నల్లకోటు ధరించి దీదీ పోరాటం.. మమత బెనర్జీ సరికొత్త సంచలనం
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరికొత్త అవతారం ఎత్తారు. ఎన్నికల్లో ఓటమితో సీఎం పీఠం కోల్పోయిన దీదీ.. ఇప్పుడు నల్లకోటు ధరించి న్యాయవాదిగా కోర్టులో అడుగు పెట్టారు.
By: Tupaki Political Desk | 14 May 2026 4:25 PM ISTపశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరికొత్త అవతారం ఎత్తారు. ఎన్నికల్లో ఓటమితో సీఎం పీఠం కోల్పోయిన దీదీ.. ఇప్పుడు నల్లకోటు ధరించి న్యాయవాదిగా కోర్టులో అడుగు పెట్టారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగుతున్న మమత ఇటీవల కాలంలో తన కేసులను తానే వాదించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తన వాదనలను వినిపించిన దీదీ.. తాజాగా కోల్ కత్తా హైకోర్టుకు వచ్చారు. ఎన్నికల అనంతరం బెంగాల్ లో చోటుచేసుకుంటున్న హింసపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన మమత స్వయంగా వాదనలు వినిపించాలని నిర్ణయించారు.
బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హైకోర్టు న్యాయవాదిగా మారిపోయారు. పార్టీ తరఫున కీలకమైన కేసులను వాదించడానికి ఇతరులపై ఆధారపడకుండా తానే లాయర్ అవతారమెత్తారు మమత. ఆకస్మాత్తుగా మమతను కోర్టులో చూసిన న్యాయవాదులు, కక్షిదారులు షాక్ తిన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వయంగా నల్లకోటు ధరించి కోర్టు హాలులో అడుగు పెట్టడంపై అంతా ఆశ్చర్యంగా చూశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి.
బెంగాల్ ఎన్నికల అనంతరం, ఫలితాలు వెలువడిన తర్వాత తీవ్రమైన హింస చోటుచేసుకున్నట్లు కథనాలు వస్తున్నాయి. గత పది రోజుల్లో దాదాపు 200కి పైగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేయగా, 400పైగా అరెస్టులు జరిగాయి. ఈ సంఘటన వల్ల నలుగురు మృతి చెందగా, వందల మంది కార్యకర్తలు గాయపడ్డారు. బీజేపీ గెలిచిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోల్ కత్తా హైకోర్టులో కేసు దాఖలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజ్వరిల్లుతున్న హింసను అదుపు చేయాలని మమత హైకోర్టును ఆశ్రయించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ అంశమై వాదనలు వినిపించడానికి మమత స్వయంగా నల్లకోటు ధరించి కోర్టుకు వచ్చారు. ఆమెకు సహాయంగా టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ఆయన కుమారుడు శీర్షాన్య బందోపాధ్యాయ ఉన్నారు. వీరిద్దరూ వృత్తిరీత్యా న్యాయవాదులు. ఇక మమత బెనర్జీ బహుముఖ విద్యావంతురాలు. డిగ్రీతోపాటు ఆమె న్యాయవాద విద్యలో డిగ్రీ పూర్తి చేశారు. కోల్ కతా బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకున్నారు. దీంతో కోర్టులో వాదనలు వినిపించేందుకు అర్హత సాధించారు. రాజకీయాల్లో ప్రవేశించిన అనంతరం దశాబ్దాల పాటు న్యాయవాద వృత్తికి మమత దూరంగా ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంకొకరిపై ఆధారపడకుండా తన వాదనలు వినిపించడానికి మమత నల్లకోటు ధరించడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.
