Begin typing your search above and press return to search.

మాల్దీవులకు కొత్త అధ్యక్షుడు... భారత్ పై పడుతున్నది అందుకేనా?

భారత్ ను పంపించేసి, చైనాతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలని మయిజ్జు భావిస్తున్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   27 Oct 2023 11:00 AM GMT
మాల్దీవులకు కొత్త అధ్యక్షుడు... భారత్  పై పడుతున్నది అందుకేనా?
X

భారత పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న లక్షదీవులకు కింద.. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే కీలకమైన సముద్రమార్గానికి సమీపంలో ఉన్న అందమైన దీవులే మాల్దీవులు అనే సంగతి తెలిసిందే. ఈ మాల్దీవులు అతిచిన్న దేశం కావడంతో.. భారత్‌ వీరికి ఎక్కువగా సాయం చేసింది. అయితే ఇప్పుడు ఆ సహాయం తమకు వద్దని.. తాము పూర్తి స్వాతంత్రంగా ఉండాలనుకుంటున్నామని చెప్పుకొస్తున్నాడు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు!

అవును... భారత్‌ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను మాల్దీవుల్లో మోహరించిన భారత బలగాలు చూస్తాయి. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌ లో గస్తీకి సహకరిస్తాయి. అయితే... ఇకపై అలాంటి సేవలు ఏమీ అవసరం లేదని, పూర్తి స్వతంత్రంగా ఉండాలని భావిస్తున్నామని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు తెలిపారు.

ఇదే సమయంలో... తమ గడ్డపై భారత సైన్యం ఉందని వారిని వెళ్లమనడం లేదని, ఆ ప్లేస్ లో ఇతర ఏ దేశాలకు చెందిన సైన్యం ఉన్నా అదేమాట చెప్పేవారమని అంటున్నారు మయిజ్జు. ఇక్కడ ఉన్న సైన్యం గురించి ఇప్పటికే భారత ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించామని, అవి విజయవంతంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో... రెండు వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ద్వైపాక్షిక సంబంధాలను తాము కోరుకుంటామని చెప్పుకొచ్చారు.

హిందూ మహాసముద్రంలో చిన్నదీవుల సమూహమైన మాల్దీవులపై పట్టుకోసం భారత్, చైనా రెండూ పోటీ పడుతున్న వేళ మయిజ్జు ఇలా వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతుంది. భారత్ ను పంపించేసి, చైనాతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలని మయిజ్జు భావిస్తున్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే... భారత్ ఇలా అనుమానించాడనికి ఒక బలమైన కారణం ఉంది. చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామీన్‌ కు మయిజ్జు సన్నిహితుడు!

వాస్తవానికి హిందూ మహాసముద్రంలో చిన్న దీవుల సమూహమైన మాల్దీవులకు భారత్‌ తోనే ఎక్కువ అనుబంధం ఉంది. అయితే 2013లో అధికారంలోకి వచ్చిన యామీన్‌ గయాం... భారత్‌ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించి చైనాకు దగ్గరయ్యాడు. అతని తర్వాత అధికారంలోకి వచ్చి, ఇప్పటివరకు అధికారంలో ఉన్న ఇబ్రహీం సోలిహ్‌ మాత్రం భారత్‌ తో సన్నిహిత సంబంధాలకు కృషి చేశారు.

ఈ క్రమంలో మరోసారి యామీన్‌ గయాం సన్నిహితుడు మయిజ్జు రాకతో మళ్లీ చైనా వైపు మొగ్గు చూపేందుకు మాల్దీవులు ప్రయత్నించవచ్చని భారత రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికీ ఒక బలమైన కారణం ఉంది... మాల్దీవుల్లో చైనా ఎలాంటి చర్యలకు పాల్పడినా.. భారత భద్రతపై పెను ప్రమాదం చూపించే అవకాశముంది! దీంతో మాల్దీవుల యంత్రాంగాన్ని ముందుగానే కట్టడి చేయాలని రక్షణ రంగ నిపుణులు కోరుతున్నారు!!