Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి పొలిటికల్ మైండ్ గేమ్

మల్లారెడ్డి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి తన కుమారుడిని పోటీ చేయించాలని భావిస్తున్నారు

By:  Tupaki Desk   |   9 March 2024 11:30 PM GMT
మాజీ మంత్రి పొలిటికల్ మైండ్ గేమ్
X

మొన్నటివరకు అధికారం చెలాయించిన పార్టీలో ఉంటారా? ఉండరా?.. కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీలోకి దూకేస్తారా? ఓవైపు ప్రభుత్వం ఆయన అక్రమాలపై కన్నేసింది.. మరోవైపు అల్లుడునూ టార్గెట్ చేసింది.. ఇంకోవైపు రాజకీయంగా ఇప్పుడున్న పార్టీ పరిస్థితి కూడా బాగోలేదు. దీంతో ఆ మాజీ మంత్రి పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తద్వారా ఎటొచ్చీ తనకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.

మల్లన్న స్టైలే వేరు..

బీఆర్ఎస్ ఈసారి కూడా అధికారంలోకి వస్తే మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్థాయి వేరేగా ఉండేది. మరోసారి మంత్రి పదవి దక్కడమే కాక.. కాంగ్రెస్ ను ఇబ్బందిపెట్టేందుకు ఆయనను వాడుకునేవారు. కానీ, పరిస్థితి తారుమారైంది. వాస్తవానికి ఎన్నికల సమయంలో మల్లారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ స్టార్ క్యాంపెయినర్ అంటూ పొగిడారు. సోషల్ మీడియాలో మల్లారెడ్డికి ఆదరణ కూడా అదే స్థాయిలో ఉండేది. కింది స్థాయి నుంచి వేల కోట్లకు అధిపతిగా ఎదిగిన తన ప్రస్థానంపై పాలమ్మినా.. పూలమ్మినా అంటూ ఆయన చెప్పిన డైలాగ్ బాగా పాపులర్. దీంతోనే బీఆర్ఎస్ నాయకులు కూడా మల్లారెడ్డికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు.

కారు దిగుతారా..?

మల్లారెడ్డి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి తన కుమారుడిని పోటీ చేయించాలని భావిస్తున్నారు. అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మల్లారెడ్డి వ్యవహారాలను అన్నిటికీ బయటకు తీస్తోంది. రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాన్ని ఇటీవల పాక్షికంగా కూల్చివేయించింది. అందులోనూ మల్లారెడ్డిని అడ్డుకోకుంటే మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో గెలవడం కష్టం. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఒత్తిడి పెంచుతోంది. పైగా మల్కాజిగిరి లోక్ సభ సీటు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం. ఇలాంటి పరిస్థితుల్లో మల్లారెడ్డిని నిలువరించడం ముఖ్యం. దీంతో ఆయన వెనక్కుతగ్గుతారని భావిస్తోంది.

అటు వేం నరేందర్ రెడ్డితో.. ఇటు కేటీఆర్ తో

మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేతతో గురువారం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశమైన మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరతారంటూ కథనాలు వచ్చాయి. ఈ మేరకు ఫీలర్లు వదిలారు. గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఏ మాట్లాడారో బయటకు రాలేదు. ఇక శుక్రవారం మల్లారెడ్డి ఏకంగా కేటీఆర్ ను కలిసి తాను పార్టీ మారనని స్పష్టం చేశారు. కుమారుడికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ కూడా వద్దని స్పష్టం చేశారు. ఇవన్నీ చూస్తుంటే మల్లారెడ్డి పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు స్పష్టం అవుతోంది.