Begin typing your search above and press return to search.

రేవంత్ సీఎం అవుతారని మొదట చెప్పింది మల్లారెడ్డినేనట

ఆ వీడియోలో ఏమున్నదంటే.. ఒక విందులో మల్లారెడ్డికి ఎదురుగా కూర్చున్న రేవంత్ ను ఉద్దేశించి.. రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సు ఉంది..

By:  Tupaki Desk   |   17 March 2024 5:49 AM GMT
రేవంత్ సీఎం అవుతారని మొదట చెప్పింది మల్లారెడ్డినేనట
X

మాజీ మంత్రి మల్లారెడ్డి నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఆయన.. పార్టీ మారటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ ను వీడేది లేదని.. గులాబీ కారు దిగేది లేదని స్పష్టం చేస్తున్నారు మల్లారెడ్డి. ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో మల్లారెడ్డి ఫ్యామిలీకి చెందిన కాలేజీ భూముల్లో కొంత భాగం ప్రభుత్వానికి చెందిందన్న ఆరోపణలు రావటం.. రెవెన్యూ అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవటం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు వెళ్లిన మల్లారెడ్డి.. కర్ణాటక డిప్యూటీ సీఎంతో భేటీ కావటం.. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చి వైరల్ కావటం తెలిసిందే. దీంతో.. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మల్లారెడ్డి.. ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.

మీడియా మిత్రుల్ని కలవటానికి ముందు మంత్రి మల్లారెడ్డికి చెందిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ తెగ చక్కర్లు కొట్టింది.

ఆ వీడియోలో ఏమున్నదంటే.. ఒక విందులో మల్లారెడ్డికి ఎదురుగా కూర్చున్న రేవంత్ ను ఉద్దేశించి.. రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సు ఉంది.. రెడ్లల్లో నీ ఒక్కడికే ఆ అవకాశం ఉందన్నా' అంటూ మాట్లాడిన మాటలు ఉన్నాయి. అయితే.. ఈ వీడియో మీద స్పందిస్తూ 2014లో బొల్లారంలో తోట ముత్యాలమ్మ టెంపుల్లో దివంగత ఎమ్మెల్యే సాయన్న ఇచ్చిన విందుకు హాజరైన సందర్భంగా తానీ వ్యాఖ్యలు చేసినట్లుగా మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు.

అదే సమయంలో తాను వేరే పార్టీలో చేరేది లేదని స్పష్టం చేసిన మల్లారెడ్డి.. గతంలో రేవంత్ పై తొడగొట్టి చేసిన వ్యాఖ్యలన్ని కేవలం రాజకీయ పరంగానే తప్పించి.. వ్యక్తిగతం కాదని పేర్కొనటం గమనార్హం. తన కొడుకు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడని.. అతను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న మల్లారెడ్డి వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి మల్లారెడ్డి మాటల్లో ఏదో తేడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.