Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలో ఓటు వేయకుంటే ఫైన్.. ఎందుకంటే?

ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమిటంటే.. ఈ రోజు ఆ దేశ పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   3 May 2025 10:00 PM IST
Australia’s 100-Year-Old Law That Makes Voting Compulsory
X

ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు కామన్. ఆ సందర్భంగా నిర్వహించే పోలింగ్ వేళ ఓటు వేస్తారా? వేయరా? అన్నది ఆయా ప్రజల ఇష్టానికి ఉంటుంది. ప్రపంచం మొత్తం ఇలానే ఉంటుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. కొన్ని దేశాల్లో ఓటు వేయకపోవటం నేరం. ఓటు వేయకుండా ఉండిపోతే.. ఫైన్ షాక్ తప్పదు. విన్నంతనే విచిత్రంగా అనిపించినా ఇది నిజం. అలాంటి నిబంధనను పక్కాగా ఫాలో అయ్యే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఈ దేశంలో ఓటు వేయటం అన్నది నిర్బంధం. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమిటంటే.. ఈ రోజు ఆ దేశ పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్నాయి.

అందుకే ఇక్కడి నిర్బంధ ఓటు విధానం గురించి మరోసారి చర్చకు వచ్చింది. కంగారుల దేశంలో మొత్తం 1.8 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. వారు ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. ఇక్కడి నిర్బంధ ఓటు విధానం గడిచిన వందేళ్లుగా ఉండటం మరో ఆసక్తికర అంశం. ఈ దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాల్సిందే. ఇది చట్టపరమైన బాధ్యత. ఈ రూల్ ను పాటించి తీరాల్సిందే. ఒకవేళ అందుకు భిన్నంగా వ్యవహరిస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ప్రపంచంలో అత్యధికంగా పోలింగ్ నమోదయ్యే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. 2022లో జరిగిన ఎన్నికల్లో ఈ దేశ పోలింగ్ శాతం 90. గత ఏడాది బ్రిటన్ లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ కేవలం 60 శాతమే. ప్రపంచంలోని పలు దేశాలు ఎన్నికల వేళ ఓటర్లు తమ ఓటు వేసేందుకు వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ఆస్ట్రేలియాలో మాత్రం అందుకు భిన్నంగా ఓటర్లు ఎంతో ఆసక్తితో ఓటు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు.

1924లో ఆ దేశంలో ఎన్నికల చట్టాన్ని సవరించారు. ఫెడరల్ ఎన్నికల్లో ఓటు వేయటం తప్పనిసరి చేశారు. ఒకవేళ ఫెడరల్ ఎన్నికల్లో ఓటు వేయకుంటే వారు 20 డాలర్లు.. రాష్ట్ర (ప్రావినెన్స్) ఎన్నికల్లో ఓటు వేయకుంటే 79 డాలర్ల వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టానికి ముందు జరిగిన ఎన్నికల్లో 60 శాతం కూడా పోలింగ్ నమోదయ్యేది కాదు. ఎప్పుడైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చారో.. ఆ తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో పోలింగ్ శాతం 91గా నమోదు కావటం గమనార్హం.

నిర్బంద ఓటింగ్ కారణంగా.. ప్రజలు ఎన్నుకున్న పాలకులు మరింత బాధ్యతగా పని చేస్తారన్న భావన బలంగా ఉంటుంది. మరి.. ప్రత్యేక కారణాలు ఉన్నప్పుడు ఓటు వేయకుంటే? అన్న ప్రశ్నకు అలాంటి వాటికి మినహాయింపులు ఉండనే ున్నాయి. నిర్బంధ ఓటింగ్ పైన ఆస్ట్రేలియా పౌరుల్లో ఎలాంటి ఫిర్యాదు లేదు. అన్నిచోట్ల ఉన్నట్లే.. ఎంత మంచి కార్యక్రమం అయినా దానికి ఏదో ఒక పాయింట్ బయటకు తీసి.. అందుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉంటారు.

ఆస్ట్రేలియాలోని నిర్బంధ ఓటింగ్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడే సెక్షన్ ఉంది. కాకుంటే.. వారికి మద్దతు ఇచ్చేవారు చాలా చాలా తక్కువ. ఓటు వేయాలా? వద్దా? అన్న హక్కు ప్రజలకు ఉండాలన్నది వారి వాదన. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. నిర్బంధ ఓటింగ్ విధానం అమల్లో లేకున్నా తాము తప్పక ఓటు వేస్తామని 77 శాతం మంది ఆస్ట్రేలియన్లు చెప్పటం చూస్తే.. ఆ సమాజం ఎంత బాధ్యతగా ఉందన్న విషయం అర్థమవుతుంది.

ఇక్కడో మరో ఆసక్తికర అంశం ఉంది. పోలింగ్ ఎప్పుడు శనివారమే నిర్వహిస్తారు. ఈ కారణంగా వీకెండ్ వేళ.. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు.. కార్మికులు.. ఉద్యోగులకు ఓటు వేసే రోజును వేతనంతో కూడిన సెలవుగా ఇస్తారు. ఈ కారణంతోనే ఆస్ట్రేలియాలో ఎన్నికల పోలింగ్ అంటే.. పండుగ వాతావరణం తలపించేలా పరిస్థితులు ఉంటాయి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఇలాంటి తీరు ఉంటే.. ఆ దేశం ప్రగతిపధంలో నడవటం ఖాయం.