Begin typing your search above and press return to search.

అటు నుంచి నరుక్కొస్తున్న మల్లారెడ్డి!

ముఖ్యంగా నాడు మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. అప్పట్లో మల్లారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.tr

By:  Tupaki Desk   |   14 March 2024 10:01 AM GMT
అటు నుంచి నరుక్కొస్తున్న మల్లారెడ్డి!
X

తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కంటే కూడా ‘పూలు అమ్మినా.. పాలు అమ్మినా.. కట్టెలమ్మినా.. ఇనిస్టిట్యూషన్స్‌ పెట్టినా’ అనే డైలాగ్‌ ద్వారానే మల్లారెడ్డి పాపులర్‌ అయ్యారు. అంతేనా ‘నేను తుమ్మితే తుపాను వస్తది’ అని కూడా డైలాగ్‌ పేల్చారు.

అయితే బళ్లు ఓడలయినట్టు, ఓడలు బళ్లు అయినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ చిత్తవ్వడంతో మల్లారెడ్డికి కూడా కష్టకాలం మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా చక్రం తిప్పిన మల్లారెడ్డి మేడ్చల్‌ జిల్లాలో తన హవాను సాగించారు. ఈ క్రమంలో ఆయనపై పలు భూకబ్జా ఆరోపణలు కూడా వచ్చాయి.

ముఖ్యంగా నాడు మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. అప్పట్లో మల్లారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి వందల ఎకరాలను భూములను ఆక్రమించారని విమర్శించారు. ఈ విమర్శలపై మల్లారెడ్డి సైతం రేవంత్‌ పై ఘాటుగా స్పందించారు.

కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి తన కాలేజీకి రోడ్డు వేసుకున్నారన్న ఆరోపణలపై మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవన్నీ ముందే గ్రహించిన మల్లారెడ్డి కాంగ్రెస్‌ గెలవగానే ఆ పార్టీకి అనుకూల వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ మా వాడేనని.. తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదన్నారు.

కాగా ఇప్పుడు మల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని టాక్‌ నడుస్తోంది. ఆయనతోపాటు మల్కాజిగిరి ఎమ్మెల్యే, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖరరెడ్డి కూడా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. ఇటీవల రాజశేఖరరెడ్డికి చెందిన భవనాలను కూడా అధికారులు కూల్చేశారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి భవనాలు నిర్మించారని ఆయనపై కేసు నమోదు చేశారు.

అయితే మల్లారెడ్డితోపాటు ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ లో చేరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డితోపాటు ఇటీవల ఎన్నికల్లో మల్లారెడ్డిపై ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి తోటకూర వజ్రేష్‌ యాదవ్, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత నక్కా ప్రభాకర్‌ గౌడ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.

వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా మల్లారెడ్డి విషయంలో ఇదే అభిప్రాయంతో ఉన్నారని టాక్‌ నడుస్తోంది. స్వయంగా మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు తానే మల్లారెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసి.. ఇప్పుడు తానే పార్టీలోకి తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కాంగ్రెస్‌ లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నా రేవంత్‌ పెద్ద ఆసక్తిగా లేరని అంటున్నారు.

ఈ నేపథ్యంలో మల్లారెడ్డి మాత్రం తన ఆశలు వదులుకోకుండా కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్‌ ద్వారా పార్టీలోకి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి.. తాజాగా డీకే శివకుమార్‌ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

డీకే శివకుమార్‌ తో భేటీలో కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి మల్లారెడ్డి, ఆయన తనయుడు ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంక వథేరాను మల్లారెడ్డి కలుస్తారని టాక్‌ నడుస్తోంది. ఈ మేరకు ఆమె అపాయింట్మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు.

ప్రియాంక, డీకే శివకుమార్‌ ద్వారా తెలంగాణ పీసీసీ నేతలపై ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్‌ పార్టీలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖరరెడ్డి చేరాలనుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది.

కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డితో కూడా మల్లారెడ్డి భేటీ అయ్యారు. ఆ సమయంలోనే మల్లారెడ్డి బీఆర్‌ఎస్‌ కు గుడ్‌ బై చెబుతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ను కలిసి తాము వేం నరేందర్‌ రెడ్డిని ఎందుకు కలవాల్సి వచ్చిందో మల్లారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు డీకే శివకుమార్‌ తో భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.