ఒక్క ఓటమి.. దీదీని జీరో చేసింది
దీంతో.. పార్టీ నుంచి బయటకు వచ్చిన దీదీ.. తన ప్రధాన అనుచరుడు ముకుల్ రాయ్ తో కలిసి 1998 జనవరి 1న టీఎంసీ (అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్)ను ఏర్పాటు చేశారు.
By: Garuda Media | 11 Jun 2026 12:36 PM ISTగెలుపు ధీమాను పెంచుతుంది. బలాన్ని మాత్రమే చూపిస్తుంది. బలహీనతల్నికవర్ చేస్తుంది. అదే ఓటమి.. బలాల్ని కనిపించకుండా చేయటమే కాదు బలహీనతల్ని మరింత బలంగా చూపించేలా చేస్తుంది.అందుకే.. గెలుపును హ్యాండిల్ చేయటం కంటే ఓటమిని హ్యాండిల్ చేయటం చాలా చాలా కష్టం. రాజకీయాల్లో పవర్ చేతిలో ఉన్నప్పుడు కొండ మీద కోతిని కూడా ముందుకు తీసుకొచ్చి.. నచ్చినట్లు ఆడించొచ్చు. అదే పవర్ చేజారిన తర్వాత.. ఇంట్లో ఉన్నోళ్లు కూడా లెక్క చేయని దీన పరిస్థితుల్ని చూస్తుంటాం. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విషయంలో ఇది మరోసారి రుజువైంది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు.. బ్యాక్ టు బ్యాక్ అధికారంలో ఉన్న ఆమె.. కేంద్రంతో సహా ఎవరిని లెక్క చేయని పరిస్థితి. అలాంటి ఆమె చేతి నుంచి అధికారం చేజారి పోయిన తర్వాత బయట వాళ్ల సంగతిని పక్కన పెడితే.. సొంత పార్టీకి చెందిన వారు సైతం ధిక్కార స్వరాన్ని వినిపించటమే కాదు.. ఓటమి పాలైన నెలలోనే పార్టీ నుంచి విడిపోయేందుకు వెనుకాడని పరిస్థితి. నిన్నమొన్నటి వరకు దీదీకి అత్యంత వినయ విధేయతలతో ఉన్నోళ్లంతా.. ఇప్పుడు ఆమెను లెక్క చేయని దుస్థితి. ఇలాంటి వేళలోనే.. ఆమె పార్టీని తమ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం దీదీకి సూచన చేసినట్లుగా చెబుతున్నారు.
ఇక్కడే రెండు అంశాల్ని ప్రస్తావించాలి. ఇదే దీదీ ఎన్నికల వేళ కాంగ్రెస్ తో పొత్తుకు సైతం నో చెప్పిన పరిస్థితి. అదే దీదీ.. తన రాజకీయ కెరీర్ ను షురూ చేసింది కాంగ్రెస్ పార్టీలోనే. దాదాపు 27 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉన్న ఆమె.. ఆ తర్వాత పార్టీతో విభేదించి.. బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. 1970లో కాంగ్రెస్ లో చేరిన ఆమె 1997 డిసెంబరు వరకు ఆమె పార్టీలోనే ఉన్నారు. ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సోమేంద్రనాథ్ మిత్రాతో మమతకు విభేదాలు ఉండేవి. అవి అంతకంతకూ ముదిరాయి. 1997లో జరిగిన పార్టీ అంతర్గత ఎన్నికల్లో ఆమె సోమెన్ మిత్రా చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించిన సీతారాం కేసరి.. ఆమెను పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షురాలి పదవిని కట్టబెట్టాలని చూశారు. అందుకు సోమేంద్ర నాథ్ ఇష్టపడలేదు.
దీంతో ఆమె సొంత పార్టీ ఆలోచనలు మొదలైనట్లు చెబుతారు. దీనికి తోడు దశాబ్దాల పర్యంతం బెంగాల్ ను కోటగా మార్చుకున్న వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యానికి కాంగ్రెస్ పార్టీలో ఉంటే సాధ్యం కాదని ఆమె భావించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వామపక్ష పార్టీల పట్ల చూసిచూడనట్లుగా ఉండటం.. జాతీయ రాజకీయాల్లో వారితో తమకున్న అవసరాల నేపథ్యంలో బెంగాల్ విషయంలో వారు పట్టుదలగా లేని తీరు మమతకు నచ్చలేదు.
దీంతో.. వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. ఆందోళనలు చేపట్టేవారు. దీనికి కాంగ్రెస్ హైకమాండ్ అనుమతులు ఇచ్చేవారు కాదు. తన మాటకు ఎదురు చెప్పే వారన్నా.. తాను తీసుకున్న నిర్ణయాలు అమలు కాకుండా అడ్డుకునే వారి విషయంలో మమత ధిక్కార ధోరణిని ప్రదర్శించేవారు. ఇదే.. ఆమెను కాంగ్రెస్ నుంచి దూరమయ్యేలా చేసింది. పార్టీ నిర్ణయాలకు భిన్నంగా మమత తీసుకునే సొంత నిర్ణయాలపై కాంగ్రెస్ అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో.. పార్టీ నుంచి బయటకు వచ్చిన దీదీ.. తన ప్రధాన అనుచరుడు ముకుల్ రాయ్ తో కలిసి 1998 జనవరి 1న టీఎంసీ (అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్)ను ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ లో వామపక్ష పార్టీలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాకపోవటంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు మమత ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె చాలానే ఇబ్బందులకు గురయ్యారు. అయినప్పటికి.. మొండితనంతో చివరకు అనుకున్నది సాధించారు. వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దింపటమే కాదు.. నాన్ స్టాప్ గా 15 ఏళ్ల పాటు ఆమె అధికారాన్ని చెలాయించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని మూటకట్టుకున్న ఆమె.. మోడీషాల దెబ్బకు విలవిలలాడుతున్న పరిస్థితి. పార్టీ నేతలంతా ఎవరికి వారు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్న వేళ.. ఆమె పార్టీని కాపాడుకోవాలన్నా.. తనను ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన బీజేపీకి సరైన బదులు ఇవ్వాలంటే.. కాంగ్రెస్ మినహా మరో ప్రత్యామ్నాయం ఆమెకు లేదు. అదే సమయంలో బీజేపీకి అసలుసిసలు ప్రత్యామ్నాయం తామేనని.. బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఒక చోటుకు చేర్చటం.. వీలైతే అందులోని కొన్ని బలమైన పార్టీలను తనలో విలీనం చేసుకోవటం ద్వారా.. కేంద్రంలో పాగా వేయాలన్నది కాంగ్రెస్ ఆలోచన. మొత్తంగా.. తిరుగులేని అధికారాన్ని చెలాయించిన మమత.. ఒక్క ఓటమితో ఆమె జీరో కావటమే కాదు.. తాను ఏ పార్టీ నుంచి బహిష్కరణ వేటుకు గురయ్యారో.. ఇప్పుడు అదే పార్టీలో చేరే దిశగా అడుగులు పడుతున్న పరిస్థితి. ఇదంతా చూస్తే.. ఓటమి ఇంత భయంకరంగా ఉంటుందా? అన్న భావన కలగటం ఖాయం.
