Begin typing your search above and press return to search.

డబుల్ షాక్ : ఇండియా కూటమికి అటు మమత.. ఇటు ఆప్ దూరం...!

నితీష్ బీహార్ సీఎం గా దాదాపుగా రెండు దశాబ్దాల కాలం పూర్తి చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   24 Jan 2024 2:05 PM GMT
డబుల్ షాక్ : ఇండియా కూటమికి అటు మమత.. ఇటు ఆప్ దూరం...!
X

ఇండియా కూటమి పడుతూ లేస్తూనే సాగుతోంది. మొదట్లో ఉన్న ఉత్సాహం తరువాత అయితే లేదు. ఇండియా కూటమి అంటూ కాలికి బలపం కట్టుకుని తిరిగిన బీహార్ సీఎం నితీష్ ఇపుడు పెద్దగా చడీ చప్పుడూ చేయడంలేదు. పైగా ఇండియా కూటమి కన్వీనర్ పదవిని సైతం ఆయన సున్నితంగా తిరస్కరించారు. దానికి కారణం ఉంది. నితీష్ బీహార్ సీఎం గా దాదాపుగా రెండు దశాబ్దాల కాలం పూర్తి చేసుకుంటున్నారు. ఆయన ఏడున్నర పదుల వయసులో ఉన్నారు.

దాంతో ఆయన ఈసారి ప్రధాని పీఠానికే గురి పెట్టారు. దేశంలోని విపక్ష పార్టీలను కలిపి కూటమి కడితే తనకు ప్రధాని చాన్స్ వస్తుందని ఆయన నమ్మారు. అయితే ఈ మధ్యలో కాంగ్రెస్ కొంత బలపడింది. హిమాచల్ ప్రదేశ్, కర్నాటక తెలంగాణాలలో గెలిచింది. దాంతో కాంగ్రెస్ లో కొత్త ఆశలు మొలకెత్తాయి.

అదే ఇపుడు విపక్ష మిత్రులకు దూరం చేస్తోంది అని అంటున్నారు. దానికి తోడు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గె కూడా ఇండియా కూటమి గెలిస్తే ఆ తరువాత ప్రధాని అభ్యర్ధిని ఎన్నుకుంటామని నర్మగర్భ వ్యాఖ్యలు చేసి పీఎం పోస్ట్ ఆశావహులకు షాక్ ఇచ్చారు. పీఎం పదవి ఆశిస్తున్న వారిలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ లో 42 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈసారి మెజారిటీ సీట్లు తృణమూల్ కాంగ్రెస్ కి వస్తాయని అంటున్నారు. దాంతో మమతా బెనర్జీ కనీసం పాతిక నుంచి ముప్పయి ఎంపీలు గెలుచుకుంటే ప్రధాని పదవికి పోటీదారుగా ఉంటారు. అయితే ఆమె విషయంలో కూడా ఇండియా కూటమి పెద్దలు కొంత ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పశ్చిమ బెంగాల్ మీదుగా వెళ్తున్నా సమాచారం తనకు లేదని ఆమె మండిపడుతూ ఒంటరిగానే ఈసారి బెంగాల్ లో పోటీ అని అంటున్నారు. అది ఒక సాకు అని కూడా అంతా అంటున్న మాట. బెంగాల్ లో పొత్తులు ఉంటే కాంగ్రెస్ కమ్యూనిస్టులకు కూడా సీట్లు పంచాలి. అలా కాకుండా సోలోగా పోటీ చేస్తే ఎక్కువ సీట్లు గెలుచుకుని రేపటి రోజున కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే తాము కింగ్ మేకర్ పాత్ర పోషించాలన్నది మమత ఉద్దేశ్యం అంటున్నారు.

ఇక ఆప్ తీరు కూడా అలాగే ఉంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా తాజాగా సంచలన ప్రకటన చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీతో ఆప్ పొత్తు పెట్టుకోదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ తో పొత్తు లేకుండానే మొత్తం 13 లోక్ సభ స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని చెప్పారు.

అంతే కాదు లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లో ఆప్ క్లీన్ స్వీప్ చేస్తుందని యావత్ దేశంలోనే ఆప్ హీరోగా నిలుస్తుందని చెప్పారు. 13 లోక్ సభ స్థానాలకు గాను దాదాపు 40 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశామని తెలిపారు. ప్రతి సీటుపై సర్వే నిర్వహిస్తామని షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్ ఇస్తామని చెప్పారు.

ఇక ఆప్ అధినేత కేజ్రీవాల్ వ్యూహంలో ఇది భాగం అంటున్నారు. ఢిల్లీలో ఏడు ఎంపీ సీట్లు ఉన్నాయి. పంజాబ్ లో పదమూడు ఉన్నాయి. అంటే ఇరవై సీట్లలో ఆప్ మెజారిటీ గెలుచుకుంటుంది అన్న మాట. ఇవి కాకుండా యూపీ గుజరాత్ సహా అనేక రాష్ట్రాలలో ఆప్ పోటీకి దిగబోతోంది. కనెసంగా ఇరవై ఎంపీ సీట్లు ఉంటే 2024 ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం విషయంలో ఆప్ ని కీలకంగా మార్చవచ్చు అన్నది కేజ్రీవాల్ ఆలోచన అని అంటున్నారు

మొత్తం మీద చూస్తే ఇండియా కూటమి మీద ఇప్పటికే యూపీ మాజీ సీఎం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒంటరి పోరే అని ఆ మధ్య ఆయన ప్రకటించారు. బీఎపీ అధినేత్రి మాయావతి కూడా ఇండియా కూటమికి దూరం అని చెప్పేస్శారు. శరద్ పవార్ కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు.

మొత్తంగా చూసుకుంటే ఇండియా కూటమికి ఇబ్బందులు అయితే స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని దించాలన్న అజెండా వెనక్కి పోయి సొంత అజెండాతో పార్టీలు ముందుకు వస్తున్నాయి. అంతిమంగా ఇది బీజేపీకే మేలు చేస్తుందని అంటున్నారు అంతా.