Begin typing your search above and press return to search.

మల్లారెడ్డి సంచలన ప్రకటన!

రానున్న ఐదేళ్లలో మేడ్చల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మల్లారెడ్డి తెలిపారు.

By:  Tupaki Desk   |   1 Feb 2024 5:30 AM GMT
మల్లారెడ్డి సంచలన ప్రకటన!
X

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇక తాను పోటీ చేయబోనని ప్రకటించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరివని తెలిపారు. భవిష్యత్తులో ఇక పోటీ చేయబోనని తేల్చిచెప్పారు.

రానున్న ఐదేళ్లలో మేడ్చల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌ పేట మండల పరిధిలోని సీఎంఆర్‌ కన్వెన్షన్‌ లో విజయోత్సవ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ప్రజలే తన బలగమని, కార్యకర్తలే కుటుంబమని తెలిపారు. ప్రతి మునిసిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కష్టపడ్డానని గుర్తుచేశారు. తన సేవలను గుర్తించిన ప్రజలు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని చెప్పారు. ఇందుకు ధన్యవాదాలు తెలిపారు.

కాగా మల్లారెడ్డి తొలిసారి 2014లో మల్కాజిగిరి నుంచి టీడీపీ తరఫున ఎంపీగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున మేడ్చల్‌ పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తిరిగి 2023 ఎన్నికల్లో మేడ్చల్‌ నుంచే గెలుపుబావుటా ఎగురవేశారు.

మరోవైపు మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేస్తానని ఇటీవల మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీగా పోటీ చేయాలని ఉందన్నారు. ఇంతలోనే తాజాగా తాను ఇక ఏ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలని స్పష్టం చేశారు.

కాగా మల్లారెడ్డి విద్యా సంస్థలకు అధినేతగా ఆయన ఉన్నారు. మల్లారెడ్డి గ్రూపులో స్కూళ్లు, ఇంజనీరింగ్, మెడికల్‌ కళాశాలలు, ఎంబీఏ కళాశాలలు ఉన్నాయి. వీటిలో కొన్ని వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం విద్యా సంస్థల బాధ్యతలను మల్లారెడ్డి కుమారుడు, కోడలు చూసుకుంటున్నారు.

ఎన్నికల నుంచి మల్లారెడ్డి తప్పుకుంటే విద్యా సంస్థల బాధ్యతలను చూసుకోవచ్చని చెబుతున్నారు. విద్యార్థులతో సరదాగా గడపటం ఆయనకెంతో ఇష్టమని గుర్తు చేస్తున్నారు.