డ్రైవర్లకు 'భాషా' పరీక్ష: నెట్టింట వైరల్ అవుతున్న మహారాష్ట్ర నిర్ణయం!
మహారాష్ట్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ తప్పనిసరిగా రావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది.
By: Tupaki Political Desk | 10 July 2026 5:00 PM ISTమహారాష్ట్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ తప్పనిసరిగా రావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. వచ్చేనెల 16వ తేదీలోగా మరాఠీ నేర్చుకోవాలని లేనిపక్షంలో లైసెన్సులు రద్దు చేస్తామని ప్రకటించింది. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపళంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తమ ఉపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో మరాఠీ మాత్రమే మాట్లాడాలని కొన్నేళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది. ప్రధానంగా హిందీని వ్యతిరేకిస్తున్న మరాఠీ భాషాభిమానులు మాతృభాషపై ఉద్యమాలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం స్థానికుల భావోద్వేగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంచలన నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
మహారాష్ట్రలోని ఆటో రిక్షా, టాక్సీ డ్రైవర్లందరికీ మరాఠీ భాషా ప్రావీణ్యం తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ జారీ చేసిన ఉత్తర్వులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భాషా సంస్కృతిని కాపాడుకోవాలనే సాకుతో తీసుకున్న ఈ నిర్ణయం, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వలస వచ్చిన లక్షలాది మంది డ్రైవర్ల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందన్న ఆగ్రహానికి కారణమవుతోంది. ఆగస్టు 16వ తేదీ లోపు మరాఠీ భాషా పరీక్షలో ఉత్తీర్ణత సాధించని డ్రైవర్ల లైసెన్సులు, బ్యాడ్జీలను రద్దు చేస్తామని రవాణా మంత్రి ప్రతాప్ స్పష్టం చేశారు. గతంలో ఈ నిబంధన ఉన్నప్పటికీ, ఉల్లంఘించిన వారికి కేవలం 500 రూపాయల జరిమానాతో సరిపెట్టేవారు. కానీ ఇప్పుడు, కేవలం జరిమానాతో కాకుండా నేరుగా లైసెన్సు రద్దు చేయడం ద్వారా వలస డ్రైవర్లపై ప్రభుత్వం కత్తి వేలాడదీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, నాన్-మరాఠీ డ్రైవర్లకు భాష నేర్పించేందుకు ప్రభుత్వం 450 మంది ఉపాధ్యాయులను నియమించినట్లు చెబుతున్నారు.
ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వాదిస్తున్న దాని ప్రకారం, ప్రయాణికులతో, ముఖ్యంగా స్థానిక ప్రజలతో మెరుగ్గా కమ్యూనికేట్ చేయడానికి డ్రైవర్లకు స్థానిక భాష వచ్చి ఉండటం అవసరమని అంటున్నారు. ఇది ప్రయాణికుల భద్రత, సౌకర్యానికి మేలు చేస్తుందని, సంస్కృతిని పరిరక్షించే బాధ్యత తమదని అధికార పక్షం వాదిస్తోంది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది కేవలం వలస కార్మికులను వేధించడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి వేస్తున్న ఎత్తుగడ అని వారు ఆరోపిస్తున్నారు.
సమైక్య భారతదేశంలో ఇటువంటి నిర్ణయాలు ఇతర రాష్ట్రాల కార్మికులకు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. రాజ్యాంగం కల్పించిన 'దేశంలో ఎక్కడైనా నివసించే, పనిచేసే హక్కు'కు ఇది విరుద్ధమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ప్రతి రాష్ట్రం ఇలాగే స్థానిక భాష పేరుతో కఠిన నిబంధనలు విధిస్తే, అది అంతర్రాష్ట్ర వలస కార్మికుల ఉపాధిని దెబ్బతీయడమే కాకుండా, ప్రాంతీయవాదానికి తావిస్తుందని అంటున్నారు. ముంబై వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో, డ్రైవర్లుగా పనిచేస్తున్న వలసదారులు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. వారిని హఠాత్తుగా పరీక్షల పేరుతో ఇబ్బంది పెట్టడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తన భాషాభిమానాన్ని చాటుకోవడం తప్పు కాదు కానీ, అది వందలాది కుటుంబాల పొట్టగొట్టే విధంగా ఉండకూడదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. భాష నేర్చుకోవడాన్ని ఒక సానుకూల ప్రోత్సాహకంగా మార్చాలని సూచిస్తున్నారు. ఉపాధికి అడ్డుగోడగా మార్చి బలవంతంగా భాష నేర్పడం సరైనది కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
