ఉప్పు-నిప్పు ఎదురైన వేళ.. బెంగాల్‌లో తీవ్ర ఉత్కంఠ!
అగ్గిమీద గుగ్గిలం మాదిరిగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మమతా-సువేందు ఎదురెదురు పడిన వేళ.. అధికారులు హడలిపోయారు.
By: Garuda Media | 29 April 2026 2:26 PM ISTపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల 2వ దశ పోలింగ్ వేళ.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి.. మమతా బెనర్జీ భవానీ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి బరిలో నిలిచారు. ఈ రోజుఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
అయితే.. ఉదయం 11 గంటల సమయంలో సీఎం మమత.. తన సొంత నియోజకవర్గంలోని పోలింగ్ బూతుల్లో పర్యటించారు. ఈ సమయంలో ఆమె ఓ పోలింగ్ బూత్‌లో తిష్ఠవేశారు. అక్కడే ఓ కుర్చీ వేసు కుని కూర్చున్నారు. ఓ పది నిమిషాలకు.. బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి కూడా అక్కడకు చేరుకు న్నారు. వీరిద్దరు తారస పడడంతో భద్రతా సిబ్బంది అలెర్ట్ అయ్యారు. ఏం జరుగుతుందో అని భయ పడ్డారు. ఎందుకంటే.. ఇరువురు నాయకులు కూడా కారులు మిరియాలు నూరుతున్నారు.
అగ్గిమీద గుగ్గిలం మాదిరిగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మమతా-సువేందు ఎదురెదురు పడిన వేళ.. అధికారులు హడలిపోయారు. ఈ క్రమంలో సువేందు.. ఓటర్లకు మమతను చూపిస్తూ.. ``ఈమెను చూడండి.. దిగులుగా ఉంది.(ఏకవచనంతోనే) ఆమెకు ఎవరూ ఓటేయడం లేదు.`` అని వ్యాఖ్యానించారు. దీంతో మమత కూడా సూటిగానే స్పందించారు. ``మీరు రిగ్గింగ్ చేస్తున్నారు. అందుకే మీ ముఖం వెలిగిపోతోంది.`` అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
దీనిపై సువేందుకు కూడా అంతే సీరియస్‌గా బదులిచ్చారు. ``మీరు మా ఎన్నికల గుర్తుపై టేపు అంటించారు.`` అని వ్యాఖ్యానించారు. డైమండ్ హార్బర్ సహా ఫాల్తా నియోజకవర్గాల్లో వినియోగించిన ఈవీఎంలపై.. ఉన్న బీజేపీ గుర్తులపై ఎవరో టేపు అంటించారు. దీంతో బీజేపీ గుర్తు కనిపించలేదు. ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది.
దీనిపై విచారణ చేస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చింది. అవకతవకలు జరిగి ఉంటే.. ఆయా బూతుల్లో రీ పోలింగ్ పెడతామని స్ఫష్టం చేసింది. ఈ వ్యవహారాన్నే సువేందు అధికారి ప్రస్తావించారు. మొత్తంగా సీఎం మమత-సువేందులు ఒకే బూత్‌లో తారసపడడంతో ఏం జరుగుతుందోనన్న బెంగ పట్టుకున్నా.. తర్వాత ఇరువురూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.
