Begin typing your search above and press return to search.

మోడీ అవమానించారని.. మీరు అదే పని చేయాలా దీదీ?

అధికారంలో ఉన్నోళ్లు ఏం చెబితే దాన్ని యథాతధంగా తీసుకునే రోజులు పోయి చాలా కాలమే అయ్యింది.

By:  Garuda Media   |   9 March 2026 10:24 AM IST
మోడీ అవమానించారని.. మీరు అదే పని చేయాలా దీదీ?
X

అధికారంలో ఉన్నోళ్లు ఏం చెబితే దాన్ని యథాతధంగా తీసుకునే రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. దీనికి తోడు టెక్నాలజీ అన్నది ఒక వచ్చి చచ్చింది కదా. ప్రజల్ని తమ మాటలతో నమ్మించే ప్రయత్నాలు గతంలో అంతో ఇంతో సాధ్యమయ్యేవి. కానీ.. ఇప్పుడు రోజులు మారాయి. ప్రపంచం మారింది. అందుకు అనుగుణంగా ప్రజల ఆలోచనా తీరులోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎంతటి పాపులర్ వ్యక్తి అయినా.. పాపులర్ నాయకుడైనా సరే.. తప్పు చేస్తే.. నిర్మోహమాటంగా నిలదీసే వేదికలు ఇప్పుడు చాలానే ఉన్నాయి. ఆ విషయాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి వాళ్లు మిస్ అవుతుంటారు. మారిన కాలానికి తగ్గట్లు మనల్ని మనం అప్డేట్ చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు.

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ కోవలోకే వస్తారు. తిరుగులేని అధికారాన్ని చేతిలో ఉంచుకొని.. ఇన్ని దఫాలు ముఖ్యమంత్రి అయ్యాక కూడా పశ్చిమ బెంగాల్ పరిస్థితి కానీ.. ఆ రాష్ట్ర రాజధాని కోల్ కతా కథ కానీ.. దాని ఇమేజ్ కానీ మారింది లేదు. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా రాష్ట్రపతి ముర్ము తమ రాష్ట్రానికి వచ్చిన వేళ.. ఆమె మాత్రమే కాదు.. ఆమె మంత్రుల్లో ఎవరూ వెళ్లని పరిస్థితి. అంతేనా.. రాష్ట్ర సీఎస్ మొదలు డీజీపీ మొదలు అత్యున్నత స్థాయి అధికారులు ఎవరూ వెళ్లింది లేదు.

ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన వేళ.. ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేయటానికి దీదీ పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. తనదైన అడ్డగోలు వాదనతో మరింత డ్యామేజ్ చేసుకుంటున్నారని చెప్పాలి. రాష్ట్రపతిని అవమానిస్తారా? అంటూ ప్రశ్నించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం బీజేపీ అగ్రనేతల్లో ఒకరు అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని బహుకరించే సమయంలో ఉన్న ఫోటోను చూపిస్తున్న దీదీ.. ‘ఆ ఫోటోలో పెద్ద వయసులో ఉన్న అద్వానీ కుర్చీలో కూర్చొని ఉండగా.. మరో కుర్చీలో ప్రధానమంత్రి మోడీ సైతం కూర్చొని ఉన్నారు. భారతరత్నపురస్కారాన్నిఅద్వానీకి బహుకరిస్తున్న రాష్ట్రపతి ముర్ము మాత్రం నిలబడి ఉన్నారు.

ఈ పాత ఫోటోను పెద్దదిగా చేసి తన వాదనకు సాక్ష్యమన్నట్లుగా దీదీ రియాక్టు అయ్యారు. రాష్ట్రపతిని తాము అవమానించలేదన్న వాదనను వినిపిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీనే గతంలో అవమానించారంటూ కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఇదంతా చూసినప్పుడు.. తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి దీదీ పడుతున్న అవస్థ అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అదే సమయంలో ఆమె వాదనను ప్రశ్నించే పలు ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రశ్నల్లోకి వెళితే..

- దీదీ చెప్పినట్లే ప్రధాని మోడీ గతంలో ఎప్పుడో రాష్ట్రపతిని అవమానించారనే అనుకుందాం. ఆ విషయాన్ని అప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్న దీదీ ఎందుకు ప్రశ్నించలేదు?

- ప్రధాని తీరును ప్రశ్నిస్తూ.. ఆమె ఒక్క స్టేట్ మెంట్ ఇచ్చారా? రాష్ట్రపతికి సంఘీభావంగా ఏమైనా కార్యక్రమాన్ని నిర్వహించారా?

- నిజంగానే ప్రధానమంత్రి మోడీ రాష్ట్రపతి అవమానించారే అనుకుందాం. ఆయన ఆ తప్పు చేశారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న దీదీ కూడా అలానే చేయాలా?

- ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు తాను వెళ్లలేని పరిస్థితుల్లో మమత ఉంటే.. తనకు బదులుగా తన మంత్రివర్గంలోని ఎవరైనా మంత్రిని పంపొచ్చు కదా? కేసీఆర్ హయాంలో ఐదారు నెలల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రావటం.. ఆ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లలేదు. కానీ.. తనకు బదులుగా ప్రోటోకాల్ ప్రకారం తన కేబినెట్ లోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మూడుసార్లు పంపటాన్ని గుర్తు తెచ్చుకుంటే.. దీదీ చేసిన తప్పు ఇట్టే అర్థమవుతుంది.

- మంత్రుల సంగతి పక్కన పెడదాం. ప్రోటోకాల్ ప్రకారం వెళ్లాల్సిన రాష్ట్ర ప్రధానకార్యదర్శి.. రాష్ట్ర డీజీపీ ఎందుకు వెళ్లనట్లు?

- తాను ఓటర్ల తొలగింపు సమస్యపై కోల్ కతాలో నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొన్నానని.. అందుకే రాలేకపోయానని దీదీ చెప్పిన విషయాన్నే తీసుకుందాం. హెలికాఫ్టర్ లో వెళ్లి.. రాష్ట్రపతికి స్వాగతం పలికి.. తిరిగి వచ్చేసి ధర్నాలో కూర్చుంటే సరిపోయేది కదా? ఇందుకు మహా అయితే నాలుగు గంటలు పడుతుంది. అంతుకు మించి ఉండదు కదా? ఆ పని కూడా ఎందుకు చేయలేదు? లాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ముఖ్యమంత్రి మమతను సంధిస్తున్నారు. అడ్డగోలు వాదనను వినిపిస్తే మాత్రం.. ఆ వాదనను నమ్మేసే పరిస్థితులు ఇప్పుడు లేవన్న విషయాన్ని దీదీ ఎప్పటికి అర్థం చేసుకుంటారు?