Begin typing your search above and press return to search.

‘విస్తరాకుల్లో భోజనం’ వివాదంపై క్లారిటీ ఇచ్చిన మందకృష్ణ

ఈ ఆరోపణలు వైరల్ కావడంతో, మందకృష్ణ స్వయంగా స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   3 March 2025 4:25 PM IST
‘విస్తరాకుల్లో భోజనం’ వివాదంపై క్లారిటీ ఇచ్చిన మందకృష్ణ
X

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మరోసారి వార్తల్లో నిలిచారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవడి పెళ్లి రిసెప్షన్‌లో జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వేడుకలో రాజకీయ ప్రముఖులందరికీ రాగి కంచాల్లో భోజనం వడ్డించగా, మందకృష్ణ మాదిగకు మాత్రమే విస్తరాకులో భోజనం ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు వైరల్ కావడంతో, మందకృష్ణ స్వయంగా స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చారు.

తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఈ వివాదంపై స్పందించిన ఆయన, తాను 150 మంది కార్యకర్తలతో కలిసి పెళ్లి రిసెప్షన్‌కు హాజరయ్యానని తెలిపారు. వెంకయ్య నాయుడు బయట ఉంటే స్వయంగా తనను తీసుకెళ్లి వాళ్ల మనవడికి పరిచయం చేయించి ఆశీర్వదింప చేశారని మందకృష్ణ తెలిపారు. తనకు విజయవాడలో ఒక షెడ్యూల్ ప్రకారం మీటింగ్ కు వెళ్లాల్సిన పని ఉండడంతో వీఐపీల కోసం వేచి ఉండకుండా తన కార్యకర్తలతో కలిసి భోజనం చేసి వేడుకను వీడినట్లు వివరించారు. కార్యకర్తలో కలిసి విస్తరాకుల్లో తినకపోతే నాకే అవమానం అంటూ మందకృష్ణ చెప్పుకొచ్చారు.

"నేను హడావుడిగా వెళ్లిపోయాక వీఐపీలు రాగి కంచాల్లో భోజనం చేశారు. నా తర్వాత జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకుని, నాపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఇది నా వ్యక్తిగత అవమానం కాదని స్పష్టం చేయాలనుకుంటున్నాను," అని మందకృష్ణ మాదిగ చెప్పారు.

ఈ వివాదంపై ఆయన క్లారిటీ ఇవ్వడంతో ఈ వ్యవహారంలో ఆయనపై జరుగుతున్నదంతా పుకారు అని మరింత స్పష్టతకు వచ్చింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, నిజానిజాలను తెలుసుకోవడం ముఖ్యం అని మందకృష్ణ స్పష్టం చేశారు.