Begin typing your search above and press return to search.

కమల్‌ హాసన్‌ సంచలన ప్రకటన!

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌ ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు.. ఇలా రెండు పడవల మీద విజయవంతంగా ప్రయాణిస్తున్నారు

By:  Tupaki Desk   |   11 Sep 2023 4:30 PM GMT
కమల్‌ హాసన్‌ సంచలన ప్రకటన!
X

ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌ ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు.. ఇలా రెండు పడవల మీద విజయవంతంగా ప్రయాణిస్తున్నారు. గతేడాది 'విక్రమ్‌'తో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టారు.. కమల్‌ హాసన్‌. అలాగే ప్రస్తుతం.. భారతీయుడు-2 సినిమా, విక్రమ్‌ కు సీక్వెల్‌ కూడా చేస్తున్నారు.

తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల ముందు మక్కల్‌ నీది మయ్యమ్‌ పేరుతో పార్టీ స్థాపించారు.. కమల్‌. గత ఎన్నికల్లో తమిళనాడులోని రెండో పెద్ద నగరం కోయంబత్తూరు సౌత్‌ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అయినా సరే రాజకీయాల్లో క్రియాశీలకంగానే వ్యవహరిస్తున్నారు.

2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యమ్‌ 3.78 శాతం ఓట్లు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2.62 శాతం ఓట్లు సాధించింది. అయితే.. అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరు కూడా ఆ పార్టీ తరఫున గెలుపొందలేదు.

మరోవైపు తాను స్థాపించిన 'మక్కల్‌ నీది మయ్యమ్‌' పార్టీ తరఫున కమల్‌ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పాదయాత్రకు సంఘీభావం కూడా ప్రకటించారు.

మొదటి నుంచి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై, బీజేపీ మతతత్వ రాజకీయాలపై కమల్‌ హాసన్‌ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకు పలుమార్లు బీజేపీ శక్తుల నుంచి బెదిరింపులు, హెచ్చరికలు ఎదుర్కొన్నారు.

కమల్‌ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని తెలిపారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధిస్తానని వెల్లడించారు. ఈసారి ఓడే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు.

చాలా రోజుల తరువాత పార్టీ నిర్వాహకులతో సమావేశమైన ఆయన పలు అంశాలపై చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనతో పాటు పార్టీ తరఫున పోటీ చేసిన వారంతా ఓడిపోవడం బాధాకరమని కమల్‌ వ్యాఖ్యానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కోవై (కోయంబత్తూరు) స్థానం నుంచి పోటీ చేసి తప్పనిసరిగా గెలుపొందుతానని శపథం చేశారు.

కాగా గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బ్రిటిష్‌ హయాంకు ముందు దేశంలో ఉన్న ఈస్టిండియా కంపెనీతో కమల్‌ పోల్చడం కలకలం రేపింది. దేశంలో ఈస్టిండియా కంపెనీ పోయి నార్త్‌ ఇండియా కంపెనీ వచ్చిందని మండిపడ్డారు. దీంతో కమల్‌ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్‌ గా మారాయి.