విజయ్ మాల్యా భారత్ తిరిగి రావాలంటే... కండిషన్ ఇదే!
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయి దాక్కొన్న విజయ్ మాల్యా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు
By: Tupaki Desk | 7 Jun 2025 8:54 PM ISTబ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయి దాక్కొన్న విజయ్ మాల్యా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చాలాకాలంగా భారత్ తో పాటు బయట ప్రపంచానికి దూరంగా ఉన్న ఆయన.. తాను తిరిగి స్వదేశంలో అడుగుపెట్టాలంటే తనకు ఒక కండిషన్ ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. తాను దొంగ కాదని చెప్పడం గమనార్హం!
అవును... భారత్ లో బ్యాంకులకు వేల కోట్ల రూపాయాలు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న విజయ్ మాల్యా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. తాను దొంగతనం చేయలేదని.. అసలు ఇక్కడ దొంగతనం ఎక్కడ జరిగిందని ప్రశ్నించిన ఆయన.. తాను దొంగమాత్రం కాదని అన్నారు.
తాను భారత్ నుంచి పారిపోయాననే మాట వాస్తవమే కానీ.. తాను దొంగను మాత్రం కాదని.. అన్నారు. ముందుగా ఉన్న ప్లాన్స్ ప్రకారం 2016 తాను విదేశాలకు వెళ్లానని.. మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే తాను భారత్ ను వీడానని అన్నారు. తాను విదేశాలకు వెళ్లే ముందు అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
పాడ్ కాస్టర్ రాజ్ షమానీతో నాలుగు గంటల పాటు జరిగిన ఈ ఇంటర్వ్యూలో.. తనపై వచ్చిన ఆరోపణలు, కింగ్ పిషర్ ఎయిర్ లైన్స్ పతనం, భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం గురించి విజయ్ మాల్యా ప్రస్థావించారు. ఈ సందర్భంగా తనకు భారత్ లో న్యాయమైన విచారణకు హామీ ఇస్తే తాను తిరిగి స్వదేశానికి తిరిగి రావడాన్ని పరిశీలిస్తానని తెలిపారు.
భారతదేశంలో న్యాయమైన విచారణతో పాటు గౌరవప్రదమైన ఉనికి గురించి తనకు న్యాయమైన హామీ ఉంటే.. తాను తిరిగి భారతదేశానికి రావడం గురించి తీవ్రంగా ఆలోచిస్తానని విజయ్ మాల్యా అన్నారు.
ఇదే సమయంలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ గురించి మాట్లాడిన విజయ్ మాల్యా... ఆ విమానయాన సంస్థను కాపాడటానికి అవసరమైన ప్రణాళికలు సమర్పించినప్పుడు.. అందుకు అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన అభ్యర్థనను తోసిపుచ్చారని తెలిపారు! ఇదే సమయంలో... 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభమే ఎయిర్ లైన్స్ ఇబ్బందులకు ప్రధాన కారణమని మాల్యా అన్నారు.
కాగా... విజయ్ మాల్యా మార్చి 2016లో భారతదేశం నుంచి యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)కి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అప్పటీ నుంచి ఆయన లండన్ లోనే నివసిస్తున్నారు. అక్కడ తనను భారత్ కు అప్పగించే విషయానికి వ్యతిరేకంగా సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్నారు!