పెళ్లిలో వినూత్న విప్లవం: అతిథులకు 'ఇన్సూరెన్స్' రిటర్న్ గిఫ్ట్.. నవ దంపతులను మెచ్చుకున్న ప్రధాని మోదీ
సాధారణంగా పెళ్లిళ్లలో వధూవరులకు బహుమతులు ఇవ్వడం.. వచ్చిన అతిథులకు తాంబూలాలు లేదా స్వీట్లు.. ఖరీదైన రిటర్న్ గిఫ్ట్‌లు అందించడం మన సంప్రదాయం.
By: A.N.Kumar | 29 Jun 2026 3:05 PM ISTసాధారణంగా పెళ్లిళ్లలో వధూవరులకు బహుమతులు ఇవ్వడం.. వచ్చిన అతిథులకు తాంబూలాలు లేదా స్వీట్లు.. ఖరీదైన రిటర్న్ గిఫ్ట్‌లు అందించడం మన సంప్రదాయం. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ నవదంపతులు మాత్రం తమ వివాహ వేడుకను సరికొత్త సామాజిక విప్లవానికి వేదికగా మార్చారు. ఆడంబరాలకు పోకుండా.. సమాజానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన నిర్ణయంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. తమ పెళ్లికి వచ్చిన అతిథులతో పాటు గ్రామస్థులందరికీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలను రిటర్న్ గిఫ్ట్‌గా అందించి సరికొత్త ఆదర్శాన్ని నెలకొల్పారు. ఈ వినూత్న ఆలోచన దేశ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని సైతం ఆకర్షించింది. ఆయన తన ప్రాచుర్యం పొందిన రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' లో ఈ జంట చేసిన సామాజిక సేవను ప్రత్యేకంగా ప్రస్తావించి, దేశవ్యాప్తంగా అభినందనలు కురిపించారు.
3,500 మందికి లభించిన ఆర్థిక భరోసా
మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఈ నవదంపతులు తమ వివాహాన్ని కేవలం ఒక కుటుంబ వేడుకగా ముగించాలనుకోలేదు. సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటాలనుకున్నారు. ఇందులో భాగంగా తమ పెళ్లికి హాజరైన బంధుమిత్రులతో పాటు, తమ గ్రామానికి చెందిన దాదాపు 3,500 మంది గ్రామస్థులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష విలువైన ప్రమాద బీమా పాలసీని ఉచితంగా చేయించారు. నిరుపేద కుటుంబాల్లో అనుకోని ప్రమాదం జరిగితే ఆయా కుటుంబాలు రోడ్డున పడకుండా వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉన్నతమైన ఆశయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగారు నాణేలు, వెండి వస్తువులు లేదా ఇతర విలాసవంతమైన బహుమతుల కంటే ఒకరి జీవితానికి భద్రత కల్పించే బీమా పాలసీ ఎంతో ఉత్తమమైనదని వారు నిరూపించారు.
'మన్ కీ బాత్' లో ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోదీ నాందేడ్ జంట తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎంతగానో కొనియాడారు. వివాహాలు అనేవి కేవలం సంపదను, ఆడంబరాలను ప్రదర్శించే వేదికలుగా మారిపోతున్న నేటి రోజుల్లో.. ఇలా సామాజిక బాధ్యతను గుర్తు చేసే విధంగా పెళ్లిళ్లు జరగడం ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ జంట చేసిన పని సమాజంలో ఒక పాజిటివ్ సందేశాన్ని తీసుకెళ్లిందని, దేశంలోని మరికొందరు యువతీ యువకులు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేయాలని ప్రధాని ఆకాంక్షించారు. "వివాహ వేడుకలను సామాజిక హితానికి వేదికగా మార్చిన ఈ నవదంపతుల ఆలోచన దేశానికే ఆదర్శం. ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలే సమాజంలో పెద్ద మార్పులకు నాంది పలుకుతాయి." అని మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.
ప్రధాని గుర్తింపుపై వధువు మంజూష భావోద్వేగం
ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రశంసలు దక్కడంపై వధువు మంజూష ఆనందం వ్యక్తం చేశారు. తమ పెళ్లి సందర్భంగా తాము చేసిన ఒక చిన్న ప్రయత్నం ఏకంగా దేశ ప్రధాని వరకు చేరుతుందని తాము ఊహించలేదని.. ఇది తమకు ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. ప్రధాని మాటలు తమకు సమాజం పట్ల మరింత బాధ్యతను గుర్తు చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంజూష యువతకు, వివాహం చేసుకోబోయే కుటుంబాలకు ఒక విలువైన సూచన చేశారు. "నేటి కాలంలో పెళ్లిళ్ల కోసం లక్షలు, కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఆ వృథా వ్యయంలో కొంత భాగాన్ని కత్తిరించి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు లేదా నిరుపేదల సంక్షేమానికి వెచ్చిస్తే ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. అవసరమైన వారికి సహాయం చేయడం, బీమా వంటి భద్రతా పథకాలను అందించడం ద్వారా లభించే తృప్తి, నిజమైన ఆనందం మరెందులోనూ దొరకదు" అని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అభినందనలు
ఈ వినూత్న కార్యక్రమం నెట్ ఇంట వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాలో కూడా దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. నెటిజన్లు ఈ నవదంపతులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. "రిటర్న్ గిఫ్ట్ అంటే ఇలా ఉండాలి".. "పెళ్లి ఖర్చులను వృథా చేయకుండా సమాజానికి ఉపయోగపడేలా చేయడం గొప్ప విషయం" అంటూ కామెంట్లు పెడుతున్నారు. పెళ్లిళ్లను ఆడంబరాల కోసం కాకుండా సామాజిక సేవకు వేదికగా మలిచిన ఈ మహారాష్ట్ర జంట నిజంగానే నేటి సమాజానికి ఒక సరికొత్త దిక్సూచిగా నిలిచింది.
