Begin typing your search above and press return to search.

బెంగాల్ నటి కోయల్ మల్లిక్ షాకింగ్ డెసిషన్.. మమతకు మరో దెబ్బ

టీఎంసీకి రాజీనామా చేయడమే కాకుండా ఎంపీ పదవిని కూడా కోయల్ వదులుకున్నట్లు ప్రకటించారు. అయితే ఆమె బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున రాజ్యసభకు తిరిగి ఎన్నిక అవుతారని ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   16 July 2026 5:39 PM IST
బెంగాల్ నటి కోయల్ మల్లిక్ షాకింగ్ డెసిషన్.. మమతకు మరో దెబ్బ
X

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విపక్షంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, ప్రముఖ నటి, రాజ్యసభ ఎంపీ కోయల్ మల్లిక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. ఏప్రిల్ 6న రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన కోయల్ మల్లిక్ కేవలం మూడు నెలల్లోనే పార్టీ నుంచి వైదొలగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీఎంసీకి రాజీనామా చేయడమే కాకుండా ఎంపీ పదవిని కూడా కోయల్ వదులుకున్నట్లు ప్రకటించారు. అయితే ఆమె బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున రాజ్యసభకు తిరిగి ఎన్నిక అవుతారని ప్రచారం జరుగుతోంది.

బెంగాల్ ఎన్నికల్లో ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్ రాజకీయాలు తలకిందులయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటుతో పార్టీ వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ ఏకాకిగా మిగిలిపోతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు మమత వెంటే ఉంటామని అంటున్నా, ప్రభుత్వం నుంచి ఎదరవుతున్న ఒత్తిడితో రోజుకొకరు చొప్పున ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్లేటు ఫిరాయిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటివరకు 58 మంది ఎమ్మెల్యేలు, 20 మంది లోక్ సభ ఎంపీలు, నలుగురు రాజ్యసభ సభ్యులు మమత నాయకత్వాన్ని ధిక్కరించి ప్రత్యర్థులతో చేతులు కలిపారని చెబుతున్నారు. ఇంకా మమత వెనుక ఉన్నవారిలో ఎందరు బయటకు వచ్చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో మమతను సీఎం పీఠం నుంచి దించిన బీజేపీ ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కబళించేలా పకడ్బందీగా పావులు కదిపుతోందని చెబుతున్నారు. టీఎంసీపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోకపోయినప్పటికీ ఎంపీలను మాత్రం విలీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. టీఎంసీ రెబల్ ఎంపీలు ప్రస్తుతానికి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే చిన్న పార్టీలో చేరినట్లు చెప్పినప్పటికీ ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అధికారికంగా బీజేపీలో వినీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక మొత్తం 9 మంది రాజ్యసభ ఎంపీల్లో ఇప్పటికే నలుగురు రాజీనామా చేశారని చెబుతున్నారు. మిగిలిన వారు కూడా పక్క చూపులు చూస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేరున్న సినీ నటి కోయల్ మల్లిక్ రాజీనామాతో ఈ ప్రచారానికి మరింత ఊతం లభిస్తోంది. బెంగాల్ సంస్కృతికి పార్టీకి వారదిగా పనిచేస్తారని మల్లిక్ పై నమ్మకం పెట్టుకున్న మమత ఎంతో మంది ఆశావహులను కాదని రాజ్యసభకు ఎంపిక చేశారు. అయితే ఎన్నికైన మూడు నెలలకే ఆమె రాజీనామా చేయడం రాజకీయంగా మమతను మరింత కుంగదీసింది. అయితే పార్టీని ఎందరు వదిలివెళ్లినా బీజేపీపై తన పోరాటం కొనసాగుతుందని మమత ధైర్యంగా ప్రకటనలు చేస్తుండటమే హాట్ టాపిక్ అవుతోంది.