Begin typing your search above and press return to search.

మాయమైన మల్లారెడ్డి !

కానీ తెలంగాణలో రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి గత కొన్నాళ్లుగా మీడియాకు దూరమయ్యాడు.

By:  Tupaki Desk   |   13 April 2024 9:30 AM GMT
మాయమైన మల్లారెడ్డి !
X

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆంధ్రా రాజకీయాల్లో ఇలాంటి రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం మల్లారెడ్డి మినహా మరెవరూ కనిపించరు. పాలమ్మిన, పూలమ్మిన, బోర్ వెల్ నడిపిచ్చిన, కష్టపడ్డ, కాలేజీలు పెట్టిన, సక్సెస్ అయిన అన్న డైలాగుతో మల్లారెడ్డి మీడియాలో, సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. కానీ తెలంగాణలో రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి గత కొన్నాళ్లుగా మీడియాకు దూరమయ్యాడు.

2014 ఎన్నికల్లో మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయాల్లో అడుగుపెట్టి మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే అదే స్థానం కోసం ఆశించిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డికి ఇది రుచించలేదు. అందుకే మల్లారెడ్డి విద్యాసంస్థల మీద గవర్నర్ కు ఫిర్యాదు చేశాడు.

ఆ తరువాత తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం టీడీపీ నుండి మల్లారెడ్డి టీఆర్ఎస్ లో చేరడం, 2018 ఎన్నికల్లో మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావడం జరిగింది.

అయినా రేవంత్ మల్లారెడ్డిని వెంటాడడం మానడం లేదు. అవకాశం దొరికిన ప్రతిసారి మల్లారెడ్డి ఆరోపణలు చేయడం ఆపలేదు. ఈ నేపథ్యంలో అరే రేవంత్ అంటూ పలుమార్లు బహిరంగంగా తొడగొట్టి రేవంత్ కు సవాల్ విసరడం జరిగింది.

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడం, రేవంత్ ముఖ్యమంత్రి కావడం, మల్లారెడ్డి మేడ్చల్, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్ గిరి ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ తన పాత శతృవు మల్లారెడ్డి మీద దృష్టిసారించాడు. అతని విద్యాసంస్థల కోసం అక్రమంగా భవనాలు నిర్మించారని, రహదారులు వేసుకున్నారని అధికారులతో ఆ అక్రమాలకు చెక్ పెట్టడం, కూలగొట్టడం, రోడ్లు బంద్ చేయడం జరిగింది.

ఈ పరిస్థితులలో మల్లారెడ్డి రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు, బెంగుళూరుకు వెళ్లి డీకే శివకుమార్ ను కలుసుకోవడం జరిగింది. అధికారంలోకి వచ్చిన రెండున్నర, మూడు నెలల వరకు ప్రతిరోజూ మల్లారెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటాడడం, మల్లారెడ్డి మీడియా ముందుకు రావడం జరిగేది. అయితే గత నెల, నెలన్నర రోజులుగా మల్లారెడ్డి పూర్తిగా కనిపించడం గానీ, మీడియా స్టేట్ మెంట్లు గానీ ఇవ్వడం లేదు. రేవంత్, కాంగ్రెస్ అధిష్టానంతో జరిగిన రాజీ మూలంగానే సైలెంట్ అయినట్లు తెలుస్తున్నది.