Begin typing your search above and press return to search.

చేతిలో రూపాయి లేదు.. కారు లేని రూ.వంద కోట్ల ఆస్తులున్న మల్లారెడ్డి

తాజాగా ఆయన తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా తనకున్న ఆస్తులు.. అప్పుల లెక్కను చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.

By:  Tupaki Desk   |   9 Nov 2023 4:28 AM GMT
చేతిలో రూపాయి లేదు.. కారు లేని రూ.వంద కోట్ల ఆస్తులున్న మల్లారెడ్డి
X

పాలమ్మా.. పూలు అమ్మా.. బాగా సంపాదించా.. కాలేజీలు పెట్టానంటూ సినిమాటిక్ మాట్లాడుతూ.. తన మాస్ ప్రసంగాలతో అందరిని ఎంగేజ్ చేసే టాలెంట్ తెలంగాణ రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి సొంతం. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉండటం తెలిసిందే. తాజాగా ఆయన తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా తనకున్న ఆస్తులు.. అప్పుల లెక్కను చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. ఈ సందర్భంగా దాఖలుచేసిన నామినేషన్ ను చూస్తే.. ఆశ్చర్యకరమైన అంశాలు కనిపిస్తాయి.

రూ.95 కోట్లకు పైనే ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్న మల్లారెడ్డి తనకు సొంతంగా కారు లేదని.. చేతిలో రూపాయి క్యాష్ లేదని పేర్కొనటం గమనార్హం. కోట్లాది రూపాయిలు ఆస్తులు ఉన్నప్పటికీ.. చేతిలో రూపాయి క్యాష్ లేదంటూ అఫిడవిట్ లో పేర్కొన్న వైనం ఆసక్తికరంగా మారింది. మంత్రి మల్లారెడ్డి తన మొత్తం ఆస్తులు రూ.95.95 కోట్లుగా పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా సూరారం.. కండ్లకోయ.. దూలపల్లి.. జీడిమెట్ల.. గుండ్ల పోచంపల్లి.. గుండ్ల పోచారం గ్రామాల్లో వ్యవసాయ భూములు.. మైసమ్మగూడ.. ఫిరోజ్ గూడ.. బోయిన్ పల్లి.. కొంపల్లి.. అబిడ్స్ లో కమర్షియల్ భవనాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

తనపేరు మీద 41.40కోట్లు.. తన భార్య కల్పన పేరు మీద రూ.38.69 కోట్లు.. డిపెండెంట్ మీద రూ.10.14 కోట్ల స్థిరాస్తులుగా పేర్కొన్నారు. తమ చరాస్తుల విలువ రూ.5.7 కోట్లుగా పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో రూ.7.5 కోట్ల అప్పులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

బుధవారం పలువురు ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్బంగా దాఖలుచేసిన అఫిడవిట్ లో పేర్కొన్న ఆసక్తికర విషయాల్ని చూస్తే..

- మంత్రి గంగుల కమలాకర్ పలు సంస్థల్లో తనకు వ్యాపార భాగస్వామ్యం ఉన్నట్లుగా పేర్కొన్నారు. తన మొత్తం ఆస్తులు రూ.34.08 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో రూ.7కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. రూ.11.53 కోట్ల చరాస్తులు ఉన్న గంగుల.. తన సతీమణి పేరు మీద రూ.7.87 కోట్ల ఆస్తి ఉన్నట్లుగా వెల్లడించారు. తమ స్థిరాస్తుల విలువ రూ.13.97 కోట్లుగా.. భార్య పేరుతో రూ.82.7 లక్షల విలువైన ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తం రూ.50.63 లక్షల అప్పులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

- నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డికి రూ.112.23 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా వెల్లడించారు.

- కోరుట్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ధర్మపురి అర్వింద్ తన ఆస్తుల గురించి పేర్కొంటూ రూ.107.4 కోట్లుగా వెల్లడించారు. అదే సమయంలో తనపై 17 కేసులు ఉన్నట్లుగా తెలిపారు.

- చాంద్రాయణగుట్ట మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తన నామినేషన్ లో తనకురూ.18.77కోట్ల ఆస్తులు.. రూ.8.12 కోట్ల అప్పులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

- పాలేరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కందాల ఉపేందర్ రెడ్డి రూ.89.57 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

- మహబూబాబాద్ అభ్యర్థి శంకర్ నాయక్ మొత్తం ఆస్తుల విలువ రూ.21.06 కోట్లుగా ప్రకటించారు. ఇందులో ఆయన కుటుంబానికి 52.3 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా వెల్లడించారు.

- ఖైరతాబాద్ అభ్యర్థిగా బరిలో ఉన్న దానం నాగేందర్ తన ఆస్తుల వివరాల్ని వెల్లడించారు. 54.17 ఎకరాల వ్యవసాయ భూమి.. రూ.6.6 కోట్ల వజ్రాలు ఉన్నట్లుగా వెల్లడించారు. అడ్వాన్సులు.. అప్పులు కలిపి రూ.49.55 కోట్లఆస్తులు ఉన్నట్లుగాపేర్కొన్నారు.

- సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కోట నీలిమకు రాజస్థాన్ లో 10.15 ఎకరాల వ్యవసాయ భూమి.. ఇల్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. తనకు 8.01 కేజీల బంగారం ఉన్నట్లుగా వెల్లడించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.54.75 కోట్లుగా పేర్కొన్నారు.

- సంగారెడ్డి అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రకాశ్ రెడ్డి తన మీద 20కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

- శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాంధీ ఆస్తి రూ.85.14 కోట్లుగా.. కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కె. సంజయ్ ఆస్తి రూ.62.4 కోట్లుగా పేర్కొన్నారు. సనత్ నగర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మర్రి శశిధర్ రెడ్డి ఆస్తి రూ.51.14 కోట్లుగా పేర్కొన్నారు. మనుగోడు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ఆస్తులు రూ.13.13 కోట్లుగా పేర్కొంటే.. హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న పొన్నం ప్రభాకర్ తన ఆస్తులు రూ.11.83 కోట్లుగా పేర్కొన్నారు.