Begin typing your search above and press return to search.

బర్తరఫ్...మమత సానుభూతి కోరుకుంటున్నారా ?

దేశంలో ఇప్పటిదాకా ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఎన్నికల తీర్పును పట్టించుకోను అని అంటున్నారు.

By:  Satya P   |   6 May 2026 1:00 AM IST
బర్తరఫ్...మమత సానుభూతి కోరుకుంటున్నారా ?
X

దేశంలో ఇప్పటిదాకా ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఎన్నికల తీర్పును పట్టించుకోను అని అంటున్నారు. తన పార్టీ ఓడింది, తాను స్వయంగా ఎమ్మెల్యేగా ఓడారు, అయినా రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలు సక్రమంగా జరగలేదని ఆమె ఆరోపిస్తున్నారు. వ్యవస్థీకృతమైన కుట్ర ఇదంతా అంటున్నారు. అందుకే తాను లోక్ భవన్ కి వెళ్ళను, గవర్నర్ ని కలవను రాజీనామా చేయను అని ఆమె అంటున్నారు.

రాజ్యాంగం ఏమి చెబుతోంది :

ఒక రాష్ట్రానికి లేదా కేంద్రానికి ఎన్నికలు జరిగినపుడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నాటి నుంచే ఆ ప్రభుత్వం ఆపద్ధర్మం అవుతుంది. అంటే కేర్ టేకర్ సర్కార్ అన్న మాట. ఏమైనా పెద్ద విషయాలు జరిగినపుడు ఎమర్జెన్సీ ఉన్నపుడు అత్యవసరంలో జోక్యం చేసుకోవడానికి మాత్రమే అధికారాలు ఉంటాయి తప్పించి ఆ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడానికి లేదు ఒక విధంగా ప్రజల తీర్పు తరువాత తాము గెలిచినా కూడా ఉన్న పదవికి రాజీనామా చేసి కొత్తగా మళ్లీ ప్రమాణం చేయాలి. ఇదీ విధానం. అంటే అయిదేళ్ళ పాటు సాగిన ఒక ప్రభుత్వం గడువు ఎన్నికల ఫలితాలు రావడంతో ముగుస్తుంది. ఈ విషయంలో ఎవరి వ్యక్తిగత ఆలోచనలు పట్టుదలలకు తావు లేదు. మరి మమతా బెనర్జీ అయితే తాను రాజీనామా చేసేది లేదని అంటున్నారు. నిజానికి ఆమె రాజీనామా అన్నది ఒక లాంచనం మాత్రమే. ఆమె ప్రభుత్వం గడువు తీరిపోయింది అన్నది గమనించాలని రాజ్యాంగ నిపుణులు సూచిస్తున్నారు.

రాజ్యాంగ సంక్షోభమా :

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు జరిగి ఓటమి చెందాక రాజీనామా చేయను అంటే అది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందా అంటే ఒక విధంగా అలాగే జరుగుతుంది అని అంటున్నారు. అయితే దీనికి రాజ్యాంగంలో పరిష్కారాలు కూడా ఉన్నాయి. వ్యక్తుల ఇష్టా ఇష్టాలతో వ్యవస్థలు ఆగడం కొనసాగడం అన్నవి ఉండవు. అందుకే రాజ్యాంగంలో పకడ్బందీ చర్యలు కూడా ఉన్నాయి. ఒక ప్రభుత్వానికి మెజారిటీ లేదు అన్నది తేలిపోతే రాజ్యాంగ రక్షకుడిగా రాజ్యపాల్ గా గవర్నర్ ఆ ప్రభుత్వాన్ని రాజీనామా చేయాలని ఆదేశిస్తారు. రాజీనామా చేయమని ఎవరైనా అంటే వెంటనే ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే విశేష అధికారం గవర్నర్ కి ఉంటుంది. వ్యవస్థను సాఫీగా ముందుకు తీసుకుని వెళ్ళేందుకు ఇది మార్గంగా చెబుతున్నారు.

మమత కోరుకుంటున్నారా :

ముందే చెప్పినట్లుగా మమత రాజీనామా అన్నది ఒక లాంచనం. తమిళనాడు ఎన్నికల్లో ఓడిన స్టాలిన్ కూడా అదే చేశారు. కేరళలో పినరయి విజయన్ అదే చేశారు. కానీ మమత మాత్రం నో చెబుతున్నారు. అంత మాత్రాన ఆమె సీఎం గా కొనసాగుతారా అంటే మూడు సార్లు సీఎం గా చేసిన ఆమెకు కూడా ఇవన్నీ తెలుసు. తాను రాజీనామా ఇవ్వను అంటే కచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అని. ఆ విధంగా కఠినమైన యాక్షన్ తీసుకోవాలని ఆమె కోరుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. తనను బర్తరఫ్ చేస్తే ఆమె జనాల్లోకి వెళ్ళి సానుభూతి పొందేందుకు ఇది ఒక ప్రయత్నం అని అని అంటున్న వారూ ఉన్నారు. అయితే సాధారణ సందర్భాలలో కానీ లేదా ఎవరైనా కుట్ర పన్ని అర్ధాంతరంగా ఒక ప్రభుత్వాన్ని కూలదోసే క్రమంలో గవర్నర్ బర్తరఫ్ అధికారాన్ని ప్రయోగిస్తే అపుడు సానుభూతి రావచ్చు. కానీ సాఫీగా ఎన్నికలు జరిగాయి. మమత కూడా రాజ్యాంగానికి లోబడి నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారం చేశారు. రెండు దశల ఎన్నికల్లోనూ పాల్గొన్నారు. అంతా అయి ఓటమి పాలు అయ్యాక ఈ ఎన్నికలు నచ్చలేదు అని అంటున్నారు. ఆమె తనదైన రాజకీయ వ్యూహాలతోనే ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు. తానే సీఎం అని భీష్మించి కూర్చూంటే బర్తరఫ్ చేయవచ్చు. ఈ అతి పెద్ద నిర్ణయం తో మమత తిరిగి జనాల్లోకి వెళ్ళాలని దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగాలని చూస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.