సింగిల్ ఇంజిన్‌తో డబుల్ పని.. 'మేక్ ఇన్ ఇండియా' అద్భుతం!
సాధారణంగా రైలు వేగంగా వెళ్లాలంటే లేదా ఎక్కువ బరువును లాగాలంటే డబుల్ ఇంజిన్ అవసరం.
By: Tupaki Desk | 26 May 2025 9:26 AM ISTసాధారణంగా రైలు వేగంగా వెళ్లాలంటే లేదా ఎక్కువ బరువును లాగాలంటే డబుల్ ఇంజిన్ అవసరం. కానీ ఇప్పుడు 'మేక్ ఇన్ ఇండియా' గొప్పతనాన్ని చూపించింది. ఒకే ఇంజిన్, రెండు ఇంజిన్ల పనిని చేయబోతోంది. పశ్చిమ రైల్వే అధికారి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత శక్తివంతమైన సరుకు రవాణా రైలు లోకోమోటివ్ (ఇంజిన్) సిద్ధమైందని తెలిపారు. ఈ అత్యాధునిక ఇంజిన్‌ను త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశానికి అంకితం చేయనున్నారు.
రూ. 21,405 కోట్ల ప్రాజెక్ట్
వినీత్ అభిషేక్ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కర్మాగారానికి 2022లో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 2025లోనే లోకోమోటివ్ సిద్ధమైంది. దీని బట్టి చూస్తే పనులు ఎంత చకచకా జరిగాయో అర్థమవుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 21,405 కోట్ల రూపాయలు. వచ్చే 11 సంవత్సరాలలో ఈ కర్మాగారంలో మొత్తం 1200 లోకోమోటివ్‌లు తయారు చేస్తారు.
9000 హార్స్‌పవర్ ఇంజిన్
ఈ కొత్త లోకోమోటివ్ ప్రత్యేకతలు ఏంటంటే.. ఇది 9000 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన ఇంజిన్. ఇది 4500 నుండి 5500 టన్నుల సరుకును మోసుకెళ్లే సరుకు రవాణా రైళ్లను లాగగలదు. ఈ ఇంజిన్‌లతో రైళ్ల వేగం గంటకు 120 నుంచి 125 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. ఈ ఇంజిన్‌లను పశ్చిమ డీఎఫ్‌సీ (డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్), రైల్వే గ్రేడెడ్ సెక్షన్లలో ఉపయోగిస్తారు. ఈ ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు భారత రైల్వే సరుకు రవాణా సామర్థ్యాన్ని అపారంగా పెంచుతాయి. బ్రాడ్ గేజ్, స్టాండర్డ్ గేజ్ రెండింటికీ ఈ ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ల నిర్మాణం భారత ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా', 'మేక్ ఫర్ వరల్డ్' కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి.
భారతదేశం తయారు చేసిన ఈ లోకోమోటివ్‌పై ప్రపంచం మొత్తం దృష్టి ఉందని వినీత్ అన్నారు. తక్కువ ఖర్చుతో, బెస్ట్ టెక్నాలజీను ఉపయోగించి ప్రపంచంలోనే అత్యుత్తమ లోకోమోటివ్ ఇంజిన్‌ను తయారు చేశామని ఆయన గర్వంగా చెప్పారు. అందుకే ఆఫ్రికాలోని కొన్ని దేశాలు, యూరోపియన్ దేశాలకు ఈ ఇంజిన్‌ను ఎగుమతి కూడా చేయనున్నారు. ఇది భారత ఇంజనీరింగ్ సామర్థ్యానికి 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం విజయానికి ఒక నిదర్శనం.
