Begin typing your search above and press return to search.

ఒంటరి పురుషుల విషయంలో ‘సోనేవాడి’ సర్పంచ్ సంచలన నిర్ణయం.. తక్షణం వారికి ఈ పథకాలు..

భారతీయ సమాజంలో ‘వితంతువు’ అనే పదానికి ఉన్న వేదన, ఆ సామాజిక వర్గానికి అందుతున్న ప్రభుత్వ తోడ్పాటు అందరికీ తెలిసిందే.

By:  Tupaki Political Desk   |   7 Feb 2026 12:17 PM IST
ఒంటరి పురుషుల విషయంలో ‘సోనేవాడి’ సర్పంచ్ సంచలన నిర్ణయం.. తక్షణం వారికి ఈ పథకాలు..
X

భారతీయ సమాజంలో ‘వితంతువు’ అనే పదానికి ఉన్న వేదన, ఆ సామాజిక వర్గానికి అందుతున్న ప్రభుత్వ తోడ్పాటు అందరికీ తెలిసిందే. కానీ, భార్యను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన పురుషుల (విధురులు) అంతరంగిక వేదనను, వారి ఆర్థిక, సామాజిక అవసరాలను సమాజం ఇప్పటి వరకు గుర్తించలేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా సోనేవాడి గ్రామసభ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. వితంతువుల తరహాలోనే విధురులకు కూడా ప్రభుత్వ పథకాలు, పింఛన్లు అందాలంటూ ఆ గ్రామసభ చేసిన తీర్మానం ఒక సరికొత్త సామాజిక విప్లవానికి నాందిగా నిలుస్తోంది.

నిశ్శబ్ద వేదన

సాధారణంగా పురుషుడు అనగానే సమాజం దృక్పథం వేరుగా ఉంటుంది. వయసు మళ్లిన కాలంలో భార్య చనిపోయిన పురుషులు ఎదుర్కొనే మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బందులు చెప్పక్కర్లేదు. పిల్లలు ఉన్నా లేకున్నా, ఇంటి ఇల్లాలు లేని వెలితి వారిని ఒంటరితనం వైపు నెట్టివేస్తుంది. వితంతువుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నప్పటికీ, విధురులను ప్రభుత్వం ‘ఒంటరి పురుషులు’గా గుర్తించి ప్రత్యేక పథకాలను రూపొందించలేదు. ఈ వివక్షను రూపుమాపాలనే ఉద్దేశంతోనే సోనేవాడి గ్రామ సర్పంచ్ శకుంతల తాయి ఒక సాహసోపేతమైన ముందడుగు వేశారు.

ఒక చారిత్రక అవసరం

గ్రామసభలో 150 మంది విధురుల సంక్షేమం కోసం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం వెనుక ఉన్న ఆర్తి గమనార్హం. కేవలం సానుభూతి చూపడమే కాకుండా, వారిని కూడా ప్రభుత్వ రక్షణ కవచం కిందికి తీసుకురావాలన్నది ఈ తీర్మానం సారాంశం. వితంతువులకు అందే సామాజిక భద్రతా పింఛన్లను భార్యలు చనిపోయిన భర్తలకు కూడా వర్తింపజేయాలి. ఒంటరి పురుషులుగా మిగిలిన వారికి ఆరోగ్య భీమా, గృహ నిర్మాణ పథకాల్లో ప్రాధాన్యత కల్పించాలి. విధురులను కేవలం ‘ఒంటరి వ్యక్తులు’గా కాకుండా, ప్రత్యేక శ్రద్ధ అవసరమైన వర్గంగా గుర్తించాలని తీర్మానాలు చేశారు.

సర్పంచ్ శకుంతల తాయి నిర్ణయం

ఇటీవల సోనేవాడికి సర్పంచ్ గా శకుంతల తాయి ఎన్నికయ్యారు. ఆమె నిర్ణయాలపై గ్రామం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆమె నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయం గ్రామ పరిధికే పరిమితం కాకూడదు. ’’భార్యలు చనిపోయిన భర్తలు కూడా ఒంటరి పురుషులే. వారు పడే కష్టాలు, వారి సామాజిక స్థితిగతులు వితంతువులకు ఏమాత్రం తక్కువ కాదు’ అని పేర్కొనడం విశేషం. ఈ నిర్ణయం ద్వారా సమాజంలో జెండర్ సమానత్వంతో పాటు వృద్ధాప్య ఆపన్న హస్తం అందించడంలో ఉన్న లోపాలను ఎత్తిచూపారు. 150 మంది విధురుల సంక్షేమం బాధ్యతను గ్రామస్థులందరూ భుజాన వేసుకోవడం మానవత్వానికి నిదర్శనం.

ప్రభుత్వాలకు విజ్ఞప్తి

మారుతున్న సామాజిక పరిస్థితులలో కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతున్న తరుణంలో, ఒంటరిగా మిగిలిపోయిన వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. సోనేవాడి గ్రామసభ పంపిన తీర్మాన పత్రం ఇప్పుడు ప్రభుత్వాల ముందుకు ఉంది. ప్రభుత్వం విధురుల సంక్షేమాన్ని చట్టపరంగా గుర్తించి, బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాల అమలులో లింగ వివక్ష ఉండకూడదు. లబ్ధిదారుని అవసరాన్ని బట్టి పథకాలు అందాలి. కేవలం డబ్బు ఇవ్వడమే కాకుండా, విధురుల కోసం గ్రామ స్థాయిల్లో ‘డే కేర్ సెంటర్లు’ లేదా ‘కౌన్సెలింగ్ సెంటర్లు’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం నేడు దేశానికి ఆదర్శంగా నిలిచింది. పురుషుడు కన్నీరు కార్చకూడదని, అన్నీ తానై భరించాలని భావించే పితృస్వామ్య సమాజంలో, వారి కష్టాలను గుర్తించడం అభినందనీయం. సోనేవాడి తీర్మానం కేవలం ప్రభుత్వ పథకాల కోసమే కాదు, సమాజం తన ఆలోచనా ధోరణిని మార్చుకోవాలని కోరుతోంది. ఈ గ్రామసభ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా విధురుల సంక్షేమ చర్చ ప్రారంభం కావాలి. అప్పుడే మనం నిజమైన సంక్షేమ రాజ్య స్థాపన దిశగా అడుగులు వేస్తున్నట్లు లెక్క. సోనేవాడి చూపిన బాటలో మరిన్ని గ్రామాలు, పట్టణాలు, చివరకు రాష్ట్ర ప్రభుత్వాలు పయనించాలని ఆశిద్దాం.