ముక్కులు ముక్కలుగా ‘మహాఘట్ బంధన్’.. బిహార్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది?
గత ఎన్నికల్లో 70 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే తాజా ఎన్నికల్లో గతంలో ఇచ్చిన స్థానాలను మార్చాలని కాంగ్రెస్ కోరుతోంది.
By: Tupaki Desk | 18 Sept 2025 12:00 AM ISTశాసనసభ ఎన్నికల వేళ బిహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానంగా ప్రతిపక్షాల కూటమి మహాఘట్ బంధన్ లో సీట్ల లొల్లి ఉత్కంఠ రేపుతోంది. కూటమి ఏ క్షణంలో అయినా ముక్కలవుతుందని కథనాలు వస్తున్నాయి. కూటమిలో ఉన్న ఆర్జేడీ మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తానని అంటుండగా, జాతీయ పార్టీ కాంగ్రెస్ పోటీ చేసే స్థానాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గెలిచే అవకాశం ఉన్న స్థానాలలోనే పోటీ చేస్తామని కాంగ్రెస్ వాదిస్తుండటం, అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీలు గొంతెమ్మ కోర్కెలతో పేచీకి దిగుతుండటంతో రాజకీయం హీట్ పుట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో మహాఘట్ బంధన్ లో పార్టీలు అన్ని కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? లేక పార్టీలు తలోదారి చూసుకుంటాయా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉండగా, మహాఘట్ బంధన్ కూటమిలోని ప్రధాన పార్టీ ఆర్జేడీ సొంతంగా 150 స్థానాల్లో పోటీ చేస్తానని పట్టుబడుతోంది. దీంతో మిగిలిన పక్షాలైన కాంగ్రెస్, సీపీఐ-ఎంఎల్ లిబరేషన్, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, వీఐపీ, ఆర్ఎల్ఎల్పీ పార్టీలు సర్దు కోవాల్సివుంది. అయితే గత ఎన్నికల్లో 70 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ మళ్లీ అన్ని స్థానాలు కోరుతున్నాయి. ఇదే సమయంలో గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న వీఐపీ పార్టీ ఇప్పుడు మహాఘట్ బంధన్ కూటమిలో చేరింది. ఆ పార్టీ 60 అసెంబ్లీ స్థానాలతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతోంది. అదేవిధంగా లిబరేషన్ పార్టీ 40 సీట్లు డిమాండ్ చేస్తోంది. దీంతో విసుగు చెందిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మొత్తం 243 స్థానాల్లో పార్టీ పోటీ చేసే సత్తా తమ పార్టీకి ఉందని ప్రకటించడం సంచలంగా మారింది.
మిత్రపక్షాల గొంతెమ్మ కోర్కెలను తీర్చలేనని భావిస్తున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒంటరిగా పోటీ చేసే ఆలోచన చేస్తున్నారా? అన్న చర్చ ఊపందుకుంది. బిహార్ లో 2004 నుంచి పొత్తు రాజకీయాలే కొనసాగుతున్నాయి. మధ్య ఒకటి రెండు సార్లు తప్ప ఎక్కువ కాలం కాంగ్రెస్-ఆర్జేడీ కలిసి పనిచేశాయి. ఈ రెండు పార్టీలతో జేడీయూ చేతులు కలిపి 2015 ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే 2020 ఎన్నికల్లో జేడీయూ విడిపోయి.. బీజేపీ పక్షాన నిలిచింది. ఇలా బిహార్ లో పొత్తు రాజకీయాలు కూడికలు, తీసివేతలు మాదిరిగా సాగుతుంటాయి. ఇక తాజా ఎన్నికల్లో ఇండి కూటమిగా మహాఘట్ బంధన్ రాష్ట్రంలో పోటీ చేస్తుందని అనుకుంటుండగా, సీట్ల లొల్లి కూటమిని కకావికలం చేస్తుందా? అన్న సందేహాలకు కారణమవుతోంది.
గత ఎన్నికల్లో 70 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే తాజా ఎన్నికల్లో గతంలో ఇచ్చిన స్థానాలను మార్చాలని కాంగ్రెస్ కోరుతోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిన 51 స్థానాల్లో దాదాపు 37 స్థానాల్లో పోటీకి ఆ పార్టీ విముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. తమకు కేటాయించిన సీట్లలో కొన్ని చోట్ల గత దశాబ్దన్నరగా మహాఘట్ బంధన్ పార్టీలు ఏవీ గెలిచిన చరిత్ర లేదని కాంగ్రెస్ చెబుతోంది. ఇలాంటి స్థానాలు సుమారు 21 వరకు ఉన్నట్లు కాంగ్రెస్ లెక్క చెబుతోంది. ఈ స్థానాల్లో కొన్ని ఆర్జేడీ తీసుకుని, గత ఎన్నికల్లో ఆర్జేడీ పోటీ చేసిన స్థానాలను తమ పార్టీకి కేటాయించాల్సిందిగా కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అయితే కాంగ్రెస్ వాదనతో ఏకీభవించేందుకు ఆర్జేడీ నేతలు ససేమిరా అంటున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందని ప్రకటనలు చేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ తో సంప్రదించకుండా తాను సీఎం అభ్యర్థిని అంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. తేజస్వి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం లేకపోయినా, తమకు మాట మాత్రం చెప్పకుండా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభలో ఉండగా, ఏకపక్షంగా ఎలా ప్రకటించేస్తారని కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి సిగపట్లు మహాఘట్ బంధన్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
