Begin typing your search above and press return to search.

వాలంటీర్లు సిద్ధం… జగన్ కోసం మండపేటలో 800 మంది రాజీనామా!

ఈ సమయంలో వాలంటీర్లు రాజీనామాలు చేసినా కూడా.. ఎన్నికల్లో వారి పాత్రను అడ్డుకోవాలంటూ ఫిర్యాదులు చేస్తున్నవారు ఇంకొందరని చెబుతున్నారు!

By:  Tupaki Desk   |   15 April 2024 12:27 PM GMT
వాలంటీర్లు సిద్ధం… జగన్  కోసం మండపేటలో 800 మంది రాజీనామా!
X

ఎన్నికలు సమీపించిన వేళ ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఎంత హాట్ టాపిక్ అనే సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికి చేరవేయడంలో వాలంటీర్ల పాత్ర అమోగం అనే చెప్పాలి. ఇక కరోనా కష్టకాలంలో వాలంటీర్ల సేవలు అద్భుతః అనే వర్ణించాలి. ఇలా పరిస్థితి ఏదైనా.. ప్రభుత్వానికి - సంక్షేమ పథకాల లబ్దిదారులకూ వారధులుగా ఉంటూ వచ్చారు ఈ వాలంటీర్లు!

ఇంకా గట్టిగా చెప్పాలంటే... ఏపీలో సంక్షేమ పథకాలు తీసుకునే లబ్దిదారులందరికీ ఒక్కో వాలంటీర్ ఒక్కో శ్రేయోభిలాషి, ఒక్కో ఆపద్భాందవుడు మాదిరి అని చెప్పినా అతిశయోక్తి కాదేమో! “ప్రజలకు సేవ చేయడమే జగన్ ఎజెండా అయితే... ఆ సేవకు తమవంతు సాయం చేయడమే తమ ఎజెండా” అన్నట్లుగా ఏపీలో వాలంటీర్లు పనిచేస్తున్నారనే కామెంట్లు నిత్యం వినిపిస్తుంటాయి! ఇలాంటి వాలంటీర్లు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి!

అవును... ఏపీలో వాలంటీర్లు ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఒకరంటే.. వారు చేసే సంక్షేమ పథకాల అందజేత పనులను సైతం అడ్డుకుని.. లబ్ధి దారులను ఇబ్బందులు పెట్టింది మరొకరని అంటుంటారు! ఈ సమయంలో వాలంటీర్లు రాజీనామాలు చేసినా కూడా.. ఎన్నికల్లో వారి పాత్రను అడ్డుకోవాలంటూ ఫిర్యాదులు చేస్తున్నవారు ఇంకొందరని చెబుతున్నారు! ఈ సమయంలో... వాలంటీర్లు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తమపై అవాకులూ చెవాకులూ పేళుతూ.. తమ విధులకు పూర్తిగా అడ్డు తగులుతూ.. తమపై బురద జల్లుతూ.. తమపై చెప్పుకోలేని స్థాయిలో విమర్శలు చేస్తూ.. తమతో అన్ని రకాలుగానూ పనిగట్టుకుని కొంతమంది నేతలు, అధినేతలు ఇబ్బందిపెడుతున్నారంటూ... రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వాలంటీర్లు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా మండపేటలోని 800 మంది గ్రామ/వార్డు వాలంటీర్లు రాజీనామా చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది!

ఈ సందర్భంగా మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సమక్షంలో ఒక్క చోట కలుసుకున్న ఈ వాలంటీర్లంతా ముక్తకంఠంతో... "జగనన్న కోసం తామంతా సిద్ధం" అంటూ నినాదాలు చేయడం ఇప్పుడు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇదే క్రమంలో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలోనూ వాలంటీర్లు ఈ తరహా ఆలోచనలు చేస్తున్నారా అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది!

తామంతా నీతిగా, నిజాయితీగా, ఎక్కడా అవినీతికి తావు లేకుండా, ప్రజాశ్రేయస్సు కోరి, వృద్ధుల అవస్థలు అర్ధం చేసుకుని సేవ చేస్తుంటే... తమపై అత్యంత దారుణంగా విమర్శలు చేశారని.. మానసిక దాడులకు పాల్పడ్డారని.. తమ తమ క్యారెక్టర్ల అసాసినేషన్ కి పూనుకున్నారని వాలంటీర్లు ఫైరవుతున్నారు. ఈ సమయంలో తామంతా ఇప్పుడు జగనన్న కోసం పనిచేస్తామని.. ఇప్పుడు తమను ఎవరాపుతారో చూస్తామని.. తామంతా “సిద్ధం” అని ప్రకటిస్తున్నారని తెలుస్తుంది.

కాగా... సుమారు 58 నెలలపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్దిదారులకు చేరవేసి ఆత్మసంతృప్తి చెందుతున్న వాలంటీర్లపై అక్కసుతో పలువురు పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే! అయితే.. ఎన్నికల సీజన్ రావడంతో... నిన్న మొన్నటివరకూ వాలంటీర్లను దూషించిన నోర్లే... వారు గొప్పవారని, వారి సేవలు రాష్ట్రానికి అవసరం అని మాట్లాడుతున్న పరిస్థితి!

ఈ సమయంలో... వంచనకు గురయ్యేటంత అమాయకులం తాము కాదని.. ఇక తమపై విమర్శలు ఆపమని.. తాము నేటి నుంచి వాలంటీర్లము కాదని.. జగనన్న సైనికులం అని మండపేటలో ఒకేసారి 800 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. “సిద్ధం” అంటున్నారు!