Begin typing your search above and press return to search.

వంద సెకన్ల ఈ వీడియో చెప్పేస్తుంది విశ్వరూప మహాసభ రేంజ్ ఎంతో?

ఎలాంటి అంచనాలు లేకుండా సాగే కొన్ని కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయేలా చేస్తాయి.

By:  Tupaki Desk   |   12 Nov 2023 8:15 AM GMT
వంద సెకన్ల ఈ వీడియో చెప్పేస్తుంది విశ్వరూప మహాసభ రేంజ్ ఎంతో?
X

ఎలాంటి అంచనాలు లేకుండా సాగే కొన్ని కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయేలా చేస్తాయి. అలాంటిదే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభ. ఈ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావటం ఒక ఎత్తు అయితే.. ఎస్సీ వర్గీకరణ విషయంలో తన స్టాండ్ ను ఆయన చెప్పారు. ప్రస్తుతం న్యాయస్థానాల్లో ఉన్న ఈ అంశంపై తనకున్న కమిట్ మెంట్ ను ఆయన చెప్పకనే చెప్పేశారు. నిజానికి ఈ మహాసభను బీజేపీ ఏర్పాటు చేయలేదు. మాదిగల తరఫున పోరాటం చేసే మందక్రిష్ణ మాదిగ ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. హైదరాబాద్ మహానగరంలో మోడీ పాల్గొన్న బహిరంగ సభల్లోఇదే హైలెట్ అని చెబుతున్నారు.

సొంత పార్టీకి చెందిన బీజేపీ సైతం నిర్వహించలేనంత భారీగా మాదిగ విశ్వరూప మహాసభ జరగటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సభ ప్రారంభ వేళలో సాదాసీదా సభగా అనిపించినా.. సమయం గడిచే కొద్దీ వచ్చిన సభికుల్ని చూసిన తర్వాత నోట మాట రాకుండా పోయింది. ఒక అంచనా ప్రకారం తక్కువలో తక్కువ 2 లక్షల మంది వరకు ఈ బహిరంగ సభకు హాజరైనట్లుగా చెబుతున్నారు. తాజా సభతో మరోసారి తన సత్తా ఏమిటో చాటుకున్నారు మందక్రిష్ణ మాదిగ.

సభ సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుందని చెప్పినప్పటికీ సాయంత్రం ఆరు గంటల సమయానికి సైతం ఒక మోస్తరుగానే సభ ఉంది. కానీ.. ఎప్పుడు వచ్చారో.. ఎక్కడి నుంచి వచ్చారో అన్నది అర్థం కాని రీతిలో అరు గంటల నుంచి ఆరున్నర గంటల ప్రాంతంలో వెల్లువలా వచ్చిన సభికులతో కార్యక్రమం స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. ఒక వ్యక్తి.. ఒక సంస్థ నిర్వహించిన బహిరంగ సభ ఇంత భారీగా ఉండటం ఆసక్తికరంగా మారింది.

దీనికి తోడు.. తీవ్రమైన భావోద్వేగానికి గురైన మందక్రిష్ణను.. ప్రధాని నరేంద్ర మోడీ అదే పనిగా ఊరడించటం.. ఆయన వీపును పదే పదే నిమరటం.. దగ్గరకు తీసుకోవటం లాంటి సన్నివేశాలు అందరిని ఆకర్షించేలా చేశాయి. దీనికి సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. వంద సెకన్ల నిడివి ఉన్న వీడియోను చూస్తే.. విశ్వరూప మహాసభ రేంజ్ ఏమిటో ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.