Begin typing your search above and press return to search.

పదేళ్ల దోస్త్ ను పక్కకు నెట్టనున్న ‘పతంగి’! కారణం అదే!

దాదాపు పదేళ్లు టీఆర్ఎస్ (బీఆర్ఎస్), మజ్లిస్ ట్రావెల్ చేశాయి. ఇప్పుడు ఈ పొత్తుకు బ్రేక్ పడుతుందని రాజకీయల్లో సర్వత్రా చర్చ మొదలైంది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 6:00 AM GMT
పదేళ్ల దోస్త్ ను పక్కకు నెట్టనున్న ‘పతంగి’! కారణం అదే!
X

నిజాం కాలం నుంచి, దాదాపు 90 ఏళ్ల చరిత్ర కలిగిన ‘ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇతిహదుల్ ముస్లిమీన్-మజ్లిస్’ పార్టీ అవకాశాలను బట్టి మిత్ర పక్షాలను మార్చడంలో ధిట్ట. గతంలో సుదీర్ఘ కాలం యూపీఏలో కొనసాగిన మజ్లిస్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అంతగా పాల్గొనకపోయినా.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ తో దోస్తీ చేసింది. వాస్తవానికి 2014 ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు మజ్లిస్ సపోర్ట్ అవసరం లేదు. పూర్తి మెజారిటీతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ మరింత మెజారిటీ ఉంటే బిల్లులను ఏకపక్షంగా ఆమోదించుకోవచ్చనే కేసీఆర్ వ్యూహంలో భాగంగా మజ్లిస్ ను కూడా కలుపుకుంది.

దాదాపు పదేళ్లు టీఆర్ఎస్ (బీఆర్ఎస్), మజ్లిస్ ట్రావెల్ చేశాయి. ఇప్పుడు ఈ పొత్తుకు బ్రేక్ పడుతుందని రాజకీయల్లో సర్వత్రా చర్చ మొదలైంది. ప్రతిపక్షంలో కాకుండా ప్రభుత్వంతో కలిసి వేళ్తే.. తమ పనులు జరుగుతాయని పతంగి పార్టీ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ కు కేవలం 4 సీట్లు మాత్రమే ఎక్కువగా ఉండడంతో వారిని కూడా కలుపుకోవాలనే చూస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రొటెం స్పీకర్ వ్యూహం పారిందా..

ఇటీవల మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరొద్దీన్ ఒవైసీని నియమించింది రేవంత్ ప్రభుత్వం. ఆ సమయంలో బీఆర్ఎస్ నుంచి తీసుకోకపోవడంతో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ తో కలిసి వెళ్తుందని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ప్రొటెం స్పీకర్ నియామకంలో బీజేపీ మొదటి నుంచి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఎంఐఎం ప్రొటెం స్పీకర్ గా ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయమని తెగేసి చెప్పింది. అయినా కూడా కాంగ్రెస్ స్పందించలేదు. ఇక దీనితో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీ పెట్టిన రివ్యూ మీటింగ్ ను బీఆర్ఎస్ తిరస్కరించింది. కానీ మజ్లిస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బీఆర్ఎస్ లో ఉన్న మజ్లిస్ తాము కూడా రాలేమని చెప్పాలి. కానీ పిలవడంతోనే ఎటువంటి పేచీ పెట్టకుండా వెళ్లడంతో కాంగ్రెస్ లోకి వెళ్తుందని కన్ఫమ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎవరికి లాభం?

కాంగ్రెస్ తో మజ్లిస్ కలిసి వెళ్లడంపై ఇరు పార్టీలకు లాభమే కలుగుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొదట కాంగ్రెస్ కు కావాలసినంత మెజారిటీ ఉంటుంది (కాంగ్రెస్ కు 64+ మజ్లిస్ కు7= కలిసి 71). ప్రభుత్వ బిల్లులు సునాయాసంగా ఆమోదం పొందేందుకు వీలుంటుంది. ఇక మజ్లిస్ పార్టీ విషయానికి వస్తే కావలసిన పనులు చేయించుకునే వీలు ఉంటుంది. ప్రతిపక్షంలో ఉంటే దక్కేదేమీ లేదు. దీంతో పాటు పాతబస్తీలో పనులు చేయించుకునే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.

ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ కు వచ్చే సమయంలో ఎంఐఎం నేతలు హాస్పిటల్ కు వెళ్లి కేసీఆర్ ను చూసి, కేటీఆర్ ను పరామర్శించి వచ్చారు. అంటే కేసీఆర్ తో ఈ విషయం మాట్లాడినట్లు చర్చ కూడా జరుగుతోంది.