరాశపడ్డాడు. ఆ తర్వాత చేసిన ప్రయోగాలు సఫలం కాలేదు. అపజయాలు ఎదురైనా అతడు మాత్రం వెనకడుగు వేయలేదు. అతడికి ఆరంభమే ఎదురైన సవాళ్ల నుండి చాలా నేర్చుకున్నాడు. నేల స్వభావాన్ని, డ్రైనేజీ వ్యవస్థలను, పర్యావరణ మార్పులను అధ్యయనం చేసి చివరకు 1980వ దశకంలో తన తోటలోని దాదాపు 125 ఏళ్ల నాటి ఒక పాత మామిడి చెట్టును ఆధారం చేసుకుని ఈ భారీ ప్రయోగాన్ని విజయవంతం చేశారు.
వ్యవసాయ రంగంలో ఒక మొక్క కొమ్మను మరొక చెట్టు కొమ్మకు జోడించి కలిసి పెరిగేలా చేసే `గ్రాఫ్టింగ్` ప్రక్రియ కొత్తదేమీ కాకపోయినా.. వందలాది రకాలను ఒకే చెట్టుపై దశాబ్దాల పాటు సజీవంగా ఉంచడం అనేది కలిముల్లా ఖాన్ అంకితభావానికి, శ్రమకు నిదర్శనం. ఈ 125 ఏళ్ల నాటి విశిష్టమైన చెట్టుపై పెరిగే ప్రతి మామిడి రకం దాని సహజ గుణాలను, రుచిని, రంగును, సువాసనను కోల్పోకుండా అలాగే నిలుపుకోవడం విశేషం. కొన్ని చిన్నగా, పీచుతో ఉంటే.. మరికొన్ని తీపి గుజ్జుతో ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. తన ప్రయోగాల ద్వారా సృష్టించిన కొన్ని హైబ్రిడ్ రకాల మామిడి పండ్లకు ఆయన సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, నరేంద్ర మోదీ, ఐశ్వర్యా రాయ్ వంటి ప్రముఖుల పేర్లను కూడా పెట్టారు.
గడిచిన సంవత్సరాలలో కలిముల్లా ఖాన్ తోట కేవలం ఒక వ్యవసాయ క్షేత్రంగానే కాకుండా భారతదేశంలోని మామిడి జీవవైవిధ్యాన్ని కాపాడే ఒక `సజీవ ఆర్కైవ్`గా రూపాంతరం చెందింది. దేశంలోని పలు ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన విలక్షణమైన మామిడి రకాలను సేకరించి అతడు ఒకే చోటుకు తీసుకువచ్చారు. భారతదేశంలో మామిడి అనేది కేవలం ఒక సీజనల్ పండు మాత్రమే కాదు.. అది ఇక్కడి ఆహార సంస్కృతి, ప్రాంతీయ గుర్తింపు, పచ్చళ్లు, స్వీట్లు వంటి అలవాట్లతో ముడిపడి ఉందనే సత్యాన్ని ఈ తోట నిరూపిస్తుంది. ఇరాన్, దుబాయ్ వంటి విదేశాల నుండి కూడా పరిశోధకులు, రైతులు ఈ అంటుకట్టే విధానాన్ని అధ్యయనం చేయడానికి మలిహాబాద్‌కు వస్తుంటారంటే అతడు ఎంత ఫేమస్సో అర్థం చేసుకోవాలి.
కలిముల్లా ఖాన్ చేసిన ఈ అద్భుత సేవలకు గాను భారత ప్రభుత్వం 2008లో ఆయనను `పద్మశ్రీ` పురస్కారంతో సత్కరించింది. అలాగే ఆయన సృష్టించిన వింత చెట్టు `లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్`లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం వయోభారం, ఆరోగ్య కారణాల వల్ల ఆయన రోజువారీ పనులకు దూరంగా ఉంటున్నా.. ఆయన కుమారుడు నాజిముల్లా ఖాన్ ఈ అంటుకట్టిన చెట్లను రక్షిస్తూ తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పట్టుదల, శ్రమ ఉంటే ఎడారిలోనూ మామిడి తోటలను పెంచవచ్చని నమ్మే కలిముల్లా ఖాన్ .. అతడు పెంచిన 125 ఏళ్ల నాటి వృక్షం.. వ్యక్తిగత అభిరుచి, నిరంతర ప్రయోగాలు దేశపు వ్యవసాయ పద్ధతులపై ఎంతటి చెరగని ముద్ర వేయగలవో చాటిచెబుతున్నాయి.
