Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు వారం రోజులు టైం ఇచ్చిన బీఆరెస్స్ నేతలు!

ఈ సమయంలో పక్కనున్న మహారాష్ట్ర నేతలు కేసీఆర్ కు అల్టిమేటం జారీ చేశారు. ఇందులో భాగంగా వారం రోజుల్లో తమకు సమాధానం చెప్పానిపక్షంలో తమదారి తమదే అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   7 March 2024 1:25 PM GMT
కేసీఆర్  కు వారం రోజులు టైం ఇచ్చిన బీఆరెస్స్  నేతలు!
X

ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ దృష్టంతా ఆ ఎన్నికలపైనే ఉందని అంటున్నారు. అయితే ఈ సమయంలో పలువురు బీఆరెస్స్ నేతలు రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు ఇస్తూ కనిపిస్తున్నారు. దీంతో... వీరంతా ఏ క్షణమైనా కారు దిగిపోవచ్చనే చర్చ మొదలైంది. ఈ ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో కనిపించే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. ఈ సమయంలో బీఆరెస్స్ నేతల నుంచి కేసీఆర్ కు అల్టిమెటం జారీ అయ్యింది.

అవును... ప్రస్తుతం తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్న వేళ.. ఆ ఎన్నికల్లో సత్తా చాటాలని, బీఆరెస్స్ లేని తెలంగాణ రాజకీయం ఉండదని.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పై అభిమానం, మమకారం పోలేదని చెప్పాలని ఆ పార్టీ నేతలు పరితపిస్తున్నారు. ఈ సమయంలో పక్కనున్న మహారాష్ట్ర నేతలు కేసీఆర్ కు అల్టిమేటం జారీ చేశారు. ఇందులో భాగంగా వారం రోజుల్లో తమకు సమాధానం చెప్పానిపక్షంలో తమదారి తమదే అని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని బలంగా భావించిన కేసీఆర్... తెలంగాణ సెంటిమెంట్ తో ఉన్న "టీఆరెస్స్" ను సైతం "బీఆరెస్స్" గా మార్చారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయల సంగతి దేవుడెరుగు.. తెలంగాణలోనే ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన పరిస్థితి! ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండంతో మహారాష్ట్ర బీఆరెస్స్ నేతలు లైన్ లోకి వచ్చారు. వారికి కేసీఆర్ ఫోన్ లో సైతం టచ్ లోకి రావడం లేదనే కథనాలొస్తున్న వేళ వారు అల్టిమేటం జారీ చేశారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలంటూ అక్కడి బీఆరెస్స్ నేతలు.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. ఇందులో భాగంగా... తమరు అనుసరిస్తున్న వైఖరితో తాము ఎలా వ్యవహరించాలో తేల్చుకోలేకపోతున్నామని పేర్కొన్నారు! ఈ పరిస్థితుల్లో వారం రోజుల్లో దీనిపై స్పష్టత ఇవ్వాలని వారు కోరారు. లేదంటే తమ దారి తాము చూసుకుంటామని పేర్కొన్నారు. దీంతో... కేసీఆర్ ఈ లేఖకు ఎలాంటి రిప్లై ఇస్తారనేది ఆసక్తిగా మారింది.

కాగా... జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పాలని భావించిన కేసీఆర్... టీఆరెస్స్ ను బీఅరెస్స్ గా మార్చిన సంగతి తెలిసిందే. అనంతరం మహారాష్ట్రలో పార్టీని బాగానే ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా పలు బహిరంగ సభలు నిర్వహించడంతోపాటు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే... 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాల నేపథ్యంలో... కేసీఆర్ వైఖరి పూర్తిగా మారిపోయిందనేది మహారాష్ట్ర బీఆరెస్స్ నేతల ఆవేదన అని అంటున్నారు.