Begin typing your search above and press return to search.

మాగుంట...నెల్లూరు ఎంపీగా...?

దాంతో 1991లో మొదటిసారిగా మాగుంట సుబ్బరామిరెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా కాంగెర్స్ తరఫున పోటీ చేసి గెలిచారు

By:  Tupaki Desk   |   13 Oct 2023 7:30 AM GMT
మాగుంట...నెల్లూరు ఎంపీగా...?
X

ఒంగోలు ఎంపీగా ఉన్న సీనియర్ నేత, వైసీపీ లో కీలక నాయకుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఈసారి ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేయిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఒంగోలు అంటే మాగుంట ఫ్యామిలీ అన్నట్లుగా బలమైన ముద్ర వేసుకుని రాజకీయంగా కూడా తమకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని మూడున్నర దశాబ్దాల కాలంలో తెచ్చుకున్న మాగుంట కుటుంబానికి వ్యాపార రాజకీయ బాంధవ్యాలు అన్నీ కూడా ప్రకాశం జిల్లాతోనూ ముడిపడి ఉన్నాయి.

దాంతో 1991లో మొదటిసారిగా మాగుంట సుబ్బరామిరెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. మధ్యలో ఆయన మరణించడంతో ఆయన సతీమణి పార్వతమ్మ ఎంపీగా చేశారు. ఇక 1998లో తొలిసారిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తరువాత 2004, 2009లలో ఆయన రెండు సార్లు ఎంపీ అయ్యారు. 2019లో వైసీపీ తరఫున నెగ్గారు.

ఇక 2024 ఎన్నికల్లో తన వారసుడు అయిన రాఘవరెడ్డిని ఎంపీగా బరిలోకి దించాలని శ్రీనివాసులురెడ్డి భావిస్తున్న క్రమంలో లిక్కర్ స్కాం లో ఆయన ఇరుక్కోవడం జరిగింది. ఈ క్రమంలో మాగుంటనే ఎంపీ అభ్యర్ధిగా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ చిత్రంగా మాగుంటను తెచ్చి నెల్లూరు నుంచి ఎంపీగా బరిలో నిలబెట్టాలని చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

నెల్లూరులో జరిగిన వైసీపీ పార్టీ సమావేశంలో మాగుంట పాల్గొనడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. నెల్లూరు జిల్లాలోనూ మాగుంటను మంచి పట్టు ఉండడంతో ఈసారికి నెల్లూరు నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారని అంటున్నారు.

ఇక నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకరరెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగుతున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రెబెల్ గా మారిపోవడంతో పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మార్పులు అనివార్యం అయ్యాయి. అయితే రాజ్యసభ సభ్యుడు వేమూరి ప్రభాకరరెడ్డిని నెల్లూరు నుంచి ఎంపీగా దించుతారు అని అంతా అనుకున్నారు. కానీ చిత్రంగా మాగుంట నెల్లూరు పార్టీ మీటింగులో కనిపించడంతో ఇపుడు ఆయన మీదనే అందరి ఫోకస్ పడింది.

నెల్లూరులో వైసీపీ బలంగా ఉన్నప్పటికీ స్థానికంగా ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలు తయారు కావడంతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిణామాల క్రమంలో అర్ధ బలం అంగబలం దండీగా ఉన్న మాగుంటను ముందు పెడితే మొత్తానికి మొత్తం పది అసెంబ్లీ సీట్లను మరోసారి గెలుచుకోవచ్చు అన్న స్కెచ్ ని వైసీపీ గీస్తోంది అని అంటున్నరు. చూడాలి మరి మాగుంట విషయంలో జరుగుతున్న ప్రచారం ఎంత వరకూ నిజం అవుతుందో. ఏది ఏమైనా మాగుంట బరిలోకి దిగితే ప్రతిపక్షాలకు అది గట్టి సవాల్ గానే ఉంటుంది అని అంటున్నారు.