బాలినేని ఆపరేషన్ ఆకర్ష్ .. జనసేనలోకి కీలక వైసీపీ నేత?
వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేశారు.
By: Tupaki Desk | 20 April 2025 3:51 PM ISTవైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేశారు. వైసీపీలో అసంతృప్త నేతలపై ఫోకస్ చేస్తున్న బాలినేని.. జనసేన బలోపేతమే లక్ష్యంగా వారిని పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో వైసీపీలోని ఓ కీలక నేతతో మంతనాలు సాగిస్తున్నారని, ఆయన కూడా జనసేనలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతోపాటు పార్టీకి భవిష్యత్తు లేదన్న అంచనాతో కందుకూరు మాజీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వైసీపీకి బైబై చెప్పేస్తారని టాక్ వినిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారవుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా వైదొలగుతుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోందని అంటున్నారు. ప్రధానంగా వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలు.. అక్కడ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ఇతర నేతలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు. గతంలో వైసీపీలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రి బాలినేని ఈ కోవలో అందరికంటే ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనలో చేరినప్పుడే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని ఖాళీ చేస్తానని ఆయన ప్రకటన చేశారు.ఇప్పుడు ఆ దిశగా అడుగులేస్తూ కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డిని జనసేనలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన మహీధర్ రెడ్డి సీనియర్ నేత. 1989లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2014 వరకు కాంగ్రెస్ లో కొనసాగారు. 2014లో వైసీపీలో చేరిన ఆయన కందుకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో పోటీకి దూరంగా ఉండిపోయారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్రమంత్రిగా పనిచేసిన మహీధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి కూడా శాసనసభ్యుడిగా సేవలందించారు. తొలి నుంచి టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న మహీధర్ రెడ్డి ఈ కారణంగా గత ఎన్నికల ముందు ఆ పార్టీ నుంచి ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని చెబుతున్నారు. వైసీపీ టికెట్ నిరాకరించినా, అందుకే ఆ పార్టీని వీడకుండా కొనసాగుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న మహీధర్ రెడ్డి అధినేత జగన్ వైఖరి మారుతుందని ఇన్నాళ్లు వెయిట్ చేశారని అంటున్నారు. కానీ, పార్టీ ఓడినా అధిష్టానం వైఖరి మారలేదన్న అంచనాతో ఇప్పుడు ఆయన వేరే ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకలాపాలు పుంజుకోవడం, భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తాదనే అంచనాతో మహీధర్ రెడ్డి జనసేనపై మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. పైగా ఒకప్పటి తన సహచరుడు మాజీ మంత్రి బాలినేని ఇప్పటికే జనసేనలో ఉండటంతో మహీధర్ రెడ్డి జనసేనలో చేరాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీనికి జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఓకే చెప్పారని అంటున్నారు. వివాద రహితుడు, సీనియర్ నేత, సుదీర్ఘ రాజకీయ కుటుంబ నేపథ్యం వల్ల మహీధర్ రెడ్డి చేరికను ఇతర భాగస్వామ్యపక్షాలు వ్యతిరేకించే పరిస్థితి లేదంటున్నారు. దీంతో త్వరలోనే మహీధర్ రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
