మందక్రిష్ణకు భారీ పదవి.. చంద్రబాబు ఓకే చెప్పారా?
అవకాశాల కోసం.. పదవుల కోసం ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూసే వారు ఎందరో. అందుకు భిన్నంగా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అనూహ్యంగా పదవుల్ని సొంతం చేసుకునే లక్కీ నేతలు కొందరు ఉంటారు.
By: Tupaki Desk | 23 April 2025 11:26 AM ISTఅవకాశాల కోసం.. పదవుల కోసం ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూసే వారు ఎందరో. అందుకు భిన్నంగా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అనూహ్యంగా పదవుల్ని సొంతం చేసుకునే లక్కీ నేతలు కొందరు ఉంటారు. ఇప్పుడు ఆ కోవలోకి మందక్రిష్ణ మాదిగ రానున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.
ఈ మధ్యన వైసీపీ నేత విజయసాయి రెడ్డి తన రాజ్యసభ పదవితో పాటు.. పార్టీకి రాజీనామా చేయటం తెలిసిందే. ఈ పోస్టు భర్తీకి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటివరకు ఈ పదవిని ఎవరికి కేటాయించాలన్న దానిపై పెద్ద ఎత్తున అంచనాలు తెర మీదకు వస్తున్న వేళ.. మందక్రిష్ణ మాదిగ పేరు బయటకు వచ్చింది. విజయసాయి రాజీనామాతో ఖాళీ అయిన పోస్టు భర్తీ నేపథ్యంలో జరిగే ఎన్నికకు మందక్రిష్ణ పేరును బీజేపీ సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ విషయంలో మందక్రిష్ణకు ఇచ్చిన మాటను నెరవేర్చిన ఎన్డీయే సర్కారు..ఇప్పుడు ఆ వర్గానికి చెందిన ఆయన్ను రాజ్యసభకు పంపటం ద్వారా.. ఎస్సీల పక్షపాతి అన్న ముద్రను సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్ షా.. కిషన్ రెడ్డిలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన్ను రాజ్యసభకు పంపే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని చంద్రబాబు ముందు పెట్టగా.. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. విజయసాయి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని తమ పార్టీ నేతలకు కేటాయించే కన్నా.. మందక్రిష్ణకు కేటాయించటం ద్వారా కలిగే రాజకీయ ప్రయోజనం ఎక్కువన్న వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయానికి చంద్రబాబు ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు.
అయితే.. ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు.. పార్టీ నాయకత్వం మాత్రం ధ్రువీకరించటం లేదు. ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మందక్రిష్ణకు అవకాశాలు ఎక్కువగా చెబుతున్నారు. ఒకవేళ.. అనూహ్య పరిణామాలుచోటు చేసుకుంటే ఆ స్థానాన్ని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకు కేటాయించే అవకాశం లేకపోలేదన్న మాట వినిపిస్తోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
