Begin typing your search above and press return to search.

మమత కాదు కోపోద్రిక్త...చెంప చెళ్ళు మందిగా !

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అంటే రెండు నెలల క్రితం వరకూ కాబోయే ప్రధానిగా ఒక ప్రొజెక్షన్ ఉండేది.

By:  Satya P   |   9 July 2026 9:19 AM IST
మమత కాదు కోపోద్రిక్త...చెంప చెళ్ళు మందిగా !
X

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అంటే రెండు నెలల క్రితం వరకూ కాబోయే ప్రధానిగా ఒక ప్రొజెక్షన్ ఉండేది. ఆమె తిరుగులేని నాయకురాలిగా బెంగాల్ ని ఏలుతూ నాలుగోసారి కూడా గెలుస్తారు అని చాలా మంది అనుకునేవారు. బీజేపీ పప్పులు ఎక్కడైనా ఉడుకుతాయేమో కానీ బెంగాల్ లో అసలు కుదరదు అంటూ మమత చేసిన హెచ్చరికలు చూసిన వారు కమలానికి అక్కడ కష్టమే అనుకున్నారు. మమత వరసగా నాలుగోసారి గెలిచి 2029 నాటికి ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్ధిగా రేసులో ముందుకు దూసుకుని వస్తారని కూడా అంచనా కట్టిన వారు ఉన్నారు. ఇంకేముందు మమతా బెనర్జీ ఇందిరమ్మ తరువాత రెండవ మహిళా ప్రధాని మరో ఐరన్ లేడీ అని కూడా మరి కాస్తా ఎక్కువగా మాట్లాడిన వారూ ఉన్నారు. కట్ చేస్తే మమత బెంగాల్ లో తన పార్టీ ఓడి తాను కూడా సొంత నియోజకవర్గంలో ఓడి మాజీ సీఎం కాదు మాజీ ఎమ్మెల్యేగా కూడా మారిపోయారు.

ర్యాలీ సందర్భంగా :

ఇదిలా ఉంటే బరుయిపూర్ మైనర్ అత్యాచారం-హత్య కేసుపై తన కాళీఘాట్ నివాసం సమీపంలో జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ మమతా బెనర్జీ ఒక పార్టీ కార్యకర్త మీద చేయి చేసుకున్నారు, ఏకంగా చెంప పగలగొట్టారు. ఈ మేరకు అక్కడ జన సమూహాన్ని నియంత్రిస్తున్న వ్యక్తిని చెంపదెబ్బ కొడుతున్నట్లుగా ఉన్న ఒక వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కలకత్తా హైకోర్టు ముందస్తు అనుమతితో జరిగిన ఈ నిరసనలో భాగంగా టీఎంసీ ర్యాలీ నిర్వహించింది. అయితే దానిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో రెండు పార్టీల మధ్య ఘర్షణలు ఆ మీదట రాళ్ల దాడి వంటివి చోటు చేసుకున్నాయి. వివాదం ఇంకా చెలరేగడంతో చివరికి అది గందరగోళంగా మారింది; ఈ నేపధ్యంలోనే నను చుట్టుముడుతున్న కార్యకర్తపై ఆమె ఆగ్రహానికి గురైనట్లుగా తెలుస్తోంది. దాంతో కార్యకర్త చెంప చెల్లుమనిపించారు. మరి కొంతమంది మీద ఆమె చేయి చేసుకున్నట్లుగా వీడియోలో ఉంది.

మమతమ్మా ఎందుకిలా :

నిజానికి మమత ఇటీవల కాలంలో తీవ్ర అసహానికి గురి అవుతునారు. ఆమె ఓటమి పాలు అయిన తరువాత పార్టీ చీలిపోవడం బీజేపీ అధికారంలో ఉంటూ నియంత్రించడం, ఇలా అనేక పరిణామాల నేపధ్యంలో ఆమె మధన పడుతున్నారు. పార్టీలో ఉన్న వారు నిన్నటి దాకా తన పక్కన మసలిన వారు ఒక్కొక్కరుగా బయటకు పోతున్న పరిస్థితులు కూడా మమతను ఇబ్బంది పెడుతున్నాయి. ఇక మమతా బెనర్జీ బీజేపీ మీద పోరాటం కూడా వెంటనే మొదలెట్టారు. ఎన్నికలు అయితే ఇప్పట్లో లేవు. అయినా సరే మమతా బెనర్జీ రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా బీజేపీ ప్రభుత్వానికి హానీమూన్ పీరియడ్ ని కూడా అసలు ఇవ్వడం లేదు. బీజేపీ ఎప్పటికీ పశ్చిమ బెంగాల్ లో రాదు అనుకున్న నేపథ్యంలో అధికారంలోకి రావడం అందులో తనకు ఒకనాటి అనుచరుడు అయిన సువేందు అధికారి ముఖ్యమంత్రి కావడం ఆమె తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు.

పోరాటమే బలంగా :

మమతా బెనర్జీ అంటే పోరాటాలే గుర్తుకు వస్తాయి. ఆమె 29 ఏళ్ళ వయసులోనే తొలిసారి ఎంపీ అయ్యారు. ఆ తరువాత ఆమె బలమైన వామపక్ష ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఉద్యమించారు. 1993లో వామపక్షాల మీద చేసిన ప్రజా పోరాటంలో భాగంగా ఆమె తలకు కూడా తీవ్ర గాయాలు తగిలాయి. ఒక విధంగా ఆమె జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద భౌతిక దాడి అది. ఆ తరువాత 2006లో నందిగ్రాం లో వామపక్ష ప్రభుత్వం మీద చేసిన భారీ ఉద్యమాలు మరో ఎత్తుగా సాగాయి. ఇవన్నీ మమతలోని పట్టుదలను మొండితనాన్ని సూచిస్తాయి. దేనికీ వెనక్కి తగ్గకపోవడం ఆమె నైజం. ఇపుడు కూడా ఆమె అదే పట్టుదలను చూపిస్తున్నారు. నాడు ఎర్ర జెండాని గద్దె దించుతామని శపధం చేసిన ఆమె ఈ రోజున కాషాయం జెండాను లేకుండా చేస్తామని అంటున్నారు. అయితే ఇపుడు ఆమె వయసు ఏడు పదులు పై దాటింది. పైగా ఆమె ప్రభుత్వాన్ని పదిహేనేళ్ళు జనాలు చూసి ఉన్నారు. ఎన్నికలకు ఇంకా మరో అయిదేళ్ళ వరకూ చూడాలి. పైగా బీజేపీ ఎక్కడైనా ఒకసారి అధికారంలోకి వస్తే చాలు అల్లుకుని పోతుంది. బహుశా ఇవన్నీ మమతలో అసహనాన్ని ఆగ్రహాన్ని పెంచుతున్నాయని అంటున్నారు.