డిటర్జెంట్‌తో 2.3 కోట్ల లీటర్ల కల్తీ పాలు.. మనుషులను బతకనివ్వరారా భూమ్మీద..
ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడిన ఒక భారీ కల్తీ పాల కుంభకోణాన్ని పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఎట్టకేలకు బట్టబయలు చేశారు.
By: A.N.Kumar | 14 July 2026 5:49 PM ISTమనం రోజూ పొద్దున్నే లేవగానే తాగే పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ ఆ పాలలో కాస్త డిటర్జెంట్ పౌడర్, చిటికెడు పామ్ ఆయిల్, మరికొన్ని నాసిరకం రసాయనాలు కలిపి ఇస్తే? వినడానికే ఒళ్ళు జలదరిస్తోంది కదూ! మహారాష్ట్రలోని ధారాశివ్ ఉస్మానాబాద్ జిల్లా భూమ్ తాలూకాలో ఇలాంటి ఒక అద్భుతమైన "సైంటిఫిక్ ప్రయోగం" గత ఆరు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోయింది. స్వచ్ఛమైన అమృతం లాంటి పాలలో డిటర్జెంట్ కలిపి, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడిన ఒక భారీ కల్తీ పాల కుంభకోణాన్ని పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఎట్టకేలకు బట్టబయలు చేశారు.
పాలు తెల్లగా ఉండాలి.. పైన మీగడ కట్టాలి... ఇందుకోసం మన ఘనాపాటి కల్తీ బాబులు వాడిన ఫార్ములా చూస్తే షాక్ అవ్వాల్సిందే. బట్టలు ఉతికే డిటర్జెంట్ పౌడర్, పామ్ ఆయిల్, ఇంకా ఏవేవో పనికిరాని కెమికల్ పౌడర్లను కలిపి ల్యాబ్‌లో తయారు చేసినట్లు సింథటిక్ పాలను సృష్టించారు.
లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే
అధికారులు స్వాధీనం చేసుకున్న విక్రయ రిజిస్టర్లను చూసి వారి బుర్రలు తిరిగాయి. గత ఆరు నెలల్లో వీరు చేసిన మాయాజాలం అంతా ఇంతా కాదు వాడిన నాసిరకం మిల్క్ పౌడర్ సుమారు 2,30,470 కిలోలు. తయారు చేసిన సింథటిక్ పాలు దాదాపు 23,04,070 లీటర్లు. మార్కెట్లో అమ్మిన కల్తీ పాలు 2.3 కోట్ల లీటర్లకు పైమాటే! ఈ మాయా బజార్ విలువ అక్షరాలా రూ.9.21 కోట్లు కావడం విస్తుగొలుపుతోంది.
వీరి వ్యాపార సూత్రం చాలా సింపుల్... ప్రతి 100 లీటర్ల స్వచ్ఛమైన పాలలో 10 లీటర్ల ఈ కెమికల్ పాలను గుట్టుచప్పుడు కాకుండా కలిపేసేవారు. వినియోగదారుడికి రంగు మారుతుందన్న భయం లేదు, చిక్కదనం తగ్గుతుందన్న డౌట్ రాదు. ఎంతైనా 'కల్తీ' కళలో వీరు పిహెచ్‌డీ చేసినట్టున్నారు!
పశువుల దాణా పేరుతో పాయజన్ బిజినెస్
భూమ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీగణేష్ కనగుడే తెలిపిన వివరాల ప్రకారం ఈ రాకెట్‌ను పశువుల దాణా వ్యాపారం పేరుతో నడిపించారు. దాడుల్లో 61 సంచుల కల్తీ మిల్క్ పౌడర్ దొరికింది. బాలాసాహెబ్ గోడ్గే అనే మహాశయుడు ఈ కల్తీ పౌడర్‌ను స్థానిక డెయిరీలకు సప్లై చేసినట్లు తేలింది. భూమ్ తాలూకా నుండి ప్రతిరోజూ లక్షల లీటర్ల పాలు, 70 నుండి 80 టన్నుల ఖోవా ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతుంటుంది. అంటే ఈ పాటికే ఎంతమంది ఈ డిటర్జెంట్ పాలను రుచి చూశారో ఆ దేవుడికే తెలియాలి. ఈ రసాయనాల పాలు తాగితే కాలేయం, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ నాశనమవడం ఖాయం. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు ఇది స్లో పాయిజన్ లాంటిది.
నిందితులు ఎక్కడ? చట్టం ఏం చెబుతోంది?
ఈ కేసులో ఏడుగురిపై ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కేసులు పెట్టారు. కేసు నమోదై ఎనిమిది రోజులు గడిచినా నిందితులు మాత్రం దొరకకుండా 'స్వచ్ఛమైన' పాలలో నీళ్లలాగా మాయమైపోయారు. వారి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం గాలిస్తోంది.
మన ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం ఇలా ప్రాణాలతో చెలగాటమాడితే రూ.10 లక్షల జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందట. మరి ఈ కల్తీ కేటుగాళ్లకు ఆ శిక్ష పడుతుందో లేదో చూడాలి. అప్పటివరకు పాల ప్యాకెట్ కొనేటప్పుడు అది 'పాలేనా' లేక 'సర్ఫ్ ఎక్సెల్' మిశ్రమమా అని కాస్త చూసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది!
సోర్స్ :ndtv
