Begin typing your search above and press return to search.

మమతకు దెబ్బ మీద దెబ్బ.. 'చోటా దీదీ' కూడా చేతులెత్తేసిందా?

ప్రముఖ బెంగాలీ నటి, టీఎంసీ యువజన విభాగం మాజీ అధ్యక్షురాలైన సాయోని ఘోష్ మాజీ సీఎం మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలుగా చెప్పేవారు.

By:  Tupaki Political Desk   |   10 Jun 2026 5:26 PM IST
మమతకు దెబ్బ మీద దెబ్బ.. చోటా దీదీ కూడా చేతులెత్తేసిందా?
X

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో రెండు దశాబ్దాలకు పైగా తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత ఆమె రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీలో అసమ్మతి ఆకాశాన్ని తాకుతోంది. ఇంతకాలం అత్యంత సన్నిహితులు, అంతరంగికులుగా చెప్పుకున్న వారు కూడా ముఖం చాటేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గెలిచిన ఎమ్మెల్యేల్లో 60 మంది తిరుగుబాటు చేసి ధిక్కార స్వరం వినిపించారు. ఇదే సమయంలో తమ నాయకురాలు మమతే అంటూ తిరుగుబాటు బృందానికి నాయకత్వం వహిస్తున్న రితబ్రత బెనర్జీ చెబుతున్నారు. అయితే ఆయనను పార్టీ నుంచి మమత సస్పెండ్ చేశారు. ఇదే సమయంలో ఎంపీలు కూడా మమతకు షాక్ ఇస్తూ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. టీఎంసీకి మొత్తం 28 మంది ఎంపీలు ఉండగా, ఏకంగా 20 మంది ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతీవ్ర సంచలనంగా మారింది.

అయితే ఈ తిరుగుబాటు ఎంపీల్లో ఒక పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సీనియర్ నాయకురాలు కాకొలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో రెబల్ ఎంపీలంతా ఢిల్లీలో కేంద్ర మంత్రి, బీజేపీ ఇంచార్జి భూపేంద్ర యాదవ్ నివాసంలో సమావేశమయ్యారు. తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నామని, పార్లమెంట్‌లో తమకు ప్రత్యేక బ్లాక్‌గా కూర్చునేందుకు అవకాశం ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా మమతకు ఎదురుతిరిగిన ఎంపీల్లో సాయోని ఘోష్ పేరు ప్రత్యేక చర్చకు తావిస్తోంది.

ప్రముఖ బెంగాలీ నటి, టీఎంసీ యువజన విభాగం మాజీ అధ్యక్షురాలైన సాయోని ఘోష్ మాజీ సీఎం మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలుగా చెప్పేవారు. బెంగాల్ రాజకీయాల్లో ఆమెను అందరూ ‘చోటా దీదీ’ అని పిలిచేవారు. మమతా బెనర్జీ వేషధారణను అనుకరిస్తూ, తెల్లటి కాటన్ చీర కట్టుకుని, "దీదీ తదుపరి దేశ ప్రధాని అవుతారు" అంటూ గట్టిగా శబ్దం చేసిన సాయోని ఘోష్.. ఇప్పుడు సడన్‌గా ప్లేటు ఫిరాయించడం రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు దీదీ భజన చేసిన సాయోని, ఇప్పుడు రెబల్ క్యాంప్‌లోకి చేరిపోవడం మమతకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయిందని అంటున్నారు.

కోట కూల్చుతున్న సన్నిహితులు

సాయోని ఘోష్ ఒక్కరే కాదు, దీదీకి మరో అత్యంత ఆప్తమిత్రురాలైన సీనియర్ నేత, కోల్‌కతా ఎంపీ మాలా రాయ్ సైతం రెబల్ క్యాంప్‌లోనే ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాకుండా ఉండేందుకు వీలుగా 2/3 వంతు కంటే ఎక్కువ మంది (28 మందిలో 20 మంది) ఎంపీలు ఒకే తాటిపైకి వచ్చి మమతకు కోలుకోలేని పరాభవాన్ని మిగిల్చారని అంటున్నారు. కాగా, ఈ సంక్షోభం కేవలం లోక్‌సభతోనే ఆగలేదని చెబుతున్నారు. టీఎంసీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ సైతం తన పదవికి, తృణమూల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బెంగాల్‌లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, దాన్ని గౌరవిస్తూ తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.

లాయలిస్టుల ఆగ్రహం.. 'దేవ్' కీలక ప్రకటన

ఈ ఊహించని పరిణామాలపై మమతా బెనర్జీ లాయలిస్టులైన మహువా మోయిత్రా, కళ్యాణ్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. పార్టీ టికెట్‌పై గెలిచి ఇప్పుడు మోదీకి జై కొడుతున్న వారిని ద్రోహులు అంటూ అభివర్ణించారు. అయితే, టాలీవుడ్ హీరో, ఘటాల్ ఎంపీ 'దేవ్' అలియాస్ దీపక్ అధికారి మాత్రం.. తాను ప్రాణమున్నంత వరకు మమతా బెనర్జీతోనే ఉంటానని స్పష్టం చేసి ఆమెకు నైతిక మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో అధికారం పోయి, చేతిలో ఉన్న లాయలిస్టులు ఒక్కొక్కరుగా చేజారిపోతుండడంతో మమతా బెనర్జీ రాజకీయ జీవితంలోనే ఇది అత్యంత కఠినమైన పరీక్షగా నిలిచిందని వ్యాఖ్యానిస్తున్నారు.