Begin typing your search above and press return to search.

అన్ని పార్టీల్లో అభ్యర్థులను నేనే డిసైడ్ చేస్తా... మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు!

ఏ పార్టీలో ఎవరు అభ్యర్థిగా ఉండాలో తానే నిర్ణయిస్తానని మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు!

By:  Tupaki Desk   |   3 Aug 2023 9:02 AM GMT
అన్ని పార్టీల్లో  అభ్యర్థులను నేనే డిసైడ్  చేస్తా... మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు!
X

గతకొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా... పూలమ్మినా, పాలమ్మినా.. అంటూ చేసిన వ్యాఖ్యలు ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బహిరంగ సభల్లో మల్లారెడ్డి స్పీచ్ కి డిఫరెంట్ ఫ్యాన్స్ క్లబ్ కూడా ఉందని అంటుంటారు. ఈ సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏ పార్టీలో ఏ అభ్యర్థి ఉండాలో డిసైడ్ చేసేది తానే అని అన్నారు. గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ చేసిన మంత్రి.. మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్‌ లో టికెట్లపై స్పందించారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా... ఏ పార్టీలో ఎవరు అభ్యర్థిగా ఉండాలో తానే నిర్ణయిస్తానని మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు! కాంగ్రెస్‌ లో కూడా ఏ క్యాండిడేట్ ఉండాలో డిసైడ్ చేయబోయేది తానేనని అన్నారు. ఇదే సమయంలో గత ఎన్నికల్లో కే.ఎల్.ఆర్. కు టికెట్ ఇప్పించిందే తానే అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

అక్కడితో ఆగని ఆయన... కాంగ్రెస్ అధిష్టానంలో తనకు స్నేహితులు ఉన్నారని చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ ల దగ్గర డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయం తప్ప మరో సబ్జెక్ట్ లేదని మల్లారెడ్డి విమర్శించారు.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అనగానే... తన పోస్టు ఊడుతుందని ప్రచారం చేశారని, నిజానికి రేవంత్ రెడ్డి పై తొడగొట్టిన తర్వాత తన గ్రాఫ్ పెరిగిందని మల్లారెడ్డి చెప్పుకున్నారు. తన మంత్రి పదవి విషయంలో కావాలనే కొంతమంది తన పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో త్వరలోనే తాను సొంతంగా ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించిన మల్లారెడ్డి... తెలంగాణ యాస లో ఏడాదికి నాలుగు సినిమాలు కూడా తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటే అని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తమది రాజకీయ పార్టీ అని.. ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎన్నికల స్టంట్స్ అనేవి ఎలాగైనా వుంటాయని కామెంట్ చేశారు. ఇటీవల టీ.ఎస్.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన అనంతరం మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.