Begin typing your search above and press return to search.

మంత్రి మల్లారెడ్డి నామినేషన్ అఫిడవిట్ లో అన్ని తప్పులున్నాయా?

అతగాడి కంప్లైంట్ ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. మంత్రి మల్లారెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుంది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 4:02 AM GMT
మంత్రి మల్లారెడ్డి నామినేషన్ అఫిడవిట్ లో అన్ని తప్పులున్నాయా?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎపిసోడ్ లో నామినేషన్ల ఘట్టం పూర్తి కావటం.. ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు నామినేషన్లను తిరస్కరిస్తున్నట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. మేడ్చల్ అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు మంత్రి మల్లారెడ్డి. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని పేర్కొంటూ రాంపల్లి దాయార గ్రామానికి చెందిన కందాడి అంజిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

అతగాడి కంప్లైంట్ ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. మంత్రి మల్లారెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుంది. ఆయన లేవనెత్తిన అంశాల్ని చూసినప్పుడు మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్న అంశాల్లో ఇన్ని తప్పులు ఉన్నాయా? అన్న విస్మయం వ్యక్తం కావటం ఖాయం. సదరు సామాన్యుడు లేవనెత్తిన సందేహాలు.. తప్పుల తడకను చూస్తే..

- 2014లో ఎంపీగా పోటీ చేసినపుడు ఇచ్చిన అఫిడవిట్‌లో ప్యాట్నీలోని ప్రభుత్వ కళాశాలలో 1973లో ఇంటర్‌ చదివానని, 2018లో మేడ్చల్‌ ఎమ్మెల్యేగా బరిలో దిగినపుడు సికింద్రాబాద్‌ వెస్లీ కాలేజ్‌లో 1973లో ఇంటర్‌ పూర్తి చేసినట్లు తెలిపారని, తాజా అఫిడవిట్‌లో రాఘవలక్మీదేవి ప్రభుత్వ కళాశాలలో 1973లో ఇంటర్‌ చదివినట్లు తెలిపారు. ఇంటర్ చదివిన ఏడాది ఒక్కటే అయినా.. ఒక్కో ఎన్నికలో ఒక్కో కాలేజీలో చదవటం ఏమిటి? అన్నది ప్రశ్నను లేవనెత్తారు.

- ఎంపీగా పోటీ చేసినప్పుడు తన వయసు 56 ఏళ్లు అన్న మల్లారెడ్డి.. తాజాగా తన వయసు 70 ఏళ్లుగా పేర్కొన్న విషయాన్ని ఎత్తి చూపారు. తొమ్మిదేళ్ల వయసులో 15 ఏళ్లు ఎలా పెరిగింది? అన్న ప్రశ్నను లేవనెత్తారు.

- ఆస్తుల వివరాల్ని సైతం మంత్రి మల్లారెరడ్డి తప్పుల తడకగా సమర్పించారు. అందుకే ఆయన నామినేషన్ ను రిజెక్టు చేయాల్సిన అవసరం ఉందని సదరు సామాన్యుడు డిమాండ్ చేస్తున్నారు.

మంత్రి మల్లారెడ్డి నామినేషన్ తో పాటు.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నామినేషన్ చెల్లదంటున్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎన్నికల సంఘ నియమావళికి విరుద్ధంగా పూర్తి చేశారని.. ముఖ్యంగా ఫామ్ 26ను నిబంధనలకు విరుద్ధంగా నింపినట్లుగా ఆరోపిస్తున్నారు. కొన్ని కాలమ్స్ ను ఎత్తి వేయటాన్ని ఎత్తి చూపిస్తూ.. ఆయన నామినేషన్ ను చెల్లదని ప్రకటించాలని కోరుతున్నారు. అవసరమైతే దీనిపై న్యాయపోరాటం చేస్తామన్న తుమ్మల ప్రకటన సంచలనంగా మారింది. దీనికి బదులుగా మంత్రి పువ్వాడ ఘాటుగా రియాక్టు అయ్యారు.

2014లోనూ తన ఎన్నికపై తుమ్మల హైకోర్టులో పిటిషన్ వేసి ఫెయిల్ అయ్యారన్న మంత్రి పువ్వాడ.. "2018లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి పైనా కంప్లైంట్ చేశారు. అన్ని సరిగ్గా ఉన్నా తుమ్మల చెప్పగానే ఆర్వో రద్దు చేస్తారా? 2018లో డిపెండెంట్స్ ఉన్నట్లు చూపించానని.. కొడుకు పెళ్లి కావటంతతో ఈసారి చూపించలేదని.. అంతకు మించి మరేం లేదు" అంటూ తుమ్మల లేవనెత్తిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అయితే.. తుమ్మల లేవనెత్తిన మిగిలిన తప్పుల మీద పువ్వాడ మాట్లాడకపోవటం గమనార్హం.