నువ్వు గొప్పోడివి సామీ.. భార్య కోసం మరో తాజ్ మహల్ కట్టిన భర్త
ప్రేమకు ప్రతీకగా నిలిచే తాజ్ మహల్ ను తలపించేలా ఓ భర్త తన భార్య కోసం ఇంటిని నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
By: Tupaki Desk | 17 Jun 2025 4:00 AM ISTప్రేమకు ప్రతీకగా నిలిచే తాజ్ మహల్ ను తలపించేలా ఓ భర్త తన భార్య కోసం ఇంటిని నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆనంద్ ప్రకాశ్ చౌక్సే అనే వ్యక్తి తన జీవిత భాగస్వామికి వినూత్నమైన కానుకను ఇచ్చాడు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తాజ్ మహల్ నమూనాలో 4 BHK విల్లాను నిర్మించి భార్యకు అందించాడు. ఈ విశేషం ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
-పాలరాయితో తయారు చేసిన తాజ్ మహల్ హౌస్
బుర్హాన్ పూర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ ప్రకాశ్ తన స్వంత పాఠశాల ప్రాంగణంలో తాజ్ మహల్ నమూనాలో ఇంటిని నిర్మించారు. అసలైన తాజ్ మహల్ లో వాడిన మక్రానా పాలరాయిని ఈ ఇంటి నిర్మాణానికి కూడా ఉపయోగించడం విశేషం. దీని డిజైన్, డోమ్స్, పిల్లర్లు, మిండోలు అన్నీ నిజమైన తాజ్ మహల్ ని తలపించేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- ఆగ్రా తాజ్ మహల్ కంటే పరిమాణం తక్కువ
ఈ ఇంటి పరిమాణం ఒరిజినల్ తాజ్ మహల్ కన్నా మూడింట ఒక వంతు మాత్రమే. అయినప్పటికీ దీని శిల్పకళ, నిర్మాణ శైలి అచ్చంగా ఆగ్రా తాజ్ మహల్ ను పోలి ఉంటుంది. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మించడం విశేషం. ఇంటి నిర్మాణానికి రూ.2 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఆనంద్ ప్రకాశ్ పేర్కొన్నారు.
- వైరల్ వీడియోలు.. లైక్స్, షేర్ల మోత
ఈ ఇంటికి సంబంధించిన వీడియోలను ప్రియం సామ్రాట్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో అది తెగ వైరల్ అయింది. ఇప్పటికే ఈ వీడియోకు 71 లక్షల లైక్స్, 51 లక్షల షేర్లు రావడం విశేషం. ఈ ఇంటిని చూసిన నెటిజన్లు "వావ్.. అద్భుతం!", "ఇది నిజంగా మినీ తాజ్ మహల్!" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
- నా భార్య ప్రేమకు ఈ ఇల్లు ప్రతిరూపం
"తాజ్ మహల్ ప్రేమకు చిహ్నం. నా భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తీకరించేందుకు ఇదే సరైన మార్గమని భావించాను. అందుకే ఆమె కోసం తాజ్ మహల్ నమూనాలో ఇంటిని నిర్మించాను" అని ఆనంద్ ప్రకాశ్ ఆనందంగా వెల్లడించారు. ఆయన చేసిన ఈ వినూత్న ప్రయత్నం నెట్టింట ప్రశంసల జల్లు కురిపిస్తోంది.
మొత్తంగా భార్యపై భర్త చూపిన ఈ అపురూప ప్రేమకు తాజ్ మహల్ హౌస్ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇది ప్రేమకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చినట్టే అని అందరూ అభిప్రాయపడుతున్నారు.
