వరుస వివాదాలపై ఎట్టకేలకు బయటపడ్డ మంచు మనోజ్
నటుడు మంచు మనోజ్ తన కుటుంబంలో జరుగుతున్న వివాదాల గురించి తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడారు.
By: Tupaki Desk | 10 April 2025 9:18 AMనటుడు మంచు మనోజ్ తన కుటుంబంలో జరుగుతున్న వివాదాల గురించి తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తి తగాదాలు లేవని స్పష్టం చేశారు. తనకు ఇల్లు లేదా ఇతర ఆస్తులపై ఎలాంటి ఆసక్తి లేదని మరోసారి తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యులు చేసిన కొన్ని పనుల కారణంగానే తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆయన అన్నారు.
మనోజ్ మాట్లాడుతూ "విద్యార్థుల భవిష్యత్తు గురించి ప్రశ్నించినప్పుడే ఈ గొడవలు మొదలయ్యాయి. దాదాపు రెండేళ్లుగా ఈ వివాదాలు కొనసాగుతున్నాయి. నేను ప్రశ్నించినందుకే నా పరువు తీసేలా తప్పుడు కథనాలు ప్రచారం చేశారు. నాపై దాదాపు 30 వరకు అబద్ధపు కేసులు పెట్టారు. నేను నా కుటుంబం కోసం చాలా చేశాను. ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నాకు వద్దు. మా నాన్నగారి సినిమాలన్నిటికీ మా అన్నయ్యకు చెందిన సంస్థలే పనిచేస్తాయి. 'సన్నాఫ్ ఇండియా' సినిమాలోని ఒక పాట యొక్క గ్రాఫిక్స్‌కు కోటిన్నర రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు. అది కేవలం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా చేయవచ్చు. ఈ గొడవల్లోకి నా భార్యను కూడా లాగారు. అలా చేయకుండా ఉంటే నేను ఈ పరిస్థితి వరకు వచ్చేవాడిని కాదు. తన వల్లే నేను చెడిపోతున్నానని స్టేట్‌మెంట్లు , ఎఫ్‌ఐఆర్‌లలో నా భార్య.. పిల్లల పేర్లు చేర్చడంతో నా హృదయం ముక్కలైంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఆస్తి కూడా అడగలేదు. కాబట్టి నేను దేనికీ భయపడను" అని అన్నారు. తనపై కక్ష సాధించడానికే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం నాడు తన కారు కనిపించడం లేదని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె పుట్టినరోజు వేడుకల కోసం తాను జైపూర్‌కు వెళ్లిన సమయంలో తన సోదరుడు విష్ణు ఇదంతా చేయిస్తున్నాడని ఆయన ఆరోపించారు. దీనిలో భాగంగానే బుధవారం ఉదయం జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి చేరుకున్న మనోజ్, గేటు బయటే నిరసన వ్యక్తం చేశారు. తన పెంపుడు కుక్కలు.. ఇతర వస్తువులు ఇంట్లో ఉన్నాయని, వాటిని తీసుకోవడానికి వచ్చానని ఆయన మీడియాతో చెప్పారు. ఇది ఆస్తి గొడవ కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తన జుట్టును విష్ణు చేతుల్లో పెట్టేందుకే ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.