Begin typing your search above and press return to search.

బెంగ‌ల్ దంగ‌ల్‌: కేంద్రంపై ధిక్కార స్వ‌రం.. మ‌మ‌త ప్ల‌స్సా-మైన‌స్సా!

గ‌తంలో ఆమె పోరు సాగించిన తీరు వేరు. అప్ప‌ట్లో క‌మ్యూనిస్టులు+ కాంగ్రెస్ కూట‌మికి, మ‌మ‌త‌కు పోటీ జ‌రిగింది.

By:  Garuda Media   |   17 March 2026 2:00 PM IST
బెంగ‌ల్ దంగ‌ల్‌: కేంద్రంపై ధిక్కార స్వ‌రం.. మ‌మ‌త ప్ల‌స్సా-మైన‌స్సా!
X

దేశంలోనే అత్య‌ధిక సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏకైక రాష్ట్రం ప‌శ్చిమ బెంగాల్‌. 294 శాస‌న స‌భ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రం ఒక‌ప్పుడు సీపీఎం పార్టీకి కంచుకోట‌. సుదీర్ఘ‌కాలంగా(35 ఏళ్ల‌కు పైగా) సీపీఎం ఇక్క‌డ పాల‌న సాగించింది. క‌మ్యూనిస్టు కంచుకోట‌గా దేశంలోనే ఈ రాష్ట్రం పేరు తెచ్చుకుంది. అలాంటి చోట‌.. 2011లో తొలిసారి పాగావేసిన తృణ‌మూల్ కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ.. మూడు సార్లుగా ఇప్ప‌టి వ‌ర‌కు(15ఏళ్లు) విజ‌యం ద‌క్కించుకున్నారు.

గ‌తంలో ఆమె పోరు సాగించిన తీరు వేరు. అప్ప‌ట్లో క‌మ్యూనిస్టులు+ కాంగ్రెస్ కూట‌మికి, మ‌మ‌త‌కు పోటీ జ‌రిగింది. ఈ పోరులో ప్ర‌జ‌లు మ‌మ‌త వెంటే ఉన్నారు. కానీ, 2014లో కేంద్రంలో మోడీ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. త‌మ‌తో పొత్తు పెట్టుకోవాల‌న్న క‌మ‌ల నాథుల అభ్య‌ర్థ‌న‌ల‌ను మ‌మ‌త తోసిపుచ్చింది.(ఒక‌ప్పుడు బీజేపీకి మిత్రప‌క్షం). అంతేకాదు.. ఒంట‌రిపోరులోనే గ‌త 2021 ఎన్నిక‌ల్లోనూ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంపై ఆమె పోరాటం చేస్తూనే ఉన్నారు.

కేంద్రం తీసుకునే అనేక నిర్ణ‌యాలు స‌హా.. విధానాల‌ను కూడా మ‌మ‌త వ్య‌తిరేకించారు. అంతేకాదు.. త‌న రాష్ట్రంలో కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను కూడా అనేకం నిలుపుద‌ల చేశారు. ఒక్క ఉపాధి హామీ చ‌ట్టం కాబ‌ట్టి.. అది మాత్ర‌మే అమ‌లు అవుతోంది. మిగిలిన పీఎం కిసాన్ వంటివి రాష్ట్రంలో అమ‌లు కావ‌డం లేదు. ఇక‌, ఏ చిన్న అవ‌కాశం చిక్కినా.. బీజేపీ కూడా ఇక్క‌డ బ‌ల‌పడేందుకు ప్ర‌య‌త్నించింది. శార‌దా చిట్ కుంభ‌కోణం కేసును కేంద్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని.. సీబీఐని పంపించిన‌ప్పుడు.. మ‌మ‌త అనుచ‌రులుగా ఉన్న సువేందు అధికారి స‌హా.. అనేక మంది ఆమె నుంచి దూర‌మై.. క‌మలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ప్ర‌స్తుతం ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలిగా ఉన్న మ‌మ‌త నెచ్చెలి.. మొహువా మొయిత్రాను కూడా బీజేపీ త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో ఉంద‌న్న చ‌ర్చ సాగుతోంది. మ‌రోవైపు.. గ‌వ‌ర్న‌ర్ దూకుడు.. ఎం.ఫార్మ సీ కాలేజీలో జ‌రిగిన అత్యాచారం, అనంత‌ర హ‌త్య వంటివి.. మ‌మ‌త స‌ర్కారును తీవ్ర సంక‌టంలో ప‌డేశాయి. అయిన‌ప్ప‌టికీ.. మ‌మ‌త ఇప్పుడు కూడా ఒంట‌రి పోరునే న‌మ్ముకున్నారు. కేంద్రంలోని మోడీ స‌ర్కారు చాలా వ్యూహాత్మ‌కంగా చొర‌బాటు దారుల అంశాన్ని తెర‌మీదికి తీసుకురావ‌డంతోపాటు.. దాదాపు కోటి మంది ఓట‌ర్ల‌ను అన‌ర్హుల‌ను చేయ‌డం ద్వారా.. ఎన్నిక‌ల సంఘం కూడా.. మ‌మ‌త‌కు స‌వాల్‌గా మారింది.

అంతేకాదు.. 2021 ఎన్నిక‌ల్లో మ‌మ‌త‌ను ఓడించిన సువేందు అధికారి(ఒక‌ప్పుడు ఆమెకు రైట్ హ్యాండ్‌)ని ఇప్పుడు రెండు స్థానాల్లో బీజేపీ నిల‌బెట్టింది. ఈ ప‌రిణామాల‌తో ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. మ‌మ‌త ఎదురీదుతున్నార‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి తోడు.. గ‌త మూడుసార్లుగా అధికారంలో ఉన్న నేప‌థ్యంలో స‌హ‌జంగా ఎద‌ర‌య్యే ప్రభుత్వ వ్యతిరేక కూడామ‌మ‌త‌కు నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేదు.

మ‌రోవైపు డీఎస్సీ నియామ‌కాల్లో జ‌రిగిన కుంభ‌కోణంపై సీబీఐ విచార‌ణ సాగిస్తోంది. ఇక‌, త‌న‌కు న‌మ్మిన బంట్లు ఉన్న డీజీపీ, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌హా.. కోల్‌క‌తా పోలీసు క‌మిష‌న‌ర్ల‌ను కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసేసింది. ఇలా.. అనేక ఇక్క‌ట్లు.. ఇబ్బందుల మ‌ధ్య మ‌మ‌త నాలుగోసారి విజ‌యం ద‌క్కించుకుంటే.. అది నిజంగా అద్భుత‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.