Begin typing your search above and press return to search.

మల్లారెడ్డి మాటల లెక్కేంది? పొత్తు ఉన్నా సీటు ఆయనదేనట

తనతో పాటు తన అల్లుడ్ని సైతం గెలిపించుకోవటంలో సక్సెస్ అయిన మల్లారెడ్డి.. ఇప్పుడు తన కొడుక్కి ఎంపీ టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 12:30 PM GMT
మల్లారెడ్డి మాటల లెక్కేంది? పొత్తు ఉన్నా సీటు ఆయనదేనట
X

తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది నేతలు ఉన్నా.. మాజీ మంత్రి మల్లారెడ్డి లెక్కనే వేరుగా చెబుతారు. ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉందని ప్రచారం చేసినా.. అంతకు రెట్టింపు బలంతో ఎన్నికల్లో విజయం సాధించటం ఆయనకే చెల్లుతుందని చెప్పాలి. పోల్ మేనేజ్ మెంట్ లో ఆయన లెక్కలే వేరుగా ఉంటాయన్న వాదనకు ఈ మధ్యన జరిగిన ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయని చెప్పాలి. తనతో పాటు తన అల్లుడ్ని సైతం గెలిపించుకోవటంలో సక్సెస్ అయిన మల్లారెడ్డి.. ఇప్పుడు తన కొడుక్కి ఎంపీ టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

అధికారం ఏదైనా సరే.. ఎవరి చేతుల్లోనే ఎందుకు ఉండాలన్నట్లుగా ఆయన తీరు ఉంది. తమ కుటుంబానికి ఆరేడు ఇంజినీరింగ్ కాలేజీలు.. పలు మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు ఎంపీ.. ఎమ్మెల్యేల పదవుల్లో తమ కుటుంబానికే ఉండాలన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. ఇప్పటికే తన కొడుకు భద్రారెడ్డిని మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించేందుకు వీలుగా పావులు కదుపుతున్నారు.

ఇలాంటివేళ.. బీఆర్ఎస్.. బీజేపీ పొత్తు ఉంది కదా? కుదరదు కదా? అన్న ప్రశ్నకు అవకాశం లేదన్నట్లుగా ఆయన తాజా మాటలు ఉన్నాయి. బీజేపీ.. బీఆర్ఎస్ పొత్తు ఉండదనే మాట బలంగా వినిపిస్తున్నా.. మల్లారెడ్డి మాత్రం పొత్తు ఉన్నా లెక్కలు ఎలా ఉంటాయన్న దాని గురించి మాట్లాడటం విశేషం. బండి సంజయ్ మాటలు ఎలా ఉన్నా.. బీజేపీతో పొత్తు ఉన్నా మల్కాజిగిరి ఎంపీ టికెట్ మాదేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి.

మల్కాజిగిరి ఎంపీ టికెట్ భద్రంగా ఉందని.. తన కొడుక్కి టికెట్ ఇస్తే.. దాన్ని తమ కుటుంబానికి ఇచ్చినట్లుగా ప్రచారం చేయటం తగదని పేర్కొనటం గమనార్హం. "నా కొడుక్కి టికెట్ ఇస్తే ఫ్యామిలీకి ఇస్తారన్న ప్రచారం సరికాదు. మా అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ వేరు. మా ఫ్యామిలీ వేరు. అందరిని కలిపి ఒకే కుటుంబం అనటం సరికాదు" అంటూ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే మల్లారెడ్డి తెలివి ఇట్టే అర్థమవుతుంది. ఏమైనా.. మల్కాజిగి ఎంపీ టికెట్ పై కన్నేసిన మల్లారెడ్డి.. ఆ దిశగా వేగంగా పావులు కదుపుతున్నారని చెప్పకతప్పదు.