Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మీద మమత లేదు...దీదీకి వేరే గతి లేదు !

మమతా బెనర్జీ కఠినమైన నాయకురాలు అని పేరు. తృణమూల్ కాంగ్రెస్ లో అదే మాట.

By:  Satya P   |   15 Jun 2026 9:05 AM IST
కాంగ్రెస్ మీద మమత లేదు...దీదీకి వేరే గతి లేదు !
X

మమతా బెనర్జీ కఠినమైన నాయకురాలు అని పేరు. తృణమూల్ కాంగ్రెస్ లో అదే మాట. ఆమె పశ్చిమ బెంగాల్ ని 2011 నుంచి నిన్నటి దాకా ఏకధాటిగా 15 ఏళ్ల పాటు పాలించారు. ఆ సమయంలో తనకు ఎదురులేదన్నట్లుగా వ్యవహరించారు. తన కత్తికి తిరుగులేదన్నట్లుగా శాసించారు. ఆమె అవకాశవాద రాజకీయం అహంకారపూరితమైన రాజకీయంతోనే మూడు సార్లు ముఖ్యమంత్రిత్వం నిర్వహించారు. సొంత పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, పశ్చిమ బెంగాల్ లోనూ లేదు. అంత వరకూ ఎందుకు అక్కడ ప్రతిపక్షాలను తీవ్రంగా అణచివేశారు.

కాంగ్రెస్ లోనే ఎదిగి :

ఒక విధంగా తనకంటూ ఒక ఓటు బ్యాంక్ పదిలంగా ఉంటే చాలు ఎవరూ ఓడించలేరనుకున్నారు. కానీ బొమ్మ తిరగబడింది, బెంగాల్ లో 2026 మేలో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ ఘోరంగా ఓడారు. ఇపుడు ఆమె పార్టీని కూడా నేతలు అంతా వీడుతున్నారు. దాంతో ఒంటరి అయిన మమతా బెనర్జీ కాంగ్రెస్ శరణు జొచ్చారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తనకు ఆశ్రయం ఇచ్చి 29 ఏళ్ళ వయసులోనే ఎంపీగా చేసి పంపించిన చరిత్రను మరచారు. అంతే కాదు, అనేక అవకాశాలు ఇచ్చిన పార్టీని ఆమె విడిచారు. అదే పార్టీని వాడుకుని తరువాత బెంగాల్ లో అణగదొక్కారు అన్న ప్రచారం కూడా ఉంది.

పెద్దక్కగా వ్యవహరించి :

ఇక బెంగాల్ సీఎం గా మమత ఇండియా కూటమి సమావేశాలకు వస్తే చాలు పెద్దక్కగా వ్యవహరించేవారు. అంతా తానే అన్నట్లుగా ధోరణి ప్రదర్శించేవారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ ని ఆమె లెక్క చేసేవారు కాదని చెబుతారు. ఇక 2011లో ఆమె తొలిసారి గెలిచినపుడు అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. అప్పటికి వామపక్షాలు బలంగా అధికారంలో ఉంటే వారిని ఓడించడానికి కాంగ్రెస్ సాయం తీసుకున్నారు. కానీ 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ ని దూరం పెట్టేశారు. పొత్తులు లేవని పొమ్మన్నారు, అదే విధంగా 2021, 2026లోనూ చేశారు. అంటే కాంగ్రెస్ ని తీవ్రంగా అవమానించారు అని చెబుతారు. ఇక 2012లో చూస్తే పశ్చిమ బెంగాల్ కి చెందిన కురు వృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పోటీ చేస్తే యూపీయే లో ఉంటూ కూడా ఆయనకు మద్దతు ఇవ్వనని చెప్పిన ఘనత కూడా మమతదే అని అంటారు.

ఎంత తేడా అంటూ :

అలాంటి మమత సొంత పార్టీ నేతల దెబ్బకు బీజేపీ ఇస్తున్న షాకులకు బెంబెలేత్తి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి మమత వస్తూనే సోనియా గాంధీని కౌగలించుకుంచుకున్నారు. కాంగ్రెస్ నాయకులను అందరికీ ఆప్యాయంగా పలకరించారు. కాంగ్రెస్ తో కలసి పోరాటాలు బెంగాల్ లో చేస్తామని అంటున్నారు. ఇపుడు మమతకు కాంగ్రెస్ గుర్తుకు వచ్చిందా అని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ. ఓడినా గెలిచినా నిలిచి ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీ పెట్టి తానే సర్వస్వంగా పార్టీని నడిపి మధ్యలో మేనల్లుడిని తెచ్చి ఆధిపత్యం పెంచి చివరికి ఘోరంగా ఓడిన తరువాత తాను ఎంత ఒంటరి అన్నదో మమతకు తెలిసింది అని అంటున్నారు. ఆమె నిజంగా కాంగ్రెస్ మీద ప్రేమతో దగ్గర అవుతున్నారా అంటే కాదు వేరే గతి లేకనే అన్న సమాధానం వస్తోంది. అయితే మమత పోకడలు బాగా తెలిసిన కాంగ్రెస్ అయితే ఆచీ తూచీ వ్యవహరిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి తృణమూల్ కాంగ్రెస్ అలాగే జాతీయ కాంగ్రెస్ ల మధ్య బంధం ఏ వైపునకు చేరుతుంది అన్నది.