Begin typing your search above and press return to search.

'మహా' రాజకీయాల్లో ఏమి జరుగుతోంది ? జట్టు పీక్కుంటున్నారా ?

మహారాష్ట్ర రాజకీయాల్లో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధంకావటంలేదు. రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాల ను మించిపోతోంది.

By:  Tupaki Desk   |   18 July 2023 6:49 AM GMT
మహా రాజకీయాల్లో ఏమి జరుగుతోంది ? జట్టు పీక్కుంటున్నారా ?
X

మహారాష్ట్ర రాజకీయాల్లో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధంకావటంలేదు. రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాల ను మించిపోతోంది. ఎన్సీపీని అజిత్ పవార్ నిలువుగా చీల్చేసి తన వర్గం ఎంఎల్ఏల తో వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. ఎన్సీపీకి 53 మంది ఎంఎల్ఏలున్నారు. వీళ్ళల్లో 30 మంది మద్దతుదారులతో అజిత్ పార్టీని నిట్టనిలువు గా చీల్చేశారు. తన మద్దతుదారులతో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తో చేతులు కలిపారు.

దాంతో అజిత్ వర్గం లోని తొమ్మిది మంది ఎంఎల్ఎల కు వెంటనే మంత్రిపదవులు కూడా దొరికాయి. అంటే ఇపుడు మహారాష్ట్ర ప్రభుత్వం లో శివసేన చీలిక వర్గమైన ఏక్ నాథ్ షిండేవర్గం, బీజేపీ, ఎన్సీపీ లోని చీలిక వర్గాలున్నాయి. పార్టీని చీల్చేసిన అజిత్ ఇపుడు అసలైన ఎన్సీపీ తమదే అని కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర వాదిస్తున్నారు. పార్టీ గుర్తింపు, గుర్తు, జెండా సమస్తం తమకే దక్కాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఈ విషయం లో ఇటు ఎన్సీపీ జాతీయ అద్యక్షుడు శరద్ పవార్, అటు అజిత్ పవార్ వర్గాల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.

పార్టీని చీల్చేసిన అజిత్ అలాగే ఉండకుండా మళ్ళీ శరద్ పవార్ ను వచ్చి కలిశాడు. ఎందుకంటే కేవలం ఆశీస్సుల కోసమే అని చెప్పాడు. తన వర్గం లోని అందరితో వచ్చి శరద్ ను కలిశాడు కాబట్టి ఏమోలే అని అందరు సరిపెట్టుకున్నారు. కానీ నాలుగురోజుల్లో వరుసగా మూడుసార్లు శరత్ ను అజిత్ కలిశాడు. దాంతో ఇద్దరి మధ్య ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధంకావటంలేదు.

ఆశీస్సుల కోసమన్నపుడు ఒకసారి కలుస్తారు. అంతేకానీ నాలుగురోజుల్లో మూడుసార్లు కలవరు. దీంతో వార్లిద్దరి భేటీ కారణం ఏమిటో అర్ధంకాక అటు ఏక్ నాధ్ షిండే ఇటు బీజేపీ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాయి.

ప్రభుత్వంలో భాగమైన అజిత్ వర్గం ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న శరద్ పవార్ ను ఎందుకు కలుస్తున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోక తప్పదనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. అదే నిజమైతే నష్టపోయేది ఎవరు ? లాభపడేది ఎవరన్నదే అర్ధంకాక అందరు జుట్లు పీక్కుంటున్నారు.