Begin typing your search above and press return to search.

సొంత కారు లేదు.. ఇల్లు లేదు! మమతా బెనర్జీ అఫిడవిట్ చూస్తే షాక్

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా 15 ఏళ్లుగా పనిచేస్తున్న దీదీ మమతా బెనర్జీ తన ఎన్నికల అఫిడవిట్లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

By:  Tupaki Political Desk   |   9 April 2026 8:00 PM IST
సొంత కారు లేదు.. ఇల్లు లేదు! మమతా బెనర్జీ అఫిడవిట్ చూస్తే షాక్
X

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా 15 ఏళ్లుగా పనిచేస్తున్న దీదీ మమతా బెనర్జీ తన ఎన్నికల అఫిడవిట్లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సిట్టింగ్ నియోజకవర్గమైన భవనాపూర్ నుంచి మరోసారి పోటీ చేస్తున్న మమత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ తోపాటు సమర్పించిన స్వీయ ప్రమాణపత్రంలో మమత ఆస్తులు, అప్పులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మమత ఎన్నికల అఫిడవిట్ ప్రకారం దేశంలో అత్యంత పేద ముఖ్యమంత్రిగా నిలిచారు.

తనకు సొంత ఇల్లు, కారు వంటివేవీ లేవని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తన వద్ద కేవలం 9.8 గ్రాముల బంగారం, రూ.75,700 నగదు ఉందని తెలిపారు. మొత్తంగా రూ.15.37 లక్షల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో వెల్లడించారు. దీంతో మమత ఆస్తుల చిట్టాపై నెట్టింట తీవ్రమైన చర్చ జరుగుతోంది. సింప్లిసిటీకి మారుపేరుగా కనిపించే దీదీ వద్ద మరీ ఇంత తక్కువ ఆస్తి ఉందా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం సమకూర్చిన కారులోనే తాను తిరుగుతున్నానని మమత బెనర్జీ వెల్లడించారు. ఇక తన పేరు మీద ఎటువంటి సొంత ఇల్లు గానీ, వ్యవసాయ భూమి గానీ లేదని మమత స్పష్టం చేశారు. కోల్‌కతాలోని హరీష్ ఛటర్జీ స్ట్రీట్‌లో ఉన్న పాత ఇంట్లోనే నివసిస్తున్నట్లు వివరించారు. అయితే 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న మమత ఆస్తుల్లో తగ్గుదలపై నెటిజన్లు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 2016 ఎన్నికల సమయంలో మమత ఆస్తులు రూ. 45.43 లక్షలుగా ఉండగా, ఇప్పుడు కేవలం రూ.15.37 లక్షలు మాత్రమే ఉండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

కాగా, మమతా బెనర్జీకి లభించే ముఖ్యమంత్రి జీతం కంటే ఆమె రాసిన పుస్తకాలు, పెయింటింగ్స్ ద్వారా వచ్చే రాయల్టీయే ప్రధాన ఆదాయ వనరు అని టిఎంసి మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఆమె సామాన్య జీవనశైలికి ఇది నిదర్శనమని వారు ప్రశంసిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అయిన బిజెపి, సిపిఎం ఈ గణాంకాలను ప్రశ్నిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు వస్తున్న తరుణంలో, అధికారికంగా ఇంత తక్కువ ఆస్తి చూపడం కేవలం ప్రజలను నమ్మించే ప్రయత్నమని వారు విమర్శిస్తున్నారు.

మరోవైపు ఎన్నికల సమయంలో "పేద ప్రజల ప్రతినిధి"గా తన ఇమేజ్‌ను ప్రొజెక్ట్ చేసుకోవడానికి అఫిడవిట్ ఉపయోగించుకోవాలని మమత భావిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే "దీదీ అంటే నిజాయితీకి నిదర్శనం. ఆమె ప్రజల మనిషి, అందుకే ఆమె ఆస్తులు పెంచుకోలేదు" అని తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం రాష్ట్రంలో శారదా, నారద వంటి స్కామ్‌లు జరుగుతుంటే, ముఖ్యమంత్రి తన ఆస్తిని ఇంత తక్కువగా చూపడం వెనుక వ్యూహం ఉందని విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె కుటుంబ సభ్యుల ఆస్తుల గురించి బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.