Begin typing your search above and press return to search.

బెంగాల్ లో హంగ్ ...అసలైన రాజకీయ తమాషా !

సాధారణంగా వేవ్ బలంగా ఉంటే వార్ వన్ సైడ్ అవుతుంది. దాంతో ఎవరి వైపు మొగ్గు ఉందని చూచయగా చెప్పేయవచ్చు.

By:  Satya P   |   3 May 2026 8:00 PM IST
బెంగాల్ లో హంగ్ ...అసలైన రాజకీయ తమాషా !
X

రాజకీయాల్లో వింతలూ విడ్డూరాలు ఎన్నో ఉంటాయి. ఢీ అంటే ఢీ కొట్టే విధంగా రాజకీయాలు సాగే పలు రాష్ట్రాలలో వీటికి ఎక్కడా కొదవే లేదు. పశ్చిమ బెంగాల్ విషయమే తీసుకుంటే ఇపుడు దేశమంతా ఆ ఫలితం కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇంకా ఎక్కువగా చెప్పాలీ అంటే ఉగ్గపట్టి మరీ 140 కోట్ల మంది దేశ ప్రజలు వేచి చూస్తున్నారు. బెంగాల్ ఫలితంతో దేశం మారుతుందా అంటే రాజకీయం మాత్రం కచ్చితంగా మారుతుంది, అందుకే ఇంతటి హడావుడి మరి.

నెక్ టూ నెక్ గా :

బెంగాల్ లో మమతా బెనర్జీ అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకురాలు. రాష్ట్ర రాజకీయాల్లో ఆమెకు ధీటైన చరిష్మా కలిగిన వారు ఈ విషయంలో ఎవరూ లేరు అన్నది వాస్తవం. అయితే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ళ పాటు అధికారంలో ఉండడం ఆమె పార్టీకి ఒక ప్రతికూలాంశాలు. దాంతో పాటుగా ఈసారి సర్ ప్రక్రియతో చాలా ఓట్లు లేకుండా పోయాయి. కేంద్ర బలంగాలని ఎక్కడికక్కడ దించేశారు. ఎన్నికలలో పెద్ద ఎత్తుల పోలింగ్ జరిగింది. అది ఒక చరిత్ర యాంటీ ఇంకెంబెన్సీ కూడా భారీగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. బీజేపీకి కేంద్ర నాయకత్వం అతి పెద్ద అండ. మోడీ రాజకీయ గ్లామర్ అమిత్ షా రాజకీయ వ్యూహాలు కాషాయం పార్టీని బెంగాల్ లో విజయ తీరాలకు చేర్చాయని విశ్లేషణలు ఉన్నాయి. దీంతో బెంగాల్ ఎన్నికల్లో నెక్ టూ నెక్ అన్నట్లుగా వాతావరణం అయితే ఉందని అంతా అంటున్నారు.

సర్వేలకు అందని తేరు :

సాధారణంగా వేవ్ బలంగా ఉంటే వార్ వన్ సైడ్ అవుతుంది. దాంతో ఎవరి వైపు మొగ్గు ఉందని చూచయగా చెప్పేయవచ్చు. కానీ బెంగాల్ లో అలా లేదు. అక్కడ బీజేపీకి ఆదరణ ఉంది. అలాగే మమతకు కూడా గట్టి పట్టు ఉంది దాంతో ఢీ కొట్టిన ఈ రెండు పక్షాల మధ్య మ్యాజిక్ ఫిగర్ ఎవరికి దక్కుతుంది అన్నది అతి పెద్ద ప్రశ్నగా ఉంది. బెంగాల్ లో మొత్తం సీట్లు 294గా ఉన్నాయి. అధికారం అందుకోవాలీ అంటే 148 సీట్లు ఏ రాజకీయ పార్టీకైనా రావాలి. ఇక సర్వేల అంచనాలు చూస్తే రెండు పార్టీలకూ చెరి 140 దాకా సీట్లు రావచ్చు అని అంటున్నారు. అంటే మరో ఎనిమిది సీట్లు కొరత ఉంటుంది అన్న మాట. అలా హంగ్ కనుక బెంగాల్ లో ఏర్పడితే ప్రభుత్వం ఎవరు స్థాపిస్తారు, ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నది ఇపుడు అతి పెద్ద చర్చగా ఉంది.

చిన్న పార్టీలే కీలకం :

బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల తరువాత చిన్న పార్టీలు పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్ కమ్యూనిస్టులకు సింగిల్ డిజిట్ ఓట్లూ సీట్లు వస్తాయని అంచనాలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కి ఆ పాటి సీట్లు తగ్గితే ఈ రెండు పార్టీలను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుంది. ఎందుకంటే ఈ పార్టీలు అన్నీ కూడా ఇండియా కూటమిలో ఉన్నాయి. మరి బీజేపీకి ఏ చిన్న పార్టీలు అండగా ఉంటాయన్నది కూడా చూడాల్సి ఉంది.

న్యూట్రల్ పార్టీల వైపు :

బీజేపీకి కాంగ్రెస్ వామపక్షాల నుంచి మద్దతు ఉండదు. దాంతో న్యూట్రల్ పార్టీల వైపు ఆ పార్టీ చూడాల్సి ఉంటుంది. ఇండిపెండెంట్లు గెలిస్తే వారు కూడా బీజేపీ వైపు వచ్చే చాన్స్ ఉంటుంది. అయితే బెంగాల్ రాష్ట్ర చరిత్రను ఒక్కసారి చూసినపుడు ఏనాడూ హంగ్ రాలేదు. ప్రజలు మూకుమ్మడిగా ఒక పార్టీనే ఎన్నుకోవడం జరిగింది. వారికి నచ్చిన పార్టీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టారు. అయితే గతంలో ఇంత ఢీ అంటే ఢీ సీన్ లేదు కాబట్టి ఈసారి హంగ్ గురించి కూడా చర్చ సాగుతోంది. ఏది ఏమైనా 3.21 కోట్లకు పైగా ఓటర్లు 1,400 మందికి పైగా అభ్యర్థుల జాతకాన్ని తేల్చిన విషయం మీద మే 4న తీర్పు వెలువడనుంది. బెంగాల్ ఎన్నికలు ఇటీవలి సంవత్సరాలలో అత్యంత ఆసక్తి కలిగించిన వాటిగా అంతా చెబుతున్నారు. బీజేపీ తాను ధీమాగా ఉన్నట్లు చారిత్రాత్మక విజయం అందుకుంటుందా లేక మమతా బెనర్జీ యొక్క టీఎంసీ తన పట్టును నిలుపుకోగలుగుతుందా అనేది ఈవీఎంలు తెరచిన తరువాతనే స్పష్టమవుతుంది.