పాస్‌పోర్ట్ పేజీలు చింపితే తప్పించుకోగలననుకున్నాడు! ఎయిర్‌పోర్ట్‌లో అడ్డంగా దొరికాడు!
తన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా భార్యకు తాను గతంలో బ్యాంకాక్ వెళ్లిన విషయాలు తెలియకుండా దాచిపెట్టడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి చివరకు కటకటాలపాలయ్యాడు.
By: Tupaki Desk | 17 April 2025 10:43 AM ISTతన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా భార్యకు తాను గతంలో బ్యాంకాక్ వెళ్లిన విషయాలు తెలియకుండా దాచిపెట్టడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి చివరకు కటకటాలపాలయ్యాడు. పూణేకు చెందిన 51 ఏళ్ల ఈ వ్యక్తి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులకు చిక్కాడు. అతను తన పాస్‌పోర్ట్‌లోని పేజీలను చింపేసినట్లు ఆరోపణలు రావడంతో ముంబై పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఇమ్మిగ్రేషన్ అధికారులను మోసం చేసేందుకు ప్రయత్నించడంతో అతడికి చట్టపరమైన చిక్కులు తప్పేలా లేవు.
ఫిర్యాదు నమోదు చేసిన ఇమ్మిగ్రేషన్ అధికారి రాజీవ్ రంజన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం తెల్లవారుజామున ప్రయాణికుడు ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌కు చేరుకున్నప్పుడు తను చేసిన అక్రమం బయటపడింది. అతను తన పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్‌ను చూపించగా, ఆ ప్రయాణికుడు వియత్నాం మీదుగా ఇండోనేషియా నుండి వచ్చినట్లు గుర్తించారు.
అధికారి మరింత క్షుణ్నంగా పరిశీలించగా, అతని పాస్‌పోర్ట్‌లోని కొన్ని పేజీలు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారి అతన్ని మరింత విచారణ కోసం తీసుకెళ్లారు. విచారణ సమయంలో దాదాపు ఒక సంవత్సరం క్రితం తాను గతంలో బ్యాంకాక్ వెళ్లిన వివరాలను తన కుటుంబ సభ్యులకు తెలియకుండా దాచిపెట్టడానికి కొన్ని పేజీలను చింపేసినట్లు ఆ ప్రయాణికుడు ఒప్పుకున్నాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఈ చర్యను అధికారిక ప్రయాణ పత్రాలను చట్టవిరుద్ధంగా తారుమారు చేయడంగా పరిగణించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు సహర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిపై పాస్‌పోర్ట్స్ చట్టంలోని సెక్షన్ 12, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 318(4) కింద కేసు నమోదు చేశారు.
