Begin typing your search above and press return to search.

బలుపు తగ్గించి అప్పు తీసేయమంటున్న మాల్దీవుల అధ్యక్షుడు

గత ఏడాది చివరి నాటికి భారత్ కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్ డాలర్లు బకాయి పడింది.

By:  Tupaki Desk   |   23 March 2024 4:55 AM GMT
బలుపు తగ్గించి అప్పు తీసేయమంటున్న మాల్దీవుల అధ్యక్షుడు
X

అధికారం చేతిలోకి వచ్చినంతనే విపరీతమైన బలుపును ప్రదర్శించి.. భారత్ పట్ల అవాకులు చవాకులు పేలిన మాల్దీవుల అధ్యక్షుడు ఇప్పుడు స్వరం మార్చారు. తమ దేశం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నట్లుగా పేర్కొన్న ఆయన.. భారత్ కు తాము ఉన్న అప్పును తీసేయాల్సిందిగా కోరటం ఆసక్తికరంగా మారింది. మాల్దీవుల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన నోటి నుంచి ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. భారత్ తమకు ఎప్పటి నుంచో మిత్ర దేశంగా ఉందని.. ఎప్పటికి తమకు సన్నిహిత మిత్రుడిగా ఆయన అభివర్ణించారు.

గత ఏడాది చివరి నాటికి భారత్ కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్ డాలర్లు బకాయి పడింది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించే విషయంలో ఉపశమనం కలిగించాలని ఆ దేశం కోరుకుంటోంది. భారత వ్యతిరేక గళంతో అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన మహ్మద్ ముయిజ్జు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చైనా అనుకూల స్వరాన్ని ప్రదర్శించటం.. డ్రాగన్ దేశంలో అంటకాగటం తెలిసిందే.

అంతేకాదు దశాబ్దాల తరబడి మాల్దీవుల్లో ఉన్న భారత్ కు చెందిన పరిమిత సంఖ్యలో ఉన్న బలగాల్ని (80 మంది మాత్రమే) తమ దేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా పేర్కొనటంతో పాటు అందుకు మే 10 గడువు విధించటం తెలిసిందే. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు అంశాల్ని ప్రస్తావించారు. మల్దీవులకు సాయం అందించే విషయంలో భారత్ కీలక పాత్ర పోషించిందని.. పెద్ద మొత్తంలో ప్రాజెక్టుల్ని నిర్మించిన వైనాన్ని ప్రస్తావిస్తూ ప్రశంసించారు.

ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య స్నేహ బంధం కొనసాగుతుందన్న ఆయన.. తన తియ్యటి మాటల వెనుక భారీ ప్లాన్ వేసినట్లుగా చెప్పాలి. భారత్ కు చెల్లించాల్సిన 400 మిలియన్ డాలర్ల (రూ.3,343 కోట్లు) రుణాన్ని చెల్లించకుండా ఉపశమనం కలిగించాలని కోరటం ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వాలు చేపట్టిన చర్యల కారణంగా భారత్ నుంచి తీసుకున్న అప్పులు భారీగా పేరుకుపోయినట్లుగా పేర్కొన్న ఆయన.. తిరిగి చెల్లించే విషయంలో మినహాయింపు కోరుతూ భారత్ తో చర్చలు జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు.

అంతేకాదు మాల్దీవుల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టును అడ్డుకోమన్న ఆయన.. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసేలా తాము సహకరిస్తామన్న విషయాన్ని దుబాయ్ వేదికగా జరిగిన కాప్ 28 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన భేటీ సందర్భంగా చెప్పినట్లుగా వెల్లడించారు. భారత్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంగా మాల్దీవుల అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.