Begin typing your search above and press return to search.

చిన్న శ్రీనుకు టీడీపీ భారీ ఆఫర్..!! వైసీపీపై తీవ్రమైన ఎఫెక్ట్?

ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరిక ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

By:  Tupaki Political Desk   |   9 Sept 2026 3:07 PM IST
చిన్న శ్రీనుకు టీడీపీ భారీ ఆఫర్..!! వైసీపీపై తీవ్రమైన ఎఫెక్ట్?
X

ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరిక ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీలో క్రియాశీలంగా పనిచేసిన ఆయనను టీడీపీలోకి తీసుకురావడానికి కారణాలు ఏంటి? పార్టీలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసే లక్ష్యంతోపాటు భవిష్యత్తులోనూ పార్టీకి బలమైన నాయకుడిగా నిలబడతారనే ఉద్దేశంతోనే చిన్న శ్రీనును టీడీపీలోకి తీసుకువచ్చారని అంటున్నారు. అయితే ఆయనకు పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేదే ఎవరికీ అంతుచిక్కడం లేదని చెబుతున్నారు. అయితే ఏదో భారీ ఆఫర్ ఇవ్వడం వల్లే చిన్నశ్రీను టీడీపీలో చేరారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

విజయనగరం జడ్పీ చైర్మనుగా ఉన్న చిన్న శ్రీను గడిచిన రెండు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తున్నారు. ప్రధానంగా సీనియర్ నేత బొత్స మేనల్లుడిగా జిల్లావాసులకు పరిచయం అయిన చిన్నశ్రీను కాలక్రమేణా సొంత ఇమేజ్ సంపాదించుకున్నారని చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం జడ్పీటీసీగా నామినేషన్ వేసే వరకు చిన్నశ్రీను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగానే ఉండేవారు. కానీ, తన మేనమామలు బొత్స సత్యనారాయణ, బొత్స అప్పలనరసయ్య, బావ బడ్డుకొండ అప్పలనాయుడు అక్క బొత్స ఝాన్సీలక్ష్మి ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో తెర వెనుక అన్నీ తానై చిన్న శ్రీను నడిపేవారని అంటున్నారు. దీంతో బొత్స సోదరులు కన్నా జిల్లాలో క్షేత్రస్థాయి నాయకులు కార్యకర్తలతో చిన్న శ్రీనుకే ఎక్కువ సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇది గమనించే టీడీపీ అధిష్టానం చిన్నశ్రీనును పార్టీలోకి తీసుకుందని అంటున్నారు.

అయితే టీడీపీలో భేషరతుగా చేరానని చిన్న శ్రీను చెబుతున్నా, ఆయనకు భారీ ఆఫర్ ఉండి ఉంటుందని పరిశీలకులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్పీ పీఠం వదిలేసాలా టీడీపీ అధిష్టానంతో ఏమైనా ఒప్పందం జరిగిందా? లేక అంతకు మించి ఏమైనా పదవి ఇస్తారా? అనేది ఉత్కంఠకు దారితీస్తోందని అంటున్నారు. వాస్తవానికి జడ్పీ చైర్మన్ పీఠాన్ని నిలుపుకుంటూనే ఎమ్మెల్యే, మంత్రి అవ్వాలని చిన్న శ్రీను చాలాకాలంగా కలలు కంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. గతంలో బొత్స మంత్రిగా ఉండగా, ఆయన సతీమణి జడ్పీ చైర్మనుగా, ఆ తర్వాత ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు చిన్న శ్రీను కూడా తాను ఎమ్మెల్యే అవ్వాలని, కుటుంబం నుంచి ఎవరో ఒకరిని జడ్పీ పీఠంపై కూర్చోబెట్టాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు.

దీంతో టీడీపీ అధిష్టానం చిన్నశ్రీనుతో ఏ ఒప్పందం చేసుకుందనేది తెలియక ఆ పార్టీ కేడర్ తర్జనభర్జనకు గురి అవుతున్నట్లు చెబుతున్నారు. నిన్నటి వరకు జడ్పీ పీఠంపై ఆశ పెట్టుకున్న వారు చిన్నశ్రీను పార్టీలో చేరిన తర్వాత ఆందోళనకు లోనవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో చీపురుపల్లి, ఎచ్చెర్ల, ఎస్.కోట, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కొందరు నేతలకు టెన్షన్ మొదలైనట్లు చెబుతున్నారు. చిన్న శ్రీనుకు ఈ నాలుగు నియోజకవర్గాలలోనూ భారీగా అనుచరులు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచైనా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని ప్రధాన నేతలు కంగారు పడుతున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో చిన్న శ్రీను టీడీపీలో చేరడం వైసీపీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందనే అంచనాలు వేస్తున్నారు.

ఎవరూ ఊహించని విధంగా జడ్పీ చైర్మను చిన్న శ్రీను మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామంపై వైసీపీ నుంచి ఇంతవరకు ఎలాంటి రియాక్షన్ రాలేదు. అయితే చిన్న శ్రీను పార్టీని వీడటంపై వైసీపీ నేతలు వ్యూహాత్మకంగానే మౌనంగా ఉన్నారని అంటున్నారు. సీనియర్ నేత బొత్స కూడా స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఈ విషయమై ఎవరూ మాట్లాడటం లేదని అంటున్నారు. బొత్స జిల్లాకు వచ్చిన తర్వాతే స్పందించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే చిన్న శ్రీను రాజీనామా పార్టీపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ మాత్రం ఎక్కువగా జరుగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయనకు అనుచరులు ఉండటంతో త్వరలో భారీ ఎత్తున పార్టీ మార్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో వైసీపీ నాయకుల్లోనూ కేడర్ ను కాపాడుకోవడంపై టెన్షన్ మొదలైందని చెబుతున్నారు. మొత్తానికి చిన్న శ్రీను పార్టీ మార్పు రెండు పార్టీల్లోనూ తీవ్ర చర్చగా మారింది. ఆయనకు ఇచ్చే పదవులపై టీడీపీ నేతలు ఆందోళన చెందుతుండగా, చిన్న శ్రీను వల్ల ఏ స్థాయిలో నష్టం ఉంటుందనే అంచనాలు వేస్తూ వైసీపీ నేతలు కంగారు పడుతున్నారని చెబుతున్నారు.