Begin typing your search above and press return to search.

ప్రధాని అభ్యర్థిగా రాహుల్...మమత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

గాంధీల వంశం ఐదవ తరం నాయకుడు రాహుల్ గాంధీకి ప్రధాని పదవి ఎంతెంత దూరం అంటే అంతే లేనిది అని బీజేపీ లాంటి పార్టీలు ఈ రోజుకీ ఎద్దేవా చేస్తూనే ఉంటాయి.

By:  Tupaki Desk   |   2 Oct 2026 9:10 AM IST
ప్రధాని అభ్యర్థిగా రాహుల్...మమత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
X

గాంధీల వంశం ఐదవ తరం నాయకుడు రాహుల్ గాంధీకి ప్రధాని పదవి ఎంతెంత దూరం అంటే అంతే లేనిది అని బీజేపీ లాంటి పార్టీలు ఈ రోజుకీ ఎద్దేవా చేస్తూనే ఉంటాయి. రాహుల్ గాంధీ జాతకంలో ప్రధాని యోగం లేదని ప్రత్యర్ధులు విమర్శిస్తూంటారు. ఆయన విపక్ష నేతగా ఉన్నంతవరకూ నరేంద్ర మోడీకి వచ్చిన ఇబ్బంది ఏదీ లేదని ఆయన హాయిగా ప్రధానిగా చిరకాలం ఉంటారని కాషాయం పార్టీ మద్దతు దారులు ధీమాగా చెబుతూంటారు. అటు తిప్పి ఇటి తిప్పి ఎలా చెప్పినా ప్రత్యర్ధులు కానీ రాహుల్ గాంధీ నాయకత్వం మీద విశ్వాసం ఉంచని వారు కానీ చెప్పే మాట ఒక్కటే. ఆయనకు ప్రధాని పీఠం ఆమడ దూరం అని. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి నాలుగు దశాబ్దాలుగా దక్కని చిక్కని ప్రధాని పదవిని రాహుల్ గాంధీ కనుక సాధించకపోతే ఇక కాంగ్రెస్ ఫ్యూచర్ ఏమిటి దానికంటే ముందు రాహుల్ తో సహా గాంధీల వంశం భవితవ్యం ఏమిటి అన్నదే అతి పెద్ద చర్చ.

ఇండీ కూటమిలోనే :

చిత్రమేంటి అంటే వారూ వీరూ అని కాదు ఇండియా కూటమిలోనే రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్ధిత్వం మీద గట్టిగా ఏ ఒక్క మిత్ర పక్షం నిలబడి చెప్పడంలేదు అని అంటున్నారు. ఈ మధ్యనే వామపక్షాలలో ఒకటి అయిన సీపీఎం అయితే ప్రధాని పదవికి అభ్యర్థి ఎవరు అన్నది ఇపుడు ఎందుకు చర్చ. అన్నట్లుగా మాట్లాడింది. ముందు కేంద్రంలో ఎన్డీయేని బీజేపీని గద్దె దించాలి, ఆ మీదట కదా ఇండియా కూటమి అభ్యర్ధిని నిర్ణయించేది అని చెప్పుకొచ్చింది. ఇక మిగిలిన పక్షాలు నోరు మెదపుకున్నా అదే ధోరణి అన్నట్లుగానే ఉన్నాయి.

మమత ఏమి చెప్పారు అంటే :

ఇపుడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఇదే మాట అంటున్నారు. ఆమె కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి భేటీకి ఆమె హాజరై అందరినీ ఆకర్షించారు. అంతే కాదు తనకు ఎలాంటి భేషజాలు లేవని చాటి చెప్పే ప్రయత్నం చేస్తూ వామపక్షాలతో సైతం కలిసేందుకు ఉత్సాహం చూపించారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ మీద పార్లమెంట్ లో విపక్షాలు అవిశ్వాసం ప్రకటించే తీర్మానం మీద పూర్తి మద్దతు ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో మమతకు మీడియా నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. 2029 ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ గాంధీకు మద్దతు ఇస్తారా అంటే దానికి మమత వ్యూహాత్మకమైన తీరులో జవాబు ఇచ్చారు. అది ఇప్పుడు అప్రస్తుతం అంటూ సమయం వచ్చినప్పుడు దాని మీద నిర్ణయిస్తామని చెప్పారు.

దీని భావమేమి దీదీ :

సమయం వచ్చినపుడు అంటే ఇపుడు ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ని తృణమూల్ కాంగ్రెస్ సమర్ధించడం లేదన్నదే అర్ధం అవుతోంది అంటున్నారు. అంతే కాదు 2029 నాటికి అంటే అప్పటికి రాజకీయంగా ఎన్ని పరిణామాలు మారుతాయో అని దీదీ లాంటి వారు ఎదురు చూస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటి అంటే దీదీ సహా చాలా మందికి ప్రధాని పీఠం మీద ఆసక్తి ఉందని అంటున్నారు. అందుకే ఈ విధంగా బయటపడడం లేదా అన్న చర్చ సాగుతోంది. తాము అంతా ఒక్కటే కుటుంబమని చెబుతూనే ఇలాంటి ప్రశ్నలు ఇపుడు అడగకూడదని దీదీ చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఇండీ కూటమిలో ఏ ఒక్క మిత్ర పక్షం కూడా రాహుల్ గాంధీ మా ప్రధాని అభ్యర్ధి అని గట్టిగా చెప్పలేకపోతున్నారు అంటే ఆలోచించాల్సిందే